Turkey Explosion: స్టీల్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. 16 మంది మృతి, 13 మందికి గాయాలు
టర్కీలోని ఇజ్మీర్ ప్రావిన్స్ అలియాగా ప్రాంతంలో హబాస్ స్టీల్ ప్లాంట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 16 మంది మృతి చెందగా, 13 మంది గాయపడ్డారు.
Turkey Explosion
Turkey Explosion: టర్కీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇజ్మీర్ ప్రావిన్స్‌లోని అలియాగా ప్రాంతంలో ఉన్న హబాస్ స్టీల్ ప్లాంట్‌లో సోమవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 13 మంది గాయపడ్డారు. కర్మాగారంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలు, భద్రతా లోపాలు, బాధ్యులెవరనే అంశాలపై న్యాయపరమైన, పరిపాలనా విచారణకు ఆదేశించారు.
బాయిలర్ మారుస్తుండగా ఘోరం
ప్రావిన్షియల్ గవర్నర్ సులేమాన్ ఎల్బాన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. స్టీల్ ప్లాంట్‌లో బాయిలర్‌ను మార్చే పనులు జరుగుతున్నాయి. ఈ సమయంలో పనుల కోసం ఉపయోగిస్తున్న క్రేన్ అదుపుతప్పి స్టీల్ తయారుచేసే కొలిమిలో పడింది. దీంతో భారీ పేలుడు సంభవించి సమీప ప్రాంతంలో మంటలు వ్యాపించాయి. బాయిలర్ మార్పిడి పనుల కారణంగా అప్పటికే ప్లాంట్‌లో ఉత్పత్తిని నిలిపివేశారు. సాధారణంగా అక్కడ 300 మంది కార్మికులు పనిచేస్తుండగా, ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 200 మంది మాత్రమే ఉన్నట్లు గవర్నర్ తెలిపారు. పేలుడు తర్వాత ప్లాంట్ నుంచి దట్టమైన పొగ ఆకాశంలోకి ఎగసిపడిన దృశ్యాలు స్థానిక మీడియా ప్రసారం చేసింది.
పేలుడు ధాటికి కంపించిన భూమి
పేలుడు శబ్దం చాలా భయంకరంగా ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. భూమి ఒక్కసారిగా కంపించినట్లు అనిపించిందని, మొదట భూకంపం వచ్చిందేమోనని భయపడ్డామని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక, అత్యవసర సహాయక బృందాలు అక్కడికి చేరుకున్నాయి. మంటలను అదుపు చేయడంతో పాటు ప్లాంట్‌లో చిక్కుకున్న వారి కోసం గాలింపు చేపట్టాయి. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు టర్కీ హోంమంత్రి ముస్తఫా సిఫ్ట్సీ వెల్లడించారు.
అదుపులోకి ఐదుగురు
ఈ ప్రమాదానికి అసలు కారణమేంటి? క్రేన్ కొలిమిలో పడటానికి కారణాలేంటి? పనులు జరుగుతున్న సమయంలో భద్రతా ప్రమాణాలు పాటించారా? అనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. టర్కీ న్యాయశాఖ మంత్రి అకిన్ గుర్లెక్ ఈ కేసు విచారణ కోసం నలుగురు ప్రభుత్వ న్యాయవాదులను నియమించినట్లు తెలిపారు. ప్రైవేటు వార్తా సంస్థ డెమిరోరెన్ కథనం ప్రకారం.. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదంలో నిర్లక్ష్యం ఎవరిదైనా ఉందని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఈ ఘటనపై దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.
ఏడాదికి 45 లక్షల టన్నుల ఉక్కు తయారీ సామర్థ్యం
ప్రమాదం జరిగిన హబాస్ స్టీల్ ప్లాంట్‌ను 1987లో ప్రారంభించారు. కంపెనీ వెబ్సైట్ వివరాల ప్రకారం.. ఈ పరిశ్రమ ఏడాదికి సుమారు 45 లక్షల టన్నుల ఉక్కును తయారు చేయగలదు. ఈ ప్లాంట్ ఉన్న అలియాగా ప్రాంతం పెద్ద ఓడరేవుకు ప్రసిద్ధి. ఇక్కడ ఓడలను విడదీసి వాటి భాగాలను తిరిగి ఉపయోగించే పరిశ్రమలు కూడా ఉన్నాయి. అయితే ఈ కార్యకలాపాల వల్ల పర్యావరణానికి నష్టం కలుగుతోందని గతంలో విమర్శలు వచ్చాయి. ఇప్పుడు భారీ పేలుడు ఘటనతో పారిశ్రామిక భద్రత, కార్మికుల రక్షణపై మరోసారి చర్చ మొదలైంది.




