Trump warning to Iran: యుద్ధం ఆయిల్ కోసమే..అదే నాకిష్టం..తేల్చేసిన ట్రంప్
Trump warning to Iran: ఇరాన్ తో యుద్ధం ఆ దేశ ఆయిల్ కోసమే అని డోనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. అణ్వాయుధాలు వదలకపోతే ఇరాన్ దేశమే లేకుండా పోతుందని హెచ్చరించారు.
Trump warning to Iran
Trump warning to Iran: ఇరాన్ చమురుపై నియంత్రణ సాధించాలని తాను కోరుకుంటున్నట్లు ట్రంప్ ఆదివారం ఫైనాన్షియల్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. "నిజం చెప్పాలంటే, ఇరాన్ చమురును తీసుకోవడమే నాకు అత్యంత ఇష్టమైన విషయం. దాన్ని పొందడానికి అమెరికాకు చాలా మార్గాలు ఉన్నాయి," అని ట్రంప్ అన్నారు. "అమెరికాలోని కొంతమంది, 'మీరెందుకు ఇలా చేస్తున్నారు?' అని అంటారు. కానీ అలా అనే వాళ్ళు మూర్ఖులు." అంటూ తనను విమర్శిస్తున్నవారిపై ఆయన విరుచుకు పడ్డారు.
అణ్వాయుధాలు వదలాల్సిందే..
ఇరాన్ తన అణ్వాయుధాలను వదులుకోకపోతే, దానికి ఇకపై దేశం ఉండదని ట్రంప్ ఈ సందర్భంగా గట్టిగా మరోసారి తన హెచ్చరికను వినిపించారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండటం తనకు ఇష్టం లేదని, ఇరాన్ నాయకులు వాటిని వదులుకుంటారని తాను నమ్ముతున్నానని ట్రంప్ అన్నారు. అంతేకాకుండా, వారు ఇప్పుడు చాలా బలహీనంగా ఉన్నారని చెప్పారు. వారు తమ అణ్వాయుధాలను వదులుకుని, తమ దగ్గరున్న యురేనియంను మాకు ఇచ్చి, మా షరతులలో చాలావాటికి అంగీకరించాలి. అప్పుడే అది మంచి దేశం కాగలుగుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇరాన్ లేకుండా పోతుంది..
ఖార్గ్ ద్వీపాన్ని మనం స్వాధీనం చేసుకోవచ్చు.. లేకపోవచ్చు. కానీ, అక్కడ ఇరాన్ రక్షణ వ్యవస్థలు అంత బలంగా లేవనేది నిజం అని ట్రంప్ చెప్పారు. అందువల్ల అమెరికా దానిని సులభంగా స్వాధీనం చేసుకోగలదని స్పష్టం చేశారు. ఇవన్నీ చెబుతూనే ఇరాన్ తో యుద్ధాన్ని ముగించే ఒప్పందం త్వరలోనే కుదరవచ్చని ట్రంప్ అన్నారు. అయితే, అమెరికా ప్రతిపాదనను టెహ్రాన్ అంగీకరించకపోతే కనుక.. ఇక ఆ దేశం అనేదే లేకుండా పోతుందని ఆయన హెచ్చరించారు. యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్న వేళలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.
గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను తీవ్రతరం చేసింది
మరోవైపు గత కొన్ని గంటల్లో గల్ఫ్ దేశాల్లో ఇరాన్ దాడుల సంఖ్య పెరగడంతో, ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. అంతర్జాతీయ మీడియా నివేదికలు ప్రకారం, దుబాయ్‌లో సైరన్‌లు వినిపించాయి. దాడులను గగనతలంలోనే నిలిపివేస్తున్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి. బహ్రెయిన్‌లో కూడా పలు హెచ్చరికలు జారీ అయ్యాయి. అనేక పేలుళ్లు విన్నట్లు నివాసితులు తెలిపారు.
సౌదీ అరేబియా తన తూర్పు ప్రాంతంలో ఐదు బాలిస్టిక్ క్షిపణులు, ఒక క్రూయిజ్ క్షిపణిని గగనతలంలోనే కూల్చివేసినట్లు నివేదించింది. కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ, తమ గగనతలంలో 14 క్షిపణులు, 12 డ్రోన్‌లను గుర్తించినట్లు తెలిపింది. అంతకుముందు రాత్రి గుర్తించిన 17 క్షిపణుల సంఖ్యతో పోలిస్తే ఈ సంఖ్య తగ్గింది.
ఒక్క రోజులో ఇజ్రాయేల్ పై 10 దాడులు..
ఇరాన్ ఆదివారం క్షిపణులు, ఇతర ఆయుధాలను ఉపయోగించి ఇజ్రాయెల్‌పై 10 వేర్వేరు దాడులు చేసింది. నివేదిక ప్రకారం, ఈ దాడులు ఒకదాని తర్వాత ఒకటి జరగడంతో, ఇజ్రాయెల్‌లోని అనేక ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరిక సైరన్‌లు మోగడం ప్రారంభమయ్యాయి. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాల్సి వచ్చింది.




