Trump Xi Putin Summit: ట్రంప్‌-జిన్‌పింగ్‌-పుతిన్‌ త్రైపాక్షిక భేటీ.. ప్రపంచ దేశాల్లో ఉత్కంఠ

చైనాలో ట్రంప్‌, జిన్‌పింగ్‌, పుతిన్‌ తొలిసారి త్రైపాక్షిక సమావేశం కానున్నారు. అణ్వాయుధ నియంత్రణ, ఇరాన్‌ యుద్ధం, అంతర్జాతీయ రాజకీయాలపై చర్చించనున్నారు.

Rudrachander
Published on: 14 Nov 2026 12:24 PM IST
Trump Xi Putin Summit: ట్రంప్‌-జిన్‌పింగ్‌-పుతిన్‌ త్రైపాక్షిక భేటీ.. ప్రపంచ దేశాల్లో ఉత్కంఠ
X

Trump Xi Putin Summit: ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామానికి రంగం సిద్ధమవుతోంది. అగ్రరాజ్యాలైన అమెరికా, చైనా, రష్యా అధినేతలు తొలిసారిగా ఒకే వేదికపై సమావేశం కానున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ వచ్చే వారం చైనాలోని షెన్‌జెన్‌లో భేటీ కానున్నట్లు వైట్‌హౌస్‌ ప్రకటించింది. ఆసియా-పసిఫిక్‌ ఆర్థిక సహకార (APEC) సదస్సు సందర్భంగా నవంబర్‌ 19న ఈ సమావేశం జరగనుంది. అణ్వాయుధ నియంత్రణ, ఇరాన్‌ యుద్ధం వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉండటంతో అంతర్జాతీయంగా ఈ భేటీపై ఆసక్తి నెలకొంది.

అణ్వాయుధాల నియంత్రణపై ప్రధాన చర్చ

ఈ సమావేశంలో ట్రంప్‌ ప్రధానంగా అణ్వాయుధాల నిల్వలను నియంత్రించే అంశాన్ని ప్రస్తావించనున్నట్లు సమాచారం. అమెరికా, రష్యా మధ్య కుదిరిన చివరి అణ్వాయుధ నియంత్రణ ఒప్పందం 'న్యూ స్టార్ట్‌' 2026 ఫిబ్రవరిలో ముగిసింది. దీంతో ప్రపంచంలో అత్యధిక అణ్వాయుధాలు కలిగిన ఈ రెండు దేశాలపై గత ఐదు దశాబ్దాలకు పైగా కొనసాగిన పరిమితులు తొలగిపోయాయి. ఈ ఒప్పందాన్ని మరో ఏడాది పొడిగించాలన్న రష్యా ప్రతిపాదనను ట్రంప్‌ అంగీకరించలేదు. దాని స్థానంలో ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా కొత్త ఒప్పందం రావాలని, అందులో చైనా కూడా భాగస్వామి కావాలని ఆయన కోరుతున్నారు. స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అంచనాల ప్రకారం అణ్వాయుధాల సంఖ్యలో రష్యా మొదటి స్థానంలో ఉండగా, అమెరికా తర్వాతి స్థానంలో ఉంది. చైనా మూడో స్థానంలో ఉంది. అమెరికా, రష్యా వద్ద ఒక్కొక్క దేశానికి 5,000కు పైగా అణ్వాయుధాలు ఉండగా, చైనా వద్ద 600కు పైగా వార్‌హెడ్లు ఉన్నట్లు అమెరికా రక్షణ శాఖ అంచనా. అయితే చైనా తన అణ్వాయుధ సామర్థ్యంపై పరిమితులు విధించే ఒప్పందంపై ఆసక్తి చూపడం లేదు. అందువల్ల ఈ సమావేశంలోనే ఏదైనా ఒప్పందం కుదిరే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అమెరికా అధికారులు చెబుతున్నారు.

ఇరాన్‌ యుద్ధంపై చర్చ.. ఉక్రెయిన్‌ అంశం పక్కకు?

ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం గురించి కూడా జిన్‌పింగ్‌, పుతిన్‌తో ట్రంప్‌ చర్చించనున్నట్లు అమెరికా అధికారి వెల్లడించారు. అయితే రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఈ సమావేశంలో ప్రస్తావించకూడదని ట్రంప్‌ భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోదిమిర్‌ జెలెన్‌స్కీ మాత్రం తమ దేశ భవిష్యత్తుపై తమ ప్రమేయం లేకుండానే ముగ్గురు నేతలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

యాల్టా సమావేశంతో పోలిక.. క్రెమ్లిన్‌ స్పందన

1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగింపు దశలో అమెరికా, బ్రిటన్‌, సోవియట్‌ యూనియన్‌ నేతలు యాల్టాలో సమావేశమై యుద్ధానంతర ప్రపంచ వ్యవస్థపై చర్చించారు. ఇప్పుడు జరగనున్న భేటీని కొందరు విశ్లేషకులు ఆ సమావేశంతో పోలుస్తున్నారు. అయితే ఈ పోలికను రష్యా అధ్యక్ష భవనం ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ అంగీకరించలేదు. షెన్‌జెన్‌లో జరిగే చర్చల్లో తీసుకునే నిర్ణయాలను ఇతర దేశాలపై రుద్దలేమని స్పష్టం చేస్తూనే, ఈ సమావేశం అత్యంత కీలకమైనదిగా అభివర్ణించారు. ఇదిలా ఉంటే, ట్రంప్‌ పర్యటనలో భాగంగా ఎలాన్‌ మస్క్‌ కూడా చైనాకు వెళ్లనున్నారు. అయితే ముగ్గురు దేశాధినేతల సమావేశంలో ఆయన పాల్గొనరు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌తోనూ ట్రంప్‌ ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం లేదని అమెరికా వర్గాలు తెలిపాయి.

Rudrachander

Rudrachander

రుద్ర చందర్‌ తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు