గ్రీన్ కార్డులపై ట్రంప్ కొత్త షాక్.. మళ్లీ పబ్లిక్ చార్జ్ రూల్

ప్రభుత్వ సంక్షేమ పథకాలు వినియోగించే వలసదారులకు గ్రీన్ కార్డుపై ప్రభావం చూపే పబ్లిక్ చార్జ్ నిబంధనను ట్రంప్ ప్రభుత్వం పునరుద్ధరించింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 17 July 2026 2:50 AM IST
Trump Revives Public Charge Rule for Green Card Applicants
X

Trump Revives Public Charge Rule for Green Card Applicants

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో కీలక వలస విధానాన్ని తిరిగి అమల్లోకి తీసుకురానుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆధారపడే వలసదారులకు గ్రీన్ కార్డ్ మంజూరును నిరాకరించే 'పబ్లిక్ చార్జ్' (Public Charge) నిబంధనను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించింది.

ఈ నిబంధనకు సంబంధించిన ప్రకటన అమెరికా ఫెడరల్ రిజిస్టర్‌లో వెలువడగా, జులై 20న అధికారికంగా ప్రచురించనున్నారు. కొత్త నిబంధనలు సెప్టెంబర్ 18 నుంచి అమల్లోకి రానున్నాయి.

ఈ విధానం ప్రకారం గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారు ప్రభుత్వంపై ఆర్థిక భారం కాకుండా స్వయం సమృద్ధిగా జీవించగలరని నిరూపించాల్సి ఉంటుంది. ఫుడ్ స్టాంప్స్, మెడికెయిడ్, హౌసింగ్ వౌచర్లు వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల వినియోగం కూడా దరఖాస్తుల పరిశీలనలో పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.

ట్రంప్ తొలి అధ్యక్ష పదవీకాలంలో 2020లో ఈ నిబంధన అమల్లోకి వచ్చినప్పటికీ, అనంతరం అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. తాజాగా ట్రంప్ ప్రభుత్వం దానిని మళ్లీ అమలు చేయాలని నిర్ణయించింది.

ఈ నిర్ణయంతో ప్రభుత్వ వనరులపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి కలిగిన వలసదారులను మాత్రమే ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (USCIS) వెల్లడించింది.

అయితే వలస హక్కుల కోసం పనిచేసే సంస్థలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఈ విధానం వలసదారుల్లో భయాందోళనలు పెంచడమే కాకుండా, అర్హత ఉన్నప్పటికీ ప్రభుత్వ ప్రయోజనాలు పొందకుండా వెనుకడుగు వేయించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story