Trade War: ట్రంప్‌ ట్రేడ్‌వార్‌ ఎఫెక్ట్‌...అమెరికా టాయిలెట్‌లో కొత్త కష్టాలు

అమెరికా కెనడా మధ్య ట్రేడ్‌వార్‌ ముదరడంతో అమెరికా సామాన్యుల జేబులకు చిల్లులు పడబోతున్నాయి. ప్రపంచంలో అత్యథికంగా వినియోగించే టాయిలెట్‌ పేపర్ల ధరలు పెరగనున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Balachander
Published on: 26 Aug 2026 4:46 PM IST
Trade War: ట్రంప్‌ ట్రేడ్‌వార్‌ ఎఫెక్ట్‌...అమెరికా టాయిలెట్‌లో కొత్త కష్టాలు
X

Trade War: అమెరికా, కెనడా మధ్య చెలరేగిన తీవ్రమైన వాణిజ్య యుద్ధం ఇప్పుడు సామాన్య ప్రజల నిత్య జీవితంపై, ముఖ్యంగా అమెరికన్ల టాయిలెట్ బడ్జెట్‌పై ఊహించని భారాన్ని మోపబోతోంది. గత వారాంతంలో రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు విఫలం కావడంతో, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన సుంకములకు ప్రతిగా కెనడా ప్రధాని మార్క్ కార్నీ “డాలర్‌కు డాలర్” చొప్పున బదులు తీర్చుకుంటామని ప్రకటించారు. సెప్టెంబర్ 8 నుంచి అమల్లోకి వచ్చేలా దాదాపు 900 అమెరికన్ ఉత్పత్తులపై 25% నుంచి 50% వరకు సరుకుల పన్నులు విధిస్తున్నట్లు కెనడా ప్రకటించింది. అయితే, ఈ వాణిజ్య పోరులో అత్యంత తీవ్ర ప్రభావానికి గురైన రంగాల్లో కాగితపు ఉత్పత్తులు ప్రధానమైనవి. వాషింగ్టన్ విధించిన 50% సుంకానికి ప్రతికారంగా, కెనడా నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే టాయిలెట్ పేపర్, టిష్యూ పేపర్‌ ఉత్పత్తులపై 25% నుంచి 50% వరకు పన్నులు పడనున్నాయి.

అమెరికా టాయిలెట్ కష్టాలకు కారణాలేమిటి?

అమెరికాలో తయారయ్యే టాయిలెట్ పేపర్లు స్థానికంగా ప్రాసెస్ అయినప్పటికీ, వాటి తయారీకి కావలసిన కలప గుజ్జు కోసం అమెరికా పూర్తిగా దట్టమైన అడవులు ఉన్న కెనడాపైనే ఆధారపడుతుంది. ఇక, 2024 ప్రపంచ బ్యాంక్ గణాంకాల ప్రకారం, కెనడా నుంచి అమెరికా సంవత్సరానికి ఏకంగా 328 మిలియన్‌ డాలర్ల విలువైన టాయిలెట్ పేపర్‌ను దిగుమతి చేసుకుంటోంది. కాస్ట్కో వంటి దిగ్గజ రిటైల్ సంస్థలు తమ పేపర్ ఉత్పత్తుల కోసం కెనడాపైనే ప్రధానంగా ఆధారపడతాయి. ఇక ఇదిలా ఉంటే, ప్రపంచ జనాభాలో అమెరికా వాటా కేవలం 4% మాత్రమే అయినప్పటికీ, ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే టిష్యూ పేపర్లలో 20% పైగా ఒక్క అమెరికాలోనే వినియోగమవుతోంది. సగటున ఒక అమెరికన్ ఏటా 141 టాయిలెట్ పేపర్ రోళ్లను ఉపయోగిస్తూ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నాడు.

ఇతర రంగాలు... ఉత్పత్తులపై ప్రభావం

కెనడియన్ విస్కీ బ్రాండ్లు క్రౌన్ రాయల్, కెనడియన్ క్లబ్ పై అమెరికా 50% సుంకం విధించగా, కెనడా ప్రావిన్సులు అమెరికన్ ఆల్కహాల్ విక్రయాలపై నిషేధం విధించాయి. అలాగే డెయిరీ రంగానికి సంబంధించి అమెరికా 50% సుంకం విధించగా, కెనడా అమెరికా చీజ్, పాల ఉత్పత్తులపై 25% నుంచి 50% వరకు పన్నులు మోపింది. ఇక ఇదిలా ఉంటే, అమెరికా నుంచి దిగుమతి అయ్యే స్తంభింపజేసిన రొయ్యలు, లాబ్‌స్టర్లపై కెనడా 25% సుంకం విధించింది. మరోవైపు కెనడా ఆటో విడిభాగాలపై అమెరికా 25% సుంకం ప్రకటించడంతో అమెరికన్ కార్ల తయారీ రంగానికి పెద్ద దెబ్బ తగలనుంది. అయితే, అమెరికా వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్ ఈ వివాదం వల్ల అమెరికా వినియోగదారులపై ఎటువంటి ప్రభావం పడదని సమర్థించుకుంటున్నప్పటికీ, రాబోయే రోజుల్లో నిత్యావసర ఉత్పత్తుల ధరలు పెరిగి ప్రజల జేబులకు చిల్లులు పడటం ఖాయమని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story