Donald Trump : ట్రంప్ మైండ్ గేమ్.. ఇరాన్ సుప్రీం లీడర్‌తో భేటీకి రెడీ అంటూ సంచలన వ్యాఖ్యలు
Donald Trump : అమెరికా, ఇరాన్ మధ్య అణు ఒప్పందం కుదిరితే ఆ దేశ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీని కలవడానికి సిద్ధమని డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే ఈ ప్రతిపాదనను ఇరాన్ కొట్టిపారేసింది.
Donald Trump
Donald Trump : అమెరికా, ఇరాన్ దేశాల మధ్య చాలా కాలంగా నడుస్తున్న అణు వివాదాల నడుమ యూఎస్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఒక సంచలన ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం జరుగుతున్న చర్చలు సఫలమై, అణు ఒప్పందం గనుక కుదిరితే ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీతో సమావేశం కావడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు. వైట్ హౌస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. ఆయన్ను కలవడం తనకెంతో గౌరవంగా భావిస్తానని చెప్పారు. అయితే తానేమీ ఖమేనీని కలవడానికి ప్రత్యేకంగా ప్రయత్నించడం లేదని, కానీ ఒప్పందం కుదిరిన తర్వాత ఆయన్ను కలవడానికి సిద్ధంగా ఉన్నానని వివరించారు.
ఖమేనీపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
తానేమీ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి అత్యంత ఇష్టమైన వ్యక్తిని కాదని ట్రంప్ నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఒకవేళ భవిష్యత్తులో వారిద్దరి మధ్య సమావేశం జరిగితే, తాను ఖమేనీతో పూర్తి గౌరవప్రదంగా ప్రవర్తిస్తానని హామీ ఇచ్చారు. ముజ్తబా ఖమేనీని ప్రపంచంలో చాలా మంది ఒక ప్రొఫెషనల్ లీడర్‌గా భావిస్తారని, సమాజంలో ఆయనకు మంచి గుర్తింపు ఉందంటూ ప్రశంసించారు. తన గురించి అలాగే ఖమేనీ గురించి కొందరు తప్పుగా మాట్లాడినప్పటికీ, చాలా మంది తమ గురించి మంచిగానే ఆలోచిస్తారంటూ ట్రంప్ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్ యురేనియం నిల్వలపై అమెరికా నిఘా
అమెరికా, ఇరాన్ మధ్య అణు కార్యక్రమాలపై కీలక చర్చలు జరుగుతున్న సమయంలోనే ట్రంప్ ఇరాన్ యురేనియం నిల్వలపై పెద్ద ప్రకటన చేశారు. అమెరికా అనుకుంటే ఇప్పుడే ఇరాన్‌కు చెందిన యురేనియం నిల్వలను తన ఆధీనంలోకి తీసుకోగలదని, దీనిని అడ్డుకునే శక్తి ఇరాన్‌కు లేదని ఆయన హెచ్చరించారు. అయితే ప్రస్తుతం అలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్లు చెప్పారు. ఇరాన్ యురేనియం నిల్వలు ఎక్కడ ఉన్నాయో తమకు తెలుసని, అమెరికన్ ఏజెన్సీలు అక్కడ ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఉంచాయని ట్రంప్ సంచలన విషయాన్ని వెల్లడించారు.
ట్రంప్ ఆఫర్‌ను తిరస్కరించిన ఇరాన్
డోనాల్డ్ ట్రంప్ చేసిన ఈ ప్రతిపాదనలను ఇరాన్ ప్రభుత్వం వెంటనే తోసిపుచ్చింది. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పందిస్తూ.. ఇలాంటి చర్చలు కేవలం మాటలకే పరిమితం కాకుండా ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు, వాస్తవాలను బట్టి చూడాలని హితవు పలికారు. ప్రస్తుతానికి అమెరికా అధ్యక్షుడితో సుప్రేం లీడర్ భేటీ అయ్యే ఎలాంటి నిజమైన పరిస్థితులు లేవని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా, భద్రతా కారణాల దృష్ట్యా ఇరాన్ రక్షణ సంస్థలు సుప్రీం లీడర్ ఖమేనీని బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించాయని, అందుకే ఆయన ప్రజల్లోకి రావడం తగ్గించారని విదేశాంగ మంత్రి వెల్లడించారు.




