Trump Iran Deal: కన్ఫ్యూజన్‌ పాలిటిక్స్‌... ట్రంప్‌ ఔనంటే...ఇరాన్‌ కాదంటోంది

మరో వారం రోజుల్లో యూరప్‌లో ఇరాన్‌తో ఒప్పందం చేసుకుంటామని ట్రంప్‌ చెబుతుండగా...అలాంటి డీల్‌ ఏమీ జరగడం లేదని ఇరాన్‌ స్పష్టం చేస్తున్నది.

Balachander
Published on: 12 Jun 2026 12:41 PM IST
Trump Iran Deal: కన్ఫ్యూజన్‌ పాలిటిక్స్‌... ట్రంప్‌ ఔనంటే...ఇరాన్‌ కాదంటోంది
X

Trump Iran Deal: అంతర్జాతీయ రాజకీయ యవనికపై ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం ఎవరి తరమూ కావడం లేదు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ దేశాల మధ్య నడుస్తున్న 'కన్ఫ్యూజన్ పాలిటిక్స్' ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించే చారిత్రాత్మక ఒప్పందం కుదిరిందని, సంతకాలే మిగిలాయని ప్రకటిస్తుంటే... ఇరాన్ మాత్రం అసలు అలాంటిదేమీ ఫైనల్ కాలేదంటూ ఖండిస్తోంది. ఒకరు ‘ఔనంటే’ మరొకరు ‘కాదనే’ ఈ విచిత్ర వైఖరి వెనుక ఉన్న అసలు భౌగోళిక, ఆర్థిక సత్యాలను గురించి విశ్లేషణాత్మకంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ట్రంప్ ప్రకటన... ఒక్కసారిగా పడిపోయిన చమురు ధరలు

గురువారం రాత్రి ఇరాన్‌పై భారీ దాడులు చేస్తామని హెచ్చరించిన కొద్ది గంటల్లోనే ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇరాన్‌తో ఒక గొప్ప ఒప్పందం కుదిరిందని, రాబోయే కొన్ని రోజుల్లో ఐరోపా వేదికగా సంతకాల కార్యక్రమం కూడా ఉండబోతుందని ఆయన విలేకరులకు తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం ఇరాన్ ఎప్పటికీ అణుబాంబును తయారు చేయదని, అలాగే ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ జలసంధిని వెంటనే తెరుస్తారని ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ చేసిన ఈ సానుకూల ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర ఒక్కసారిగా 4.4 శాతం పడిపోయి, బ్యారెల్‌కు సుమారు 89 డాలర్లకు చేరుకుంది. మిడిల్ ఈస్ట్ అంతా ఈ నిర్ణయంతో సంతోషంగా ఉందని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి.

ఇరాన్ తిరస్కరణ – క్షేత్రస్థాయిలో భీకర యుద్ధం

ట్రంప్ మాటలు అలా ఉంటే, ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయ్ ఈ వార్తలను కొట్టిపారేశారు. అమెరికా కొన్ని 'అతి దారుణమైన డిమాండ్లను' కొత్తగా తెరపైకి తెచ్చిందని, తమ 'రెడ్ లైన్స్' దాటి ఎలాంటి ఒప్పందాన్ని అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. ఒకవైపు శాంతి చర్చలు జరుగుతున్నాయని చెప్తున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఈ వారంలోనే ఇరుపక్షాలు దాడులు చేసుకున్నాయి. అమెరికా ఇరాన్ సైనిక స్థావరాలపై దాడి చేయగా, ప్రతికారంగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ బహ్రెయిన్, కువైట్, జోర్డాన్లలోని అమెరికా స్థావరాలపై క్షిపణులు ప్రయోగించింది. జోర్డాన్ ఏకంగా 20 ఇరాన్ క్షిపణులను కూల్చివేసింది. ఇక ఇదిలా ఉంటే, ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన ఆంక్షల నేపథ్యంలో, ఒమన్ గల్ఫ్‌లో అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడం అంతర్జాతీయంగా ఆందోళన రేకెత్తించింది. ఇండియా దీనిపై అమెరికా దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది.

ఇక ఇదిలా ఉంటే, యుద్ధం వల్ల ఇరాన్ ప్రధాన చమురు ఎగుమతి కేంద్రమైన 'ఖార్గ్ ఐలాండ్' దెబ్బతింటే ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తుతుందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. ట్రంప్ వ్యాపార శైలి వ్యూహాలు, ఇరాన్ మొండి పట్టుదల మధ్య సాగుతున్న ఈ కన్ఫ్యూజన్ పాలిటిక్స్ ప్రపంచాన్ని ఎటు వైపు తీసుకెళ్తాయో చూడాలి. ఇద్దరిలో ఎవరూ వారి పట్టును విడిచేందుకు సిద్దంగా లేకపోవడంతో ప్రపంచంలో చమురుకు భీకరమైన కరువు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story