Trump on Iran: ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు... ఇరాన్‌పై మెగా ఎటాక్‌కు రెడీ

ఇరాన్‌పై ఇప్పటి వరకు చేసిన దాడులకంటే ఇకపై చేయబోయే దాడులు అత్యంత తీవ్రంగా ఉంటాయని ట్రంప్‌ తన సోషల్‌ మీడియా ద్వారా హెచ్చరికలు జారీ చేశారు.

Balachander
Published on: 24 July 2026 10:47 AM IST
Trump on Iran: ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు... ఇరాన్‌పై మెగా ఎటాక్‌కు రెడీ
X

Trump on Iran: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మళ్ళీ తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత సంచలనాత్మక ప్రకటన చేశారు. ఇరాన్‌పై ఇదివరకు ఎన్నడూ లేనంత భారీ స్థాయి సైనిక దాడికి సిద్ధమవుతున్నామని, దీనిపై తుది నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైందని ఆయన స్పష్టం చేశారు.

ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

గత 12 రోజులుగా అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో 'యాక్సియోస్' అనే మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. గతంలో చేపట్టిన 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' కంటే అతిపెద్ద సైనిక చర్యకు అమెరికా బలగాలు సిద్ధంగా ఉన్నాయని ట్రంప్ ప్రకటించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం గల్ఫ్‌లో జరుగుతున్న ఈ యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన మార్కెట్ అతలాకుతలమవుతోంది. క్రూడ్ ఆయిల్ ధర బారెల్‌కు 100 డాలర్లను దాటేసింది. మరికొన్ని రోజులు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఇంధనం కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇజ్రాయిల్‌ దీనిపై మరిన్ని వ్యాఖ్యలు చేసింది. అమెరికా కోరితే ఇజ్రాయిల్‌ నిమిషాల వ్యవధిలో దాడికి సిద్దమౌతుందని, కానీ, అమెరికాకు ఎవరి సహాయం అక్కర్లేదని ఇజ్రాయిల్‌ స్పష్టం చేసింది.

హోర్ముజ్ జలసంధిలో రాజుకున్న మంటలు

హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ జరుపుతున్న దాడులను అడ్డుకునేందుకు అమెరికా గత 12 రోజులుగా ప్రతిదాడులు చేస్తోంది. దీనికి తోడు ఎర్రసముద్రంలో సౌదీ అరేబియా నౌకలపై ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు విరుచుకుపడుతున్నారు. దీనిపై ట్రంప్‌ తన సోషల్‌ మీడియా ట్రంప్‌ ట్రూత్‌ ద్వారా కీలక వ్యాఖ్యలు చేశారు. హౌతీలు మళ్లీ దాడికి తెగిస్తే దానికి ఇరాన్‌ బాధ్యత వహించాల్సి వస్తుందని, యెమెన్‌ తిరుగుబాటు దారులు, ఇరాన్‌లు తీవ్రమైన సైనిక పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని ట్రంప్‌ స్పష్టం చేశారు. ఇరాన్ నాయకత్వం చర్చలకు ఆసక్తి చూపుతున్నప్పటికీ, సరైన ఒప్పందానికి మాత్రం ముందుకు రావడం లేదని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ఇక ఇదిలా ఉంటే, అమెరికా రక్షణ శాఖ ఇప్పటివరకు అధికారికంగా కొత్త సైనిక ఉత్తర్వులేవీ జారీ చేయలేదని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story