UAE Secret Strikes on Iran:యూఏఈ సీక్రెట్‌ ఆపరేషన్ః ఇరాన్‌ లక్ష్యంగా భీకర దాడులు...కీలక రిపోర్ట్‌లో బయటపడ్డ వాస్తవాలు

గల్ప్‌లో కీలక దేశమైన యూఏఈ నిర్వహించిన సీక్రెట్‌ ఆపరేషన్‌ కారణంగానే మధ్యప్రాచ్యంలో వివాదాలు చోటు చేసుకున్నాయి. యూఏఈ నిర్వహించిన ఈ సీక్రెట్‌ ఆపరేషన్‌కి సంబంధించిన రిపోర్ట్‌లో కీలక అంశాలు బయటపడ్డాయి.

Balachander
Published on: 30 May 2026 1:13 PM IST
UAE Secret Strikes on Iran:యూఏఈ సీక్రెట్‌ ఆపరేషన్ః  ఇరాన్‌ లక్ష్యంగా భీకర దాడులు...కీలక రిపోర్ట్‌లో బయటపడ్డ వాస్తవాలు
X

UAE Secret Strikes on Iran: మధ్యప్రాచ్యంలో ఎవరూ ఊహించని ఒక సంచలన నిజం తాజాగా వెలుగులోకి వచ్చింది. అమెరికా-ఇజ్రాయెల్ కూటమికి, ఇరాన్‌కు మధ్య జరిగిన యుద్ధం ప్రారంభమైన తొలినాళ్లలో.. గల్ఫ్ దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అత్యంత రహస్యంగా ఇరాన్‌పై డజన్ల కొద్దీ వైమానిక దాడులు జరిపింది. అంతర్జాతీయ ప్రముఖ పత్రిక 'వాల్ స్ట్రీట్ జర్నల్' ప్రచురించిన ఒక ప్రత్యేక కథనం ప్రకారం.. అమెరికా, ఇజ్రాయెల్ అందించిన వ్యూహాత్మక నిఘా సమాచారంతోనే యూఏఈ ఈ సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించింది. 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' ప్రారంభంలో మొదలైన ఈ రహస్య దాడులు, అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ జరిగేంత వరకు కొనసాగాయి.

యూఏఈ దాడుల లక్ష్యాలు ఇవే!

ఇరాన్‌ను ఆర్థికంగా, సైనికంగా దెబ్బతీయడమే లక్ష్యంగా యూఏఈ ఈ ఆపరేషన్ చేపట్టింది. వ్యూహాత్మక హోర్ముజ్ జలసంధి పరిసర ప్రాంతాలతో పాటు కీలకమైన చమురు రవాణా కేంద్రాలపై ఈ దాడులు జరిగాయి. వ్యూహాత్మక ప్రాంతాలైన ఖేష్మ్, అబు మూసా దీవులపై యూఏఈ దాడి చేసింది. ఇరాన్‌కు చెందిన ప్రసిద్ధ నౌకాశ్రయ నగరం బందర్ అబ్బాస్‌ను టార్గెట్ చేశారు. ఏప్రిల్ 8వ తేదీ ఉదయం పది గంటల సమయంలో లావన్ ఐలాండ్‌లోని చమురు రిఫైనరీపై రహస్యంగా దాడి జరిగింది. ఇరాన్ జాతీయ చమురు సంస్థ ఈ దాడిని ధృవీకరించినప్పటికీ, ప్రాణనష్టం ఏమీ జరగలేదని పేర్కొంది. అత్యంత కీలకమైన 'అసలుయె పెట్రోకెమికల్ గ్యాస్ కాంప్లెక్స్' పై యూఏఈ-ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. అయితే అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత రావడంతో, ఇజ్రాయిల్‌ ఒక్కటే ఈ దాడులు చేసిందని చెప్పి యూఏఈ పేరు బయటకు రాకుండా దాచిపెట్టారు. ఇలా వరసగా యూఏఈ దాడులు చేయడంతో ఇరాన్‌ ప్రతిదాడులకు దిగింది. యూఏఈని లక్ష్యంగా చేసుకొని సుమారు 2800 క్షిపణులను ప్రయోగించి విరుచుకుపడింది.

గల్ఫ్ దేశాల మధ్య విభేదాలు ... ఒపెక్ నుండి యూఏఈ నిష్క్రమణ

ఈ ఆపరేషన్ గల్ఫ్ దేశాల అంతర్గత బంధాల మధ్య పెద్ద చీలికను తెచ్చింది. ఇరాన్‌పై ఉమ్మడి దాడికి రావాల్సిందిగా సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌ను యూఏఈ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్ కోరారు. కానీ, సౌదీ యువరాజు అందుకు పూర్తిగా నిరాకరించారు. మాకు సంబంధంలేని యుద్ధం అని సౌదీ చెప్పడం విశేషం. అంతేకాకుండా, గల్ప్‌ దేశాల చమురు మౌలిక సదుపాయాలపై ఇరాన్ ఎదురుదాడి చేసే ప్రమాదం ఉందని గ్రహించిన సౌదీ అరేబియా.. ఈ సైనిక చర్యలను వెంటనే నిలిపివేయాల్సిందిగా అమెరికాపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది.

ఈ పరిణామాల తర్వాత ఇజ్రాయెల్‌తో యూఏఈ సంబంధాలు మరింత బలపడ్డాయి. ఇజ్రాయెల్ తన ప్రసిద్ధ 'ఐరన్ డోమ్' క్షిపణి రక్షణ వ్యవస్థలను, వాటిని నడిపే ఆపరేటర్లను యూఏఈ రక్షణ కోసం పంపింది. ఈ యుద్ధ పరిణామాల వల్లే ఆర్థిక భద్రత కోసం వాషింగ్టన్ నుండి 'కరెన్సీ స్వాప్ లైన్' ను యూఏఈ కోరింది. అంతేకాకుండా, సౌదీతో విభేదాల కారణంగా అంతర్జాతీయ చమురు ఉత్పత్తి దేశాల కూటమి అయిన ఒపెక్‌, ఒపెక్‌ ప్లస్‌ నుండి యూఏఈ శాశ్వతంగా నిష్క్రమించేలా చేసింది.భూభాగాల రక్షణ కోసం గల్ఫ్ దేశాలు తమ దశాబ్దాల నాటి విదేశాంగ విధానాలను మార్చుకుంటున్నాయనడానికి ఈ సీక్రెట్ ఆపరేషనే ప్రత్యక్ష ఉదాహరణ. యూఏఈ సీక్రెట్‌ ఆపరేషన్‌ తరువాతే మధ్యప్రాచ్యంలో రణనినాదం మరింత ఊపందుకుంది. అమెరికాతో పాటు ఇజ్రాయిల్‌కూడా ఇరాన్‌పై విరుచుకుపడింది. అటు ఇరాన్‌ కూడా ఇజ్రాయిల్‌, అమెరికా వ్యూహాత్మక రక్షణ బేస్‌లను ధ్వంసం చేసింది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story