World War 3 : ఒక్క రాత్రిలో ఇరాన్ ఖతం.. ట్రంప్ హెచ్చరిక.. స్పందించిన ఇరాన్ ప్రజలు పవర్ ప్లాంట్ల దగ్గర ఏం చేశారంటే ?

Iran Protests
x

Iran Protests

Highlights

US vs Iran : ఇరాన్‌ను ఒక్క రాత్రిలో అంతం చేస్తామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. దీనికి నిరసనగా ఇరాన్ ప్రజలు తమ దేశ మౌలిక సదుపాయాలను రక్షించుకోవడానికి మానవ హారాలుగా ఏర్పడాలని ఆ దేశ మంత్రి పిలుపునిచ్చారు.

World War 3 : ప్రపంచ పటంలో మరో మహా యుద్ధం ముంచుకొస్తోందా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా వ్యాఖ్యలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఇరాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో వైట్ హౌస్ వేదికగా ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే కేవలం ఒక్క రాత్రిలోనే ఇరాన్‌ను నామరూపాలు లేకుండా తుడిచిపెట్టగలమని ఆయన హెచ్చరించారు. హోర్ముజ్ జలసంధిని ఇరాన్ నిర్ణీత సమయంలోగా తెరవకపోతే, ఆ దేశంలోని విద్యుత్ కేంద్రాలు, వంతెనలు, ఇతర కీలక మౌలిక సదుపాయాలపై కనికరం లేకుండా దాడులు చేస్తామని ట్రంప్ బాంబు పేల్చారు.

ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఇరాన్ యువజన క్రీడల శాఖ ఉప మంత్రి అలీరెజా రహీమీ తన దేశ ప్రజలకు ఒక ఉద్వేగభరితమైన పిలుపునిచ్చారు. అమెరికా బాంబు దాడుల నుంచి తమ విద్యుత్ కేంద్రాలను కాపాడుకోవడానికి దేశవ్యాప్తంగా ఉన్న యువకులు, కళాకారులు, క్రీడాకారులు రేపు మధ్యాహ్నం ఆయా ప్లాంట్ల వద్ద ఒకరి చేతులు ఒకరు పట్టుకుని మానవ హారాలు కట్టాలని కోరారు. ప్రజా మౌలిక సదుపాయాలపై దాడి చేయడం యుద్ధ నేరం అని ప్రపంచానికి చాటిచెప్పడమే తమ ఉద్దేశమని రహీమీ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

ఒకవైపు యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, మరోవైపు శాంతి చర్చలు కూడా సాగుతున్నాయి. పాకిస్థాన్ ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. సుమారు 45 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలని ఒక ప్రతిపాదనను పాకిస్థాన్ తెరపైకి తెచ్చింది. అయితే ఇరాన్ మాత్రం ఈ తాత్కాలిక ఒప్పందాలకు ససేమిరా అంటోంది. అమెరికాను తాము నమ్మడం లేదని, తమకు శాశ్వత భద్రతా గ్యారెంటీ కావాలని ఇరాన్ పట్టుబడుతోంది. కేవలం కాలయాపన చేసే ఒప్పందాల వల్ల తమకు ఒరిగేదేమీ లేదని ఇరాన్ స్పష్టం చేస్తోంది.

ఇరాన్ లో ఒకవైపు ప్రభుత్వం తరపున నిరసన ప్రదర్శనలు జరుగుతుండగా, మరోవైపు ట్రంప్ మాటలు ఇక్కడి అంతర్గత పరిస్థితులను రెచ్చగొట్టేలా ఉన్నాయి. "ఇరాన్ పౌరులకు గనుక స్వేచ్ఛ లభిస్తే, వారు అమెరికా చేసే దాడుల వల్ల కలిగే ఇబ్బందులను కూడా భరించడానికి సిద్ధంగా ఉంటారు" అని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆ దేశ ప్రజల్లోని అసమ్మతివాదులను ఉద్దేశించి చేసినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఇరాన్ లో ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మరి రేపు రహీమీ పిలుపు మేరకు ఎంతమంది ప్రజలు వీధుల్లోకి వస్తారో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories