US-Iran War: వద్దనే వరకు దాడులు చేయండి...ట్రంప్ అల్టిమేటం
ఇరాన్ యూఎస్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. యుద్ధం ముగిసింది అనుకున్న సమయంలో మరలా మొదటికి రావడం, ట్రంప్ యుద్ధాన్ని మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించడంతో ఏం జరుగుతుందోనని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.
US-Iran War: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇప్పుడు పతాక స్థాయికి చేరాయి. "నేను స్వయంగా ఆపమని చెప్పేంత వరకు ఇరాన్‌పై మా సైనిక దాడులు అస్సలు ఆగవు" అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అత్యంత స్పష్టమైన, కఠినమైన ప్రకటన చేశారు. అమెరికాతో ఇరాన్ శాంతి ఒప్పందం కుదుర్చుకోని పక్షంలో ఆ దేశంలో మట్టి తప్ప ఏమీ మిగలదని హెచ్చరించారు. ఈ హెచ్చరికలు ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం సృష్టించాయి. హోర్ముజ్ జలసంధిలో అంతర్జాతీయ నౌకల రాకపోకలపై ఇరాన్ ఆంక్షలు విధించడమే ఈ తాజా యుద్ధ వాతావరణానికి ప్రధాన కారణం.
నాలుగో రోజుకు చేరిన దాడులు ...ట్రంప్ వ్యూహాత్మక హెచ్చరికలు
ప్రముఖ అంతర్జాతీయ మీడియా ఛానల్‌తో మాట్లాడిన ట్రంప్, ఇరాన్ తీరుపై నిప్పులు చెరిగారు. రెండు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక అవగాహన ఒప్పందం పూర్తిగా కుప్పకూలడంతో, అమెరికా సైన్యం ఇరాన్‌పై వరుసగా నాలుగో రోజు కూడా వైమానిక దాడులను కొనసాగించింది. ఇరాన్ దళాలకు ఇంకాస్త ప్రతిఘటించే శక్తి ఉన్నప్పటికీ, అది చాలా తక్కువని ట్రంప్ కొట్టిపారేశారు. "రేపు రాత్రి, ఆ పై రాత్రి కూడా మా దాడులు చాలా బలంగా ఉంటాయి. ఒకవేళ ఇరాన్ చర్చల కోసం ముందుకు రాకపోతే వచ్చే వారం నుండి పరిస్థితి మరింత ఘోరంగా మారుతుంది. ఇరాన్‌లోని విద్యుత్ కేంద్రాలు, ప్రధాన వారధులు అన్నింటినీ మేము పూర్తిగా ధ్వంసం చేస్తాం" అని ట్రంప్ సంఖ్యలతో సహా తన తదుపరి వ్యూహాన్ని బయటపెట్టారు.
పౌరులకు నష్టం లేకుండా.. కానీ కఠినంగా!
యుద్ధంలో ఇరాన్ సామాన్య పౌరులకు నష్టం జరగకుండా అమెరికా సైన్యం చాలా జాగ్రత్తలు తీసుకుంటోందని ట్రంప్ చెప్పారు. అయితే, ఇరాన్ పాలకులకు మాత్రం ఇక సమయం లేదని తేల్చేశారు. "మీరు త్వరగా మాతో ఒప్పందం చేసుకోవడం మంచిది, లేదంటే అక్కడ ఏమీ మిగలదు" అని హెచ్చరించారు. ఈ కఠిన సందేశాన్ని కేవలం టీవీ ఇంటర్వ్యూలోనే కాకుండా, ఇంటర్వ్యూ ఇంచే గంట ముందే తమ ప్రతినిధుల ద్వారా ఇరాన్ అధికారులకు నేరుగా చేరవేసినట్లు కూడా ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ లొంగుతుందా అనే ప్రశ్నకు దిగిరావాలనే కోరుకుంటున్నట్టు ట్రంప్ సమాధానమిచ్చారు.
మొత్తంగా చూసుకుంటే... అమెరికాకు నేరుగా భూతల సైన్యాన్ని ఇరాన్ భూభాగంలోకి దించడం ఇష్టం లేదు. అవసరమైతే అమెరికా తరఫున ఆ పని చేయడానికి వేరే శక్తులు సిద్ధంగా ఉన్నాయని ట్రంప్ హింట్ ఇచ్చారు. గ్లోబల్ ఆయిల్ మార్కెట్‌ను శాసించే హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టు సాధించాలని చూస్తుండగా, అమెరికా మాత్రం అక్కడ పూర్తి నౌకాదళ దిగ్బంధనాన్ని విధిస్తూ ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీస్తోంది. ఈ పోరు ఎటు దారితీస్తుందోనని ప్రపంచ దేశాలు ఉత్కంఠగా గమనిస్తున్నాయి. ఆగిపోయింది అనుకున్న యుద్ధం మళ్లీ మొదటి రావడంతో ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ చమురు ధరలు పెరుగుతున్నాయి. దీంతో సామాన్యులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమెరికా పట్టు విడవటం లేదు. అటు ఇరాన్ దిగిరావడం లేదు. మధ్యలో సామాన్యుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారిపోయింది.




