Trump Iran Military Action: ఇరాన్‌పై యుద్దానికి ట్రంప్‌ మళ్లీ సిద్దమౌతున్నాడా?

ఇరాన్‌పై మరోసారి సైనిక దాడులకు ట్రంప్ సిద్ధమవుతున్నారా? ఇజ్రాయెల్‌కు చేరిన 10కి పైగా అమెరికా సైనిక విమానాలు, మధ్యప్రాచ్యంలో బలగాల మోహరింపు, తాజా పరిణామాల పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Balachander
Published on: 30 Oct 2026 2:29 PM IST
Trump Iran Military Action: ఇరాన్‌పై యుద్దానికి ట్రంప్‌ మళ్లీ సిద్దమౌతున్నాడా?
X

Trump Iran Military Action: అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? ఇప్పటికే ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు సరికొత్త మలుపు తీసుకుంటున్నాయి. ఇరాన్‌పై మరోసారి సైనిక చర్యకు దిగే అంశాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. దీనికి తోడు ఇజ్రాయెల్‌లోని సైనిక స్థావరాలకు అమెరికాకు చెందిన 10కి పైగా సైనిక రవాణా విమానాలు చేరుకోవడం, మధ్యప్రాచ్యంలోని ఇతర దేశాల్లోనూ అమెరికా బలగాల కదలికలు పెరగడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. అయితే ట్రంప్ నిజంగానే దాడికి ఆదేశాలు ఇచ్చారా? అమెరికా సైన్యం ఏం చేస్తోంది?

ఇజ్రాయెల్‌కు చేరిన 10కి పైగా అమెరికా విమానాలు

ఇరాన్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా తన సైనిక సన్నద్ధతను వేగవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌ ప్రభుత్వ ప్రసార సంస్థ KAN కథనం ప్రకారం.. అమెరికాకు చెందిన కనీసం 10 సైనిక రవాణా విమానాలు దక్షిణ ఇజ్రాయెల్‌లోని ఓవ్డా (Ovda), నెవాటిమ్ (Nevatim) వైమానిక స్థావరాలకు చేరుకున్నాయి. వీటితో పాటు జోర్డాన్, సౌదీ అరేబియా, ఖతార్‌లలోని సైనిక స్థావరాలకు కూడా అమెరికా విమానాలను పంపినట్లు సమాచారం. ఈ విమానాల్లో ఏయే రకాల పరికరాలు ఉన్నాయనే విషయాన్ని అమెరికా అధికారికంగా వెల్లడించలేదు. అయితే టెక్సాస్‌లోని ఫోర్ట్ బ్లిస్ నుంచి కొన్ని విమానాలు బయలుదేరినట్లు సమాచారం. అక్కడ అమెరికా సైన్యానికి చెందిన కీలక వైమానిక రక్షణ విభాగాలు ఉన్నాయి. దీంతో పేట్రియాట్ క్షిపణి వ్యవస్థలు, వాటి ఇంటర్‌సెప్టర్లు, ఇతర రక్షణ పరికరాలను తరలిస్తున్నారనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వివరాలకు అధికారిక ధ్రువీకరణ లేదు.

ట్రంప్‌కు సైనికాధికారుల ప్రత్యేక నివేదిక

అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) అధిపతి అడ్మిరల్ బ్రాడ్ కూపర్ అక్టోబర్ 29న వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు ట్రంప్‌ను కలిసి ఇరాన్‌కు సంబంధించిన సైనిక పరిస్థితులపై వివరించినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. ఈ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్‌సెత్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ డాన్ కేన్ కూడా పాల్గొన్నారు. ఇరాన్‌పై మరోసారి సైనిక చర్య చేపట్టాల్సి వస్తే ఎలాంటి మార్గాలను అనుసరించవచ్చనే అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం. నవంబర్ 3న జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికల తర్వాత పరిమిత కాలంలో తీవ్రస్థాయి సైనిక దాడులు జరిగే అవకాశాన్ని కూడా కొన్ని నివేదికలు ప్రస్తావించాయి. అయితే ట్రంప్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.

మధ్యప్రాచ్యంలో రక్షణ ఏర్పాట్లు ముమ్మరం

ఇరాన్ నుంచి ప్రతిదాడులు జరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని అమెరికా తన సైనిక స్థావరాల భద్రతను కూడా పెంచుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. పేట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థలను తరలించడం, ఆయుధ నిల్వలను పెంచడం, ప్రమాదం పొంచి ఉన్న స్థావరాల నుంచి కొంతమంది సైనిక సిబ్బందిని ఇతర ప్రాంతాలకు తరలించడం వంటి చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. అమెరికా మిత్రదేశాలైన గల్ఫ్ దేశాలను కూడా సంభావ్య దాడులు, ఇరాన్ ప్రతిచర్యల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరినట్లు వార్తలు వెలువడ్డాయి.

మరో యుద్ధం తప్పదా?

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి దాడులకు దిగితే దాని ప్రభావం ఒక్క పశ్చిమాసియాకే పరిమితం కాకపోవచ్చు. చమురు సరఫరా, అంతర్జాతీయ వాణిజ్యం, హార్ముజ్ జలసంధి మీదుగా జరిగే నౌకాయానంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగితే ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరల్లో మార్పులు చోటుచేసుకోవచ్చు. ఇరాన్ మాత్రం మరోసారి సైనిక దాడులు జరిగితే ప్రతిచర్య తప్పదని హెచ్చరిస్తోంది. మరోవైపు దౌత్య చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నట్లు సమాచారం. మొత్తంగా చూసుకుంటే.. అమెరికా సైనిక కదలికలు, ఇజ్రాయెల్‌తో సమన్వయం, ట్రంప్‌తో సైనికాధికారుల సమావేశం చూస్తుంటే ఇరాన్‌పై మరోసారి చర్యలకు వాషింగ్టన్ సిద్ధమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కానీ సైనిక ఏర్పాట్లు జరుగుతున్నంత మాత్రాన యుద్ధానికి తుది నిర్ణయం తీసుకున్నట్లు కాదు. నవంబర్ 3 తర్వాత ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? దౌత్యానికి ప్రాధాన్యం ఇస్తారా? లేక సైనిక చర్యకు మొగ్గు చూపుతారా? అన్నది ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.