Jensen Huang Controversy: అమెరికా ప్రభుత్వంలో జెన్సన్ హువాంగ్ చిచ్చు... ట్రంప్‌, రూబియో మధ్య విబేధాలు

ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌పై చైనా నిఘా సంబంధాల అనుమానాలు అమెరికాలో రాజకీయ వివాదానికి దారితీశాయి. ట్రంప్ మద్దతు, మార్కో రూబియో హెచ్చరికలు, అమెరికా ప్రభుత్వంలో విభేదాల వెనుక అసలు కారణాలేంటో తెలుసుకుందాం.

Rudrachander
Published on: 10 Nov 2026 12:17 PM IST
Jensen Huang Controversy: అమెరికా ప్రభుత్వంలో జెన్సన్ హువాంగ్ చిచ్చు... ట్రంప్‌, రూబియో మధ్య విబేధాలు
X

Jensen Huang Controversy: అమెరికా టెక్నాలజీ రంగంలో అత్యంత ప్రభావవంతమైన సంస్థల్లో ఒకటైన ఎన్విడియా ఇప్పుడు రాజకీయ వివాదంలో చిక్కుకుంది. ఆ కంపెనీ సీఈఓ జెన్సన్ హువాంగ్‌తో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఉన్న సన్నిహిత సంబంధాలు తాజాగా చర్చనీయాంశంగా మారాయి. హువాంగ్‌కు చైనా నిఘా వర్గాలతో సంబంధాలున్నాయనే అనుమానాలపై అమెరికా నిఘా సంస్థలు సమాచారం సేకరించినట్లు వార్తలు రావడం ఈ వ్యవహారాన్ని మరింత తీవ్రం చేసింది. ఒకవైపు ట్రంప్ హువాంగ్‌కు మద్దతుగా కనిపిస్తుండగా, మరోవైపు విదేశాంగ మంత్రి మార్కో రూబియో పర్యవేక్షణలో రూపొందినట్లు చెబుతున్న రహస్య నివేదిక ప్రభుత్వ వర్గాల్లో ఆందోళనకు కారణమైంది.

రూబియో నివేదికతో మొదలైన వివాదం

విదేశీ నిఘా సంస్థలతో హువాంగ్‌కు సంబంధాలు ఉన్నాయా అనే అంశంపై ఈ ఏడాది వసంతకాలంలో అత్యంత రహస్య నివేదిక సిద్ధమైనట్లు సమాచారం. మార్కో రూబియో ఈ నివేదికను పర్యవేక్షించినట్లు పలు మీడియా కథనాలు వెల్లడించాయి. సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక సంస్థలో ఉన్నతాధికారిగా పనిచేసిన ఆలిస్ హువాంగ్ అనే చైనా మహిళపై అమెరికా నిఘా వర్గాలు దృష్టి పెట్టాయి. ఎన్విడియా తయారుచేసే అత్యాధునిక ఏఐ చిప్‌లను కొనుగోలు చేస్తున్న ఈ సంస్థ వాటిని అక్రమంగా చైనాకు తరలిస్తోందనే అనుమానాలు ఉన్నాయి. అయితే ఆలిస్ హువాంగ్‌కు ఎన్విడియా సీఈఓతో ఎలాంటి కుటుంబ సంబంధం లేదని స్పష్టమైంది. ఆమె ద్వారా చైనా ప్రభుత్వానికి సమాచారం చేరుతోందనే అనుమానాల నేపథ్యంలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ట్రంప్ మద్దతుతో ప్రభుత్వంలో విభేదాలు

ఈ ఆరోపణలు బయటకు వచ్చినప్పటికీ ట్రంప్ మాత్రం జెన్సన్ హువాంగ్‌కు వ్యతిరేకంగా ఎలాంటి కఠిన వైఖరి తీసుకోలేదని వార్తలు చెబుతున్నాయి. దీంతో రిపబ్లికన్ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చైనాకు అత్యాధునిక చిప్‌ల విక్రయాలను నియంత్రించాలనే వాదన చేస్తున్న కొందరు రిపబ్లికన్ నేతలు ఈ వ్యవహారాన్ని జాతీయ భద్రతకు సంబంధించిన సమస్యగా చూస్తున్నారు. ఎన్విడియాపై మరింత నిఘా పెట్టాలని, చైనాకు చిప్‌ల ఎగుమతులపై ఆంక్షలు కఠినతరం చేయాలని కోరుతున్నారు. అమెరికా కాంగ్రెస్‌లోని పలు కమిటీలు కూడా ఈ అంశాన్ని పరిశీలిస్తున్నాయి. జెన్సన్ హువాంగ్‌ను రహస్య సమావేశానికి పిలిచి వివరణ తీసుకోవాలని ప్రతినిధుల సభలోని కమిటీలు కోరినట్లు సమాచారం. మరోవైపు, డిసెంబర్ 1లోగా ఈ వ్యవహారంపై వివరాలు అందించాలని ముగ్గురు డెమొక్రటిక్ సభ్యులు వాణిజ్య శాఖను కోరారు. చైనా సంస్థలకు ఏఐ చిప్‌లు చేరకుండా తీసుకున్న చర్యలపై ప్రభుత్వ అధికారులకు ముందే సమాచారం ఉందా అనే ప్రశ్నలు లేవనెత్తారు.

ట్రంప్‌తో హువాంగ్‌కు ప్రత్యేక సంబంధం

జెన్సన్ హువాంగ్‌కు ట్రంప్‌తో ఉన్న పరిచయం ఇప్పటిది కాదు. 2025 నుంచి ఇద్దరి మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయి. 2025 మేలో ట్రంప్ చైనా పర్యటనకు వెళ్లినప్పుడు హువాంగ్ కూడా ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ఆయనతో కలిసి ప్రయాణించారు. దాదాపు దశాబ్దం తర్వాత అమెరికా అధ్యక్షుడు చైనాలో పర్యటించడం అప్పట్లో ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. అదే ఏడాది సెప్టెంబర్‌లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ గౌరవార్థం వైట్‌హౌస్‌లో నిర్వహించిన విందులోనూ హువాంగ్ పాల్గొన్నారు. ట్రంప్ ప్రతిపాదించిన వైట్‌హౌస్ బాల్‌రూమ్ నిర్మాణానికి ఎన్విడియా 25 మిలియన్ డాలర్లు కేటాయించినట్లు వార్తలు వచ్చాయి.

చైనా చిప్‌ల వ్యవహారమే అసలు సమస్య!

అమెరికా ఏఐ రంగంలో ఎన్విడియా చిప్‌లకు కీలక స్థానం ఉంది. ఈ చిప్‌లతోనే అత్యాధునిక కృత్రిమ మేధస్సు వ్యవస్థలు అభివృద్ధి చేస్తున్నారు. అందుకే చైనాకు వీటి సరఫరాపై అమెరికా ప్రభుత్వం గతంలోనే ఆంక్షలు విధించింది. అయితే 2025 ఏప్రిల్‌లో ట్రంప్ ప్రభుత్వం కొన్ని ఎన్విడియా చిప్‌ల ఎగుమతులపై ఆంక్షలను వెనక్కి తీసుకునే దిశగా అడుగులు వేసింది. ఆ సమయంలో హువాంగ్ ట్రంప్‌తో సమావేశమవడం కూడా చర్చకు వచ్చింది. ఈ ఆరోపణలను చైనా విదేశాంగ శాఖ నిరాధారమైనవిగా కొట్టిపారేసింది. మరోవైపు, ఎన్విడియా షేర్లు సోమవారం ఒక్కరోజే 4 శాతానికి పైగా పడిపోయాయి. డెలావేర్ సెనేటర్ క్రిస్ కూన్స్ కూడా ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరగాలని కోరారు. మొత్తంగా చూసుకుంటే ఇది కేవలం ఒక వ్యాపారవేత్త వ్యక్తిగత సంబంధాలకు సంబంధించిన వివాదం కాదు. ప్రపంచ ఏఐ రంగంలో ఆధిపత్యం, చైనాకు సాంకేతిక పరిజ్ఞానం చేరకుండా అడ్డుకోవడం, అమెరికా జాతీయ భద్రత వంటి కీలక అంశాలు ఇందులో ముడిపడి ఉన్నాయి. అందుకే హువాంగ్‌పై వస్తున్న ఆరోపణలు, ట్రంప్ వైఖరి ఇప్పుడు వాషింగ్టన్ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే ఈ ఆరోపణలు ఇంకా నిర్ధారణ కాలేదు. దర్యాప్తులో వెలువడే వివరాలే ఈ వివాదానికి అసలు దిశను నిర్ణయించనున్నాయి.

Rudrachander

Rudrachander

రుద్ర చందర్‌ తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు