Project Freedom Hormuz: ట్రంప్ సరికొత్త ప్లాన్... నౌకలు సురక్షితమేనా?
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయ వంటి హోర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి.
Project Freedom Hormuz: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయ వంటి హోర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. అక్కడ చిక్కుకుపోయిన విదేశీ వాణిజ్య నౌకలను రక్షించేందుకు ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ అనే భారీ ఆపరేషన్‌ను ప్రకటించి సంచలనం సృష్టించారు.
ఏమిటీ ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’?
యుద్ధంతో సంబంధం లేని అనేక దేశాల నౌకలు ప్రస్తుతం హోర్ముజ్ జలసంధిలో గంటల తరబడి, కొన్ని రోజులుగా నిలిచిపోయాయి. ఆయా దేశాల విజ్ఞప్తి మేరకు, అమెరికా సైనిక బలగాల పర్యవేక్షణలో ఈ నౌకలను సురక్షితంగా బయటకు తీసుకురావడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం. మే 4 సోమవారం ఉదయం నుంచి ఈ ఆపరేషన్ ప్రారంభం అయింది. ఇంధనం, నిత్యావసరాలతో ప్రయాణిస్తున్న నౌకలకు రక్షణ కల్పించాలి. ఈ ఆపరేషన్ సమయంలో ఎవరైనా అడ్డు తగిలితే బలప్రయోగం తప్పదని ట్రంప్ ఘాటుగా హెచ్చరించారు. ఇప్పటికే రెండు యుద్ధ వాహక నౌకలు ఈ ప్రాంతంలో తిష్టవేశాయి. అయితే, ఎట్టిపరిస్థితుల్లో భూతల దాడులకు దిగొద్దని ఆదేశాలు కూడా సైనికులకు ఇచ్చినట్టు తెలుస్తోంది.
మానవతా దృక్పథమా? వ్యూహాత్మక ఎత్తుగడనా?
ఈ ఆపరేషన్‌ను ట్రంప్ ఒక ‘మానవతా చర్య’గా అభివర్ణించారు. నౌకల్లో చిక్కుకున్న సిబ్బంది వద్ద ఆహారం, మంచినీరు వంటి కనీస వసతులు అయిపోతున్నాయని, వారిని కాపాడటం తమ బాధ్యతని ఆయన పేర్కొన్నారు. అయితే, అంతర్జాతీయ విశ్లేషకుల ప్రకారం.. ఇది ఇరాన్‌పై ఒత్తిడి పెంచేందుకు ట్రంప్ వేసిన ఒక మాస్టర్ ప్లాన్. మరోవైపు, ఇరాన్‌తో తమ ప్రతినిధులు సంప్రదింపులు జరుపుతున్నారని, చర్చలు ఫలవంతంగా సాగుతున్నాయని ట్రంప్ చెప్పడం విశేషం. అంటే ఒకవైపు హెచ్చరికలు జారీ చేస్తూనే, మరోవైపు దౌత్యపరమైన తలుపులు తెరిచి ఉంచడం ట్రంప్ మార్క్ రాజకీయం. మరి ట్రంప్ మార్క్ రాజకీయం ఫలిస్తుందా లేదా అన్నది తెలియాలి.
వాణిజ్యంపై ప్రభావం
హోర్ముజ్ జలసంధి ఎంత కీలకమంటే.. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో దాదాపు 20% నుండి 30% ఈ మార్గం ద్వారానే వెళ్తుంది. ఇక్కడ చిన్న ఆటంకం కలిగినా అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతాయి. ప్రస్తుతం వందలాది నౌకలు ఇక్కడ చిక్కుకుపోవడం వల్ల గ్లోబల్ మార్కెట్‌లో ఆందోళన నెలకొంది. ట్రంప్ ప్రకటించిన ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ విజయవంతమైతే, అంతర్జాతీయ వాణిజ్యానికి పెద్ద ఊరట లభిస్తుంది. లేనిపక్షంలో, అమెరికా బలగాల జోక్యంతో ఈ ప్రాంతంలో యుద్ధం మరింత ముదిరే ప్రమాదం కూడా ఉంది. సోమవారం ఉదయం నుంచి మొదలయ్యే ఈ ఆపరేషన్‌పైనే ఇప్పుడు ప్రపంచ దేశాల కళ్లు ఉన్నాయి. ఈ ఆపరేషన్‌ను అమెరికా సైన్యం ఏ విధంగా నిర్వర్తిస్తుందో చూడాలి.




