Strait Of Hormuz: షరతులకు ఒప్పుకుంటేనే హోర్ముజ్ జలసంధి తెరుస్తాం..ఇరాన్ బిగ్ ట్విస్ట్
Strait Of Hormuz: అమెరికా తన ప్రవర్తనను మార్చుకునే వరకు హోర్ముజ్ జలసంధిని తెరిచేది లేదని ఇరాన్ స్పష్టం చేసింది. సీజ్ ఎత్తివేత, సైన్యం ఉపసంహరణ, నష్టపరిహారంతో కూడిన కొత్త షరతులను విధించింది.
Strait Of Hormuz
Strait Of Hormuz: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు సడలే సూచనలు కనిపించడం లేదు. అమెరికా తన వైఖరిని మార్చుకుని, ప్రవర్తనను మెరుగుపరుచుకునే వరకు ప్రపంచంలోనే అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ జాతీయ భద్రతా మండలి స్పష్టం చేసింది. ఇరాన్ రివొల్యూషనరీ గార్డ్స్ కమాండర్, భద్రతా మండలి కార్యదర్శి మొహమ్మద్ బాగేర్ జోల్గాద్ర్ ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రసార మాధ్యమాల ద్వారా వెల్లడించారు. జలసంధి ద్వారా నౌకల రాకపోకలను పునరుద్ధరించేందుకు, శాంతి ఒప్పందాలు చేసుకోవడానికి ఇరాన్ అనేక కొత్త డిమాండ్లను అమెరికా ముందుంచింది.
ఏమిటి ఇరాన్ విధించిన కొత్త షరతులు?
అమెరికా ఇకపై ఎప్పటికీ ఇరాన్‌ను బెదిరించకూడదని, ఇరాన్, దాని ప్రాంతీయ మిత్రదేశాలపై సాగిస్తున్న యుద్ధాన్ని శాశ్వతంగా నిలిపివేయాలని ఇరాన్ డిమాండ్ చేసింది. దీనితో పాటు ఇరాన్ ఓడరేవులపై విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని తక్షణమే ఎత్తివేయాలని, మధ్యప్రాచ్య ప్రాంతం నుండి అమెరికా తన సైనిక బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని పేర్కొంది. అంతేకాకుండా యుద్ధం వల్ల ఇరాన్‌కు జరిగిన ఆస్తి నష్టానికి పూర్తి పరిహారం చెల్లించడంతో పాటు, విధించిన ఆంక్షలను తొలగించి, జప్తు చేసిన ఇరాన్ ఆస్తులను ఎలాంటి నిబంధనలు లేకుండా వెంటనే విడుదల చేయాలని స్పష్టం చేసింది. ఈ డిమాండ్లపై అమెరికా నుండి ఇంకా ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.
యుఏఈ చమురు నౌకపై ఇరాన్ క్షిపణి దాడి
మరొకవైపు హోర్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రభుత్వ రంగ సంస్థ ADNOCకి చెందిన ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ క్షిపణి దాడికి పాల్పడింది. ఈ దాడి శనివారం తెల్లవారుజామున జరగగా, అదృష్టవశాత్తూ సిబ్బందికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని కంపెనీ ప్రకటించింది. ఇరాన్-అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరిగినప్పటి నుంచి తమ కంపెనీకి చెందిన డజనుకు పైగా నౌకలపై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసిందని, ఈ ఘటనల్లో ఒక సిబ్బంది మరణించగా 20 మంది గాయపడ్డారని ఎడిఎన్‌ఒసి వెల్లడించింది.
ఒమన్ సమీపంలో నౌకకు మంటలు
యుకే మెరైన్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ అందించిన సమాచారం ప్రకారం.. ఒమన్‌లోని ఖసబ్ నగరానికి తూర్పున ప్రయాణిస్తున్న ఒక వాణిజ్య నౌకపై క్షిపణి దాడి జరగడంతో మంటలు చెలరేగాయి. అయితే నౌకా సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారని, నౌకతో పాటు సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని తెలిపారు. అంతర్జాతీయ జలమార్గంగా ఉన్న హోర్ముజ్ జలసంధిని పునరుద్ధరించడానికి ఇరాన్, ఒమన్ దేశాలు ఒకవైపు చర్చలు జరుపుతున్నప్పటికీ, ఇరాన్ జరుపుతున్న వరుస దాడులు గల్ఫ్ ప్రాంతంలో చమురు రవాణాపై తీవ్ర భయాందోళనలు సృష్టిస్తున్నాయి.




