Trump–Putin Call: ఐదేళ్లుగా యుద్ధం చేస్తున్నాం...ఇక చాలు ఉక్రెయిన్
ప్రపంచ దేశాలను వణికించిన ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా ఒక అద్భుతమైన ముందడుగు పడింది. ఏప్రిల్ 29న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగిన సుదీర్ఘ ఫోన్ సంభాషణ ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై హాట్ టాపిక్ గా మారింది.
Trump–Putin Call: ప్రపంచ దేశాలను వణికించిన ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా ఒక అద్భుతమైన ముందడుగు పడింది. ఏప్రిల్ 29న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగిన సుదీర్ఘ ఫోన్ సంభాషణ ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై హాట్ టాపిక్ గా మారింది. దాదాపు 90 నిమిషాల పాటు సాగిన ఈ చర్చలు కేవలం మాటలకే పరిమితం కాకుండా, శాంతి దిశగా ఒక స్పష్టమైన హామీని ఇచ్చాయి. మరి ఈ హామీ నెరవేరుతుందా...ఉక్రెయిన్‌లో శాంతి పవనాలు వీస్తాయా...రష్యా మాట నిలుపుకుంటుందా..పుతిన్ ఈ దిశగా ప్రకటన చేస్తారా?
యుద్ధం ఇక చాలు.. పుతిన్ ప్రతిపాదన!
అ అధునాతన కాలంలో యుద్ధం అంటూ ప్రారంభమైతే దానికి అంతం ఉండదు అని చెప్పడానికి ఓ ఉదాహరణ రష్యా ఉక్రెయిన్ యుద్ధమే. గత ఐదేళ్లుగా రెండు దేశాలు యుద్ధం చేస్తున్నాయి. కానీ, ఇప్పటి వరకు ఎవరు గెలిచారు అన్నదానికి సమాధానం లేదు. రష్యా సంగతి ఎలా ఉన్నా అందమైన దేశంగా పేరొందిన ఉక్రెయిన్ కళావిహీనంగా మారిపోయింది. సగం కాలిన చితిలా మారిపోయింది. ఎటు చూసినా కుప్పకూలిన భవనాలు..కన్నీటి వ్యధలే కనిపిస్తున్నాయి. యూఎస్ఎస్ఆర్ డిక్రీ ప్రకారం, రష్యన్ ఫెడరేషన్ నుంచి విడిపోయిన దేశాలు నాటో కూటమిలో చేరేందుకు వీలు లేదు. కానీ, ఉక్రెయిన్ ఈ ప్రయత్నం చేయడమే యుద్ధానికి కారణమైంది. ఐదేళ్లుగా ఆ దేశాన్ని కోలుకోనివ్వకుండా, నిద్రపోనివ్వకుండా చేస్తున్నారు. కాగా, ఉక్రెయిన్‌లో ఈ రక్తపాతానికి తెరదించే సమయం ఆసన్నమైందనే వార్తలు వస్తున్నాయి. వచ్చే నెలలో రష్యా జరుపుకోబోతున్న విజయ్ దినోత్సవం సందర్భంగా యుద్ధాన్ని తాత్కాలికంగా ఆపేయాలని పుతిన్ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడితో జరిపిన సుదీర్ఘమైన ఫోన్ కాలింగ్ సంభాషణలో ఈ విషయాన్ని వెల్లడించినట్టు సమాచారం. దీనికి ట్రంప్ కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఇక యుద్ధం ముగిస్తే రష్యాతో ఇతర వాణిజ్య, దౌత్య సంబంధాలు మెరుగుపడతాయి. రష్యాపై విధించిన ఆంక్షలు కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. అయితే, యుద్ధం ముగింపుకు సంబంధించిన ప్రకటన పుతిన్ నోటివెంట రావాల్సి ఉంది.
ఇరాన్ విషయంలో ట్రంప్ గర్జన
ఇదిలా ఉంటే, ఇరాన్ విషయంపై కూడా ఇరు దేశాల నేతలు చర్చించినట్టుగా సమాచారం. ఇరాన్‌లో అణు సంక్షోభంపై ట్రంప్ తనదైన శైలిలో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండటానికి ఒప్పుకునేది లేదని ట్రంప్ హెచ్చరించారు. ఇప్పటికే ఇరాన్ క్షిపణి కేంద్రాల్లో 80 శాతాన్ని ధ్వంసం చేసిట్టు ట్రంప్ పుతిన్‌కు తెలిపారు. మిగిలిన క్షిపణి సామర్థ్యాన్ని కూడా తుడిచిపెట్టేస్తామని, ఈలోగానే ఇరాన్ దిగొచ్చి శాంతి చర్చలకు ఒప్పుకోవాలని, తాము విధించిన షరతులకు తలొగ్గాలని ట్రంప్ డిమాండ్ చేశారు. ట్రంప్ ఎంత పట్టుదలగా ఉన్నాడో... అటు ఇరాన్ కూడా అంతే పట్టుదలతో ఉంది. వెనక్కి తగ్గేది లేదని చెబుతోంది. ఈ రెండు దేశాల మొండి వైఖరి కారణంగా ప్రపంచ దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి.
స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు
క్రెమ్లిన్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చర్చలు అత్యంత గౌరవప్రదంగా సాగాయి. ముఖ్యంగా వాషింగ్టన్‌లో ట్రంప్‌పై జరిగిన దాడి ప్రయత్నాన్ని పుతిన్ తీవ్రంగా ఖండించడం విశేషం. ప్రపంచంలోని రెండు అగ్రరాజ్యాల అధినేతలు విభేదాలను పక్కన పెట్టి, శాంతి కోసం చేయి కలపడం సామాన్య ప్రజల్లో కూడా కొత్త ఆశలను చిగురింపజేస్తోంది. రష్యాపై విధించిన ఆంక్షలు ఎత్తివేస్తే భారత్ వంటి దేశాలకు ఎంతో మేలు జరుగుతుంది. ఇప్పటికే రష్యా నుంచి భారత్ పెద్ద ఎత్తున చమురును తక్కువ ధరకు దిగుమతి చేసుకున్నది. ఇప్పుడు ఆంక్షలు ఎత్తివేస్తే వాణిజ్య బంధం మరింతగా బలపడుతుంది. చమురుతో పాటు గ్యాస్‌ను కూడా దిగుమతి చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది.
మొత్తంగా చెప్పాలంటే, ఏప్రిల్ 29న జరిగిన ఈ ఫోన్ కాల్ కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ కాదు, ప్రపంచ శాంతికి వేసిన బలమైన పునాది. యుద్ధం వల్ల కలిగే ఆర్థిక భారం, ప్రాణనష్టం ఇకనైనా ఆగుతాయని ప్రపంచం ఆశిస్తోంది. మరి పుతిన్ చేసే ఆ 'అధికారిక ప్రకటన' ఉక్రెయిన్ భవిష్యత్తును ఎలా మారుస్తుందో వేచి చూడాలి! పుతిన్ సానుకూలంగా స్పందిస్తారని ఆశిద్దాం.




