USA: ట్రంప్‌ వర్సెస్‌ సెనెట్ః ఇరాన్‌ తీర్మానంపై రాజకీయ దుమారం

ఇరాన్‌పై యుద్ధాధికారాల తీర్మానం అమెరికా సెనేట్‌లో ఆమోదం పొందడంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెనేట్ నిర్ణయం, ఓటింగ్ ఫలితాలు, ట్రంప్ వ్యాఖ్యలు, అమెరికా-ఇరాన్ సంబంధాలపై దాని ప్రభావం గురించి వివరాలు తెలుసుకుందాం.

Balachander
Published on: 24 Jun 2026 10:24 AM IST
USA: ట్రంప్‌ వర్సెస్‌ సెనెట్ః ఇరాన్‌ తీర్మానంపై రాజకీయ దుమారం
X

USA: అంతర్జాతీయ రాజకీయాల్లో అగ్రరాజ్యం అమెరికా అంతర్గత పరిణామాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఇరాన్‌పై సైనిక చర్యలను నిలిపివేయాలంటూ అమెరికా సెనేట్ ‘వార్ పవర్స్ యాక్ట్’ తీర్మానాన్ని ఆమోదించడంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్వేతసౌధం ఇరాన్‌ను దౌత్యపరంగా, ఆర్థికంగా పూర్తిగా లొంగదీసుకునే దశకు తెచ్చిన తరుణంలో సెనేట్ చేసిన ఈ పని అత్యంత దారుణమైనదని, ఇది శత్రువుకు మేలు చేసేలా ఉందంటూ ఆయన మండిపడ్డారు. ఈ మేరకు తన 'ట్రూత్ సోషల్' వేదికగా సెనేటర్లపై ట్రంప్ విమర్శల వర్షం కురిపించారు.

సెనేట్ ఓటింగ్

అమెరికా కాంగ్రెస్‌లోని ఎగువ సభలో ట్రంప్ సొంత పార్టీకి మెజారిటీ ఉన్నప్పటికీ, ఈ తీర్మానం నెగ్గడం గమనార్హం. సెనేట్‌లో జరిగిన ఓటింగ్‌లో 50 ఓట్లు అనుకూలంగా, 48 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి. డెమొక్రాట్లతో పాటు ట్రంప్ సొంత పార్టీ రిపబ్లికన్‌కి చెందిన నలుగురు సెనేటర్లు తిరుగుబాటు చేసి తీర్మానానికి మద్దతు ఇవ్వడం విశేషం. ఇరాన్ వివాదంలో ట్రంప్ మిలిటరీ అధికారాలకు బ్రేక్ వేయడానికి సెనేట్ ప్రయత్నించడం ఇది పదో సారి. గత తొమ్మిది సార్లు విఫలమైనా, ఈసారి మాత్రం డెమొక్రాట్లు విజయం సాధించారు. ఇరాన్‌తో నడిచిన ఘర్షణల వల్ల ఖాలీ అయిన ఆయుధ నిల్వలను భర్తీ చేసేందుకు పెంటగాన్ ప్రస్తుతం కాంగ్రెస్ నుండి 80 బిలియన్ డాలర్ల అదనపు బడ్జెట్ కోసం వేచి చూస్తోంది.

శత్రువుకు లాభం చేకూర్చారు... ట్రంప్ ఫైర్

ఇరాన్‌ను ఇరాకాటంలో పెట్టి నాకౌట్‌ స్థితికి తీసుకొచ్చానని, దశాబ్ధాల తరువాత అమెరికాను చూసి ఇరాన్‌ భయపడేలా చేశామని, కానీ...ఇలాంటి క్లిష్ట సమయంలో సెనేట్‌ పనికిరాని ఓటింగ్‌ పెట్టిందని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. కానీ, ఇప్పుడు సెనేట్‌ చేసిన పని ఫలితంగా ఇరాన్‌కు లాభం చేకూర్చినట్టు అవుతుందని ట్రంప్‌ ఫైర్‌ అయ్యారు.

సెనేట్‌ తీర్మానానికి అసలు అర్ధం

ఈ రాజకీయ దుమారంలో ట్రంప్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. సెనేట్‌లో ఈ తీర్మానం పాస్ అవ్వగానే...ఇరాన్ ప్రతినిధులు అమెరికా అధికారులను సంప్రదించి, "అసలు ఆ ఓటింగ్ అర్థం ఏంటి? ట్రంప్ అధికారం కోల్పోయారా?" అని ఆరా తీసినట్లు ట్రంప్‌ వెల్లడించారు. సెనేటర్ల చర్యలు తన పనిని మరింత క్లిష్టతరం చేశాయని, అయినప్పటికీ తాను అనుకున్నది సాధించి తీరుతానని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. అమెరికా చట్టాల ప్రకారం ఈ ‘కన్‌కరెంట్ తీర్మానం’ కేవలం ఒక సంకేతం మాత్రమే. దీనిపై అధ్యక్షుడి సంతకం అవసరం లేదు, అలాగే ఇది చట్టబద్ధంగా ట్రంప్‌ను పూర్తిగా కట్టడి చేయలేదు. అయినప్పటికీ, ఇరాన్‌తో శాంతి చర్చలు తుది దశకు చేరుకున్న తరుణంలో వాషింగ్టన్ రాజకీయాల్లో చోటుచేసుకున్న ఈ విభేదాలు అమెరికా అంతర్జాతీయ ప్రతిష్టను, వ్యూహాత్మక బలాన్ని బలహీనపరిచే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story