Donald Trump : ‘మాట వినకపోతే కథ ముగించేస్తాం’.. ఇరాన్‌కు డోనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరిక
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్ దేశానికి తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. అయితే చర్చలు జరపాలి లేదా ఇరాన్‌ను పూర్తిగా కట్టడి చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Donald Trump
Donald Trump : అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దౌత్యపరమైన యుద్ధం మరోసారి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్ దేశాన్ని ఉద్దేశించి అత్యంత కఠినమైన వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్ వేదికగా మాట్లాడిన ట్రంప్, అమెరికాతో ఇరాన్ శాంతియుత ఒప్పందానికి రావాలని, లేనిపక్షంలో తామే రంగంలోకి దిగి పని పూర్తి చేస్తాం అంటూ పరోక్షంగా సైనిక చర్యకు సిద్ధమనే సంకేతాలు ఇచ్చారు. తాము ఏ రకంగానైనా విజయం సాధిస్తామని, ఇరాన్‌కు సంబంధించిన కీలకమైన మౌలిక సదుపాయాలను ఒక్క క్షణంలో బూడిద చేసే సామర్థ్యం అమెరికాకు ఉందని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే తాను యుద్ధాల కంటే చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవడానికి ఇష్టపడతానని పేర్కొన్నారు.
తమ దేశ సైనిక వ్యూహాలను వివరిస్తూ ట్రంప్ కీలక విషయాలను పంచుకున్నారు. తాము అనుకుంటే కేవలం ఒకే ఒక్క గంటలో ఇరాన్ లోని ప్రధాన వంతెనలన్నింటినీ కూల్చేయగలమని, వారి దేశ విద్యుత్ సరఫరాను పూర్తిగా అడ్డుకోగలమని హెచ్చరించారు. ఇరాన్ నిర్మించిన పెద్ద పెద్ద పవర్ ప్లాంట్లు, పారిశ్రామిక కేంద్రాలను నామరూపాలు లేకుండా చేసే సత్తా తమకు ఉందన్నారు. ప్రస్తుతం ఇరాన్ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉందని, వారి వద్ద తగినంత ధనం కూడా లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్‌లోని 9 కోట్ల మందికి పైగా ఉన్న సామాన్య ప్రజలపై యుద్ధ ప్రభావాన్ని చూపించడం ఇష్టం లేకే తాను శాంతియుత ఒప్పందాన్ని కోరుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త వైమానిక దాడుల్లో ఇరాన్ అత్యున్నత నేత అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణానంతరం వారం రోజుల పాటు జరిగిన అధికారిక అంత్యక్రియల వేడుకల్లో ఇరాన్ లోని శీర్షస్థానంలో ఉన్న ప్రముఖ నాయకులంతా ఒకే చోట గుమిగూడారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. ఆ సమయంలో తాము అనుకుంటే కేవలం ఒక్కే ఒక్క షాట్‌తో ఇరాన్ నాయకత్వాన్ని మొత్తం అంతమొందించే వాళ్లమని, కానీ భవిష్యత్తులో చర్చలు జరపడానికి ఎవరూ మిగలరనే ఉద్దేశంతోనే తాము ఆ పని చేయలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇరాన్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి.
డోనాల్డ్ ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఇరాన్ ప్రభుత్వం అత్యంత ఘాటుగా స్పందించింది. ఆర్మేనియాలోని ఇరాన్ రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదిక Xలో అమెరికా వైఖరిని తీవ్రంగా తప్పుబట్టింది. తమ దేశ సర్వోన్నత నేత ఖమేనీ మరణంతో ఇరాన్ ప్రజలు ఎంతటి శోకంలో ఉన్నారో అర్థం చేసుకునే నాగరికత గానీ, చరిత్ర గానీ, గౌరవం గానీ అమెరికాకు లేవని మండిపడింది. వ్యక్తులను చంపగలరేమో కానీ వారి ఆదర్శాలను, సిద్ధాంతాలను ఎప్పటికీ చంపలేరని ఇరాన్ స్పష్టం చేసింది. ఖమేనీని చంపడం ద్వారా అమెరికా ఒక అత్తరు సీసాను పగలగొట్టిందని, దానివల్ల ఆయన కీర్తి అనే సువాసన ఇప్పుడు ప్రపంచమంతటా విస్తరించిందని ఇరాన్ భావోద్వేగంగా పేర్కొంది.
మరోవైపు ఇరాన్ మాజీ అత్యున్నత నేత ఖమేనీ అంత్యక్రియల ఊరేగింపు దేశంలో ఇంకా కొనసాగుతోంది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం ఖమేనీ పార్థివ దేహాన్ని ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఇరాన్ లోని పవిత్ర నగరమైన కోమ్ కు తరలించారు. అక్కడి ప్రసిద్ధ జమకరన్ మసీదుపై హెలికాప్టర్ తిరుగుతున్న దృశ్యాలను ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా ప్రసారం చేసింది. ఈ అంత్యక్రియల ఊరేగింపు కోమ్ నగరంలో పూర్తయిన తర్వాత, తదుపరి సంప్రదాయ క్రతువుల కోసం పొరుగు దేశమైన ఇరాక్‌లోని ప్రపంచ ప్రసిద్ధ పవిత్ర నగరాలైన నజాఫ్, కర్బలాలకు తరలించనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.




