Trump Ukraine Shift: అమెరికా మాస్టర్ ప్లాన్... రష్యాతో కయ్యానికి సిద్దమౌతున్నారా?
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై ప్రశంసలు కురిపించిన ట్రంప్, రష్యాపై కొత్త ఆంక్షలకు సిద్ధమవుతున్నారు. ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయోనని అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది.
Trump Ukraine Shift: అంతర్జాతీయ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే మాట మరోసారి నిజమైంది. నిన్నటివరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై తీవ్ర విమర్శలు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు తన వ్యూహాన్ని పూర్తిగా మార్చేశారు. రష్యాపై ఆర్థికంగా, దౌత్యపరంగా ఒత్తిడి పెంచడంతో పాటు రష్యా చమురుపై మళ్లీ ఆంక్షలు విధించడానికి ట్రంప్ సర్కార్ సిద్ధమవడమే కాకుండా, యుద్ధంలో జెలెన్స్కీ ఒంటరిగా పోరాడుతూ అద్భుతమైన ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నారని అనూహ్యంగా ప్రశంసించారు. నాటో చీఫ్ మార్క్ రుట్టె సమక్షంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు.. రష్యాతో అమెరికా మరింత కయ్యానికి కాలు దువ్వుతోందా అనే చర్చకు దారితీశాయి.
ట్రంప్ మైండ్ మార్చిన నాలుగు కీలక పరిణామాలు
కొద్ది నెలల క్రితం వైట్ హౌస్‌లో జెలెన్స్కీని అవమానించిన ట్రంప్ బృందం.. ఇప్పుడు యూ-టర్న్ తీసుకోవడం వెనుక కొన్ని బలమైన అంతర్జాతీయ సమీకరణాలు ఉన్నాయి. ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సులో బ్రిటన్, కెనడా వంటి దేశాలు రష్యా ‘షాడో ఫ్లీట్’ పై కొత్త ఆంక్షలు ప్రకటించాయి. వీటికి ట్రంప్ కూడా మద్దతు పలకడం విశేషం. గత నాలుగు సంవత్సరాలుగా సాగుతున్న ఈ రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని మొదటి రోజే ముగిస్తానని ట్రంప్ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అందుకోసం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో అలస్కాలో శాంతి చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి ఫలితం రాలేదు. సదస్సుకు కొద్దిరోజుల ముందు మాస్కో పరిసరాల్లోని రష్యా సైనిక స్థావరాలు, భారీ చమురు శుద్ధి కర్మాగారంపై ఉక్రెయిన్ లాంగ్-రేంజ్ క్షిపణులతో మెరుపు దాడులు చేసింది. ఉక్రెయిన్ చూపిన ఈ వ్యూహాత్మక దారుఢ్యానికి ట్రంప్ తీవ్రంగా ప్రభావితమయ్యారు.
ఇరాన్ తో శాంతి ఒప్పందం
మార్చి 2026లో ఇరాన్‌తో యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధిలో చమురు రవాణా నిలిచిపోయి ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. అప్పట్లో ధరలను అదుపు చేయడానికి ట్రంప్ రష్యా చమురు ఎగుమతులపై ఆంక్షలను తాత్కాలికంగా సడలించారు. ఇరాన్‌తో ప్రాథమిక శాంతి ఒప్పందం కుదరడంతో అమెరికాకు చమురు ధరల భయం పోయింది. దీనితో ఇప్పుడు రష్యా ఇంధన రంగాన్ని ఆర్థికంగా దెబ్బతీయడానికి ట్రంప్‌కు పూర్తి స్వేచ్ఛ లభించింది. శాంతి చర్చలకు పుతిన్ లొంగిరావాలంటే రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే ఏకైక మార్గమని అమెరికా భావిస్తోంది. ఉక్రెయిన్ సైన్యం రష్యా భూభాగంలోకి దూసుకెళ్తుండటం, ఇటు అమెరికా ఆంక్షల ఉచ్చు బిగిస్తుండటంతో రానున్న రోజుల్లో అంతర్జాతీయ రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి.




