Trump Strait of Hormuz: హోర్ముజ్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు... ఇరాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్
పశ్చిమాసియా ఉద్రిక్తతలపై ట్రంప్ మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం హోర్ముజ్ జలసంధి తమ ఆధీనంలోనే ఉందని, ఇరాన్ బెదిరింపులకు కాలం చెల్లిందని పేర్కొన్నారు.
Trump Strait of Hormuz: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరిన వేళ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి ప్రస్తుతం సంపూర్ణంగా అమెరికా సైనిక బలగాల నియంత్రణలోనే ఉందంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. టెహ్రాన్ తీరును ఎండగడుతూ, తాను ఇరాన్‌ను ఎప్పటికీ నమ్మబోనని, ఆ దేశం అంతర్జాతీయ వేదికలపై నిరంతరం అబద్ధాలు ఆడుతోందని విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. అదే సమయంలో, భద్రతా ముప్పు కారణంగా టర్కీలో తన విమానాన్ని మార్చాల్సి వచ్చిందన్న వార్తలను కూడా ఆయన స్వయంగా ధ్రువీకరించారు.
హోర్ముజ్ జలసంధిపై మాదే పూర్తి ఆధిపత్యం
విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ట్రంప్ ఇరాన్ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. తాము ఇరాన్‌ను ఎప్పటికీ నమ్మబోమని, ఆ దేశాన్ని ఏమాత్రం నమ్మని వ్యక్తుల్లో తాను మొదటి వరసలో ఉంటానని, అంతర్జాతీయ వేదికలపై ఇరాన్ అసత్యాలు చెప్పారని తెలిపారు. అంతేకాదు, చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి గురించి మాట్లాడుతూ... ప్రస్తుతం హోర్ముజ్ జలసంధిపై 100 శాతం నియంత్రణ ఉందని, ఆ మార్గం తమ ఆధీనంలోనే ఉందని ట్రంప్ పేర్కొన్నాడు. ఒకప్పుడు పశ్చిమాసియాలో ఇరాన్ సాగించిన బెదిరింపు ధోరణికి ఇక కాలం చెల్లిందని, ఇప్పుడు ఆ ప్రాంతంలో అమెరికా అత్యంత బలమైన స్థితిలో నిలిచిందని పేర్కొన్నారు.
విమానం మార్పుపై సీక్రెట్ సర్వీస్ స్పష్టత
ఇటీవల టర్కీ రాజధాని అంకారాలో ఎయిర్ ఫోర్స్ వన్ విమానం నుంచి సాధారణ రహస్య సైనిక విమానంలోకి ట్రంప్‌ను మార్చడంపై 'వాషింగ్టన్ పోస్ట్' వెలువరించిన కథనంపై కూడా ఆయన స్పందించారు. ఇరాన్ నుంచి తీవ్రమైన భద్రతా ముప్పు ఉందన్న నిఘా సమాచారంతోనే తమ నిఘా విభాగమైన 'సీక్రెట్ సర్వీస్' సైనిక అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన వివరించారు. భద్రతా సిబ్బంది తనను 'ఎయిర్ ఫోర్స్ వన్' విమానం దిగి C-32A సైనిక విమానంలోకి మారాలని కోరారని, వారి సూచనలను తాను యథాతథంగా పాటించానని చెప్పారు. సీక్రెట్ సర్వీస్ ఆదేశాల మేరకు పక్కా భద్రతా ప్రమాణాల నడుమ ఈ ప్రయాణ మార్పు జరిగిందని ట్రంప్ స్పష్టం చేశారు. టర్కీ పరిణామాల తరువాత హోర్ముజ్ జలసంధి వద్ద అమెరికా-ఇరాన్ మధ్య సైనిక, దౌత్య ఉద్రిక్తతలు మరింత తీవ్రస్థాయికి చేరుకున్నాయి.




