Donald Trump : డోనాల్డ్ ట్రంప్ దెబ్బకు దిగివచ్చిన ఇరాన్.. ఉరి కంబం ఎక్కాల్సిన మహిళలకు ప్రాణభిక్ష
Donald Trump : ఇరాన్లో ఉరిశిక్ష పడాల్సిన 8 మంది మహిళలను డోనాల్డ్ ట్రంప్ విజ్ఞప్తితో ఇరాన్ ప్రభుత్వం విడుదల చేసింది.
Donald Trump
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బుధవారం సోషల్ మీడియా వేదికగా ఒక కీలక సమాచారాన్ని పంచుకున్నారు. ఇరాన్లో నిరసనల కారణంగా అరెస్టై, ఉరిశిక్షకు సిద్ధంగా ఉన్న ఎనిమిది మంది మహిళల ప్రాణాలను కాపాడాలని తాను చేసిన డిమాండ్‌ను ఇరాన్ ప్రభుత్వం గౌరవించిందని ఆయన తెలిపారు. ఆ మహిళల ఉరిశిక్షను రద్దు చేసి, వారిలో నలుగురిని తక్షణమే విడుదల చేస్తున్నట్లు ఇరాన్ నాయకులు తనకు సమాచారం ఇచ్చారని ట్రంప్ పేర్కొన్నారు. ఈ నిర్ణయం పట్ల ఆయన ఇరాన్ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.
శిక్షల తగ్గింపు వివరాలు
ఉరిశిక్ష పడాల్సిన ఆ ఎనిమిది మంది మహిళల్లో నలుగురిని వెంటనే విడుదల చేయగా, మిగిలిన నలుగురికి కేవలం ఒక నెల జైలు శిక్షగా ఖరారు చేశారు. ప్రభుత్వంపై నిరసన తెలిపినందుకు గాను గత జనవరిలో వీరిని భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి. వీరిపై తీవ్రమైన నేరారోపణలు మోపి బుధవారమే ఉరి తీయాలని ఇరాన్ కోర్టులు భావించాయి. అయితే చివరి నిమిషంలో ట్రంప్ జోక్యంతో వారి ప్రాణాలు నిలబడ్డాయి. కాగా, మార్చి నెలలోనే మరో ఇద్దరు మహిళలను బెయిల్ పై విడుదల చేసినట్లు మానవ హక్కుల సంఘాలు వెల్లడించాయి.
ఫోటో వైరల్.. ఇరాన్ స్పందన
మంగళవారం ట్రంప్ తన సోషల్ మీడియాలో ఇరాన్ జైల్లో ఉన్న ఇద్దరు యువతులు సహా పలువురు మహిళల ఫోటోను పోస్ట్ చేశారు. వారిపై జరుగుతున్న అన్యాయమైన విచారణను నిలిపివేయాలని కోరారు. దీనిపై ఇరాన్ న్యాయశాఖ వెంటనే స్పందించింది. వాస్తవానికి వారికి ఉరిశిక్ష వేసే ఆలోచన తమకు లేదని, అప్పటికే కొందరిని విడుదల చేశామని బుకాయించే ప్రయత్నం చేసినప్పటికీ, ట్రంప్ ప్రకటన తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.
అంతర్జాతీయ స్థాయిలో ట్రంప్ ఇమేజ్
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇతర దేశాలపై ఆయన చూపిస్తున్న ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా శత్రు దేశంగా భావించే ఇరాన్‌ను ఒప్పించి, మరణశిక్ష పడిన మహిళలను విడిపించడం ఆయన దౌత్య నీతికి నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవ హక్కుల కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.




