US vs Iran : పెట్రోడాలర్ వర్సెస్ యువాన్.. అగ్రరాజ్యం ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చేందుకు చైనా మాస్టర్ ప్లాన్

US vs Iran : ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల వెనుక చైనా సీక్రెట్ వార్ నడుపుతోంది. పెట్రోడాలర్ పతనం, అమెరికా ఆర్థిక వ్యవస్థపై ముంచుకొస్తున్న ముప్పు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

CR Reddy
Published on: 21 April 2026 7:38 AM IST
US vs Iran
X

US vs Iran

US vs Iran : అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు ఒక వింతైన చిక్కుల్లో పడింది. ఒకవైపు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపిస్తామని హెచ్చరిస్తుంటే, మరోవైపు చర్చల కోసం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు తన దూతలను పంపిస్తున్నారు. అయితే, చర్చలకు వచ్చే ప్రసక్తే లేదని ఇరాన్ భీష్మించుకు కూర్చోవడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు ట్రంప్ ఎందుకు ఇంతగా ఆందోళన చెందుతున్నారు? ఇరాన్ వెనుక ఉన్న చైనా వ్యూహం ఏమిటి? దీనివల్ల అమెరికా డాలర్ సామ్రాజ్యం కూలిపోనుందా? ఈ ఆసక్తికర అంశాల గురించి తెలుసుకుందాం.

పెట్రోడాలర్ వ్యవస్థకు పొంచి ఉన్న ముప్పు

అమెరికా ఇంతలా భయపడటానికి ప్రధాన కారణం పెట్రోడాలర్ వ్యవస్థ దెబ్బతినడమే. 1970ల నుంచి ప్రపంచవ్యాప్తంగా చమురు విక్రయాలు డాలర్లలోనే జరుగుతున్నాయి. దీనివల్ల ప్రతి దేశానికి డాలర్ అవసరం ఉంటుంది, తద్వారా అమెరికా డాలర్ విలువ ఎప్పుడూ తగ్గదు. కానీ ఇప్పుడు ఇరాన్, చైనా సాయంతో చమురును చైనా కరెన్సీ యువాన్‎లో విక్రయించాలని ప్లాన్ చేస్తోంది. ఇదే జరిగితే ప్రపంచ మార్కెట్లో డాలర్ డిమాండ్ పడిపోతుంది. డాలర్ విలువ తగ్గితే అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగి, సామాన్యుల జీవితం దుర్భరంగా మారుతుంది.

స్విఫ్ట్ వర్సెస్ సిస్ప్

సాధారణంగా అమెరికా తన శత్రు దేశాలపై ఆంక్షలు విధించినప్పుడు, ఆ దేశాలను స్విఫ్ట్ బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి తొలగిస్తుంది. దీనివల్ల ఆ దేశాలు వేరే దేశాలతో ఆర్థిక లావాదేవీలు జరపలేవు. అయితే, చైనా ఇప్పుడు దీనికి ప్రత్యామ్నాయంగా సిస్ప్ (CIPS) అనే వ్యవస్థను సిద్ధం చేసింది. ఇది కేవలం సమాచారాన్ని పంపడమే కాకుండా, నేరుగా డబ్బును కూడా బదిలీ చేయగలదు. ఇరాన్ ఈ వ్యవస్థను వాడటం మొదలుపెడితే, అమెరికా విధించే ఆర్థిక ఆంక్షలకు విలువ ఉండదు. ఇది అమెరికా ఆధిపత్యాన్ని నేరుగా సవాలు చేయడమే.

చైనా సీక్రెట్ గేమ్ – ట్రంప్ ఆందోళన

డొనాల్డ్ ట్రంప్‌కు ఇప్పుడు ఒక విషయం అర్థమైంది. తాను ఇరాన్‌తో యుద్ధం చేస్తున్నానని అనుకుంటున్నాడు కానీ, అసలు లాభం పొందుతున్నది చైనా అని ఆయనకు తెలుసు. యుద్ధం వల్ల చమురు ధరలు పెరిగితే అమెరికా ఆర్థికంగా దెబ్బతింటుంది, అదే సమయంలో చైనా తన కరెన్సీని ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేసుకుంటుంది. చైనా ఈ యుద్ధంలో నేరుగా పాల్గొనకుండానే అమెరికాను ఆర్థికంగా దెబ్బతీస్తోంది. ఈ డ్రాగన్ జాలం చూసి అమెరికా నిఘా సంస్థలు కూడా షాక్‌లో ఉన్నాయి.

గ్రేటర్ డిప్రెషన్ భయం

అమెరికా నిఘా నివేదికల ప్రకారం.. ఒకవేళ హోర్ముజ్ జలసంధి మూడు నెలల కంటే ఎక్కువ కాలం మూతబడితే, ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 250 డాలర్ల వరకు చేరుకోవచ్చు. ఇదే జరిగితే 1930లో వచ్చిన మహా మాంద్యం కంటే భయంకరమైన ఆర్థిక సంక్షోభం అమెరికా, ఐరోపా దేశాల్లో వస్తుంది. అమెరికాపై ఉన్న 40 ట్రిలియన్ డాలర్ల అప్పును తీర్చడం అసాధ్యంగా మారుతుంది. అందుకే ట్రంప్ ఒకవైపు బెదిరిస్తూనే, మరోవైపు ఇస్లామాబాద్ చర్చల కోసం అంతలా తాపత్రయపడుతున్నారు. యుద్ధం కంటే శాంతి చర్చలే అమెరికా ఆర్థిక వ్యవస్థను కాపాడగలవని ఆయన భావిస్తున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story