Assisted Dying: చావును కోరుకునే వారికి నిరాశ.. బ్రిటన్‌లో అమల్లోకి రాని చట్టం

Assisted Dying: బ్రిటన్‌లోని ఇంగ్లాండ్, వేల్స్‌లో తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారికి కారుణ్య మరణం కల్పించేందుకు ఉద్దేశించిన అసిస్టెడ్ డైయింగ్ బిల్లును ఆ దేశ పార్లమెంట్ తాజాగా తిరస్కరించింది.

CR Reddy
Published on: 12 Sept 2026 7:01 AM IST
Assisted Dying
X

Assisted Dying

Assisted Dying: బ్రిటన్‌లోని ఇంగ్లాండ్, వేల్స్‌లో తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారికి కారుణ్య మరణం కల్పించేందుకు ఉద్దేశించిన అసిస్టెడ్ డైయింగ్ బిల్లును ఆ దేశ పార్లమెంట్ తాజాగా తిరస్కరించింది. సుదీర్ఘకాలంగా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ కీలక బిల్లుకు హౌస్ ఆఫ్ కామన్స్ ఆమోద ముద్ర వేయకపోవడంతో పాత నిబంధనలే యథావిధిగా అమల్లో ఉండనున్నాయి. బ్రిటన్ పార్లమెంట్‌లో తీవ్ర వాదనలు, సుదీర్ఘ చర్చల అనంతరం ఇచ్ఛా మరణాల బిల్లుపై ఓటింగ్ నిర్వహించారు. సుమారు నాలుగు గంటలకు పైగా జరిగిన ఈ సవివరమైన చర్చలో సభ్యులు తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు తెలిపారు. చివరికి హౌస్ ఆఫ్ కామన్స్‌లో జరిగిన ఓటింగ్‌లో ఈ బిల్లుకు వ్యతిరేకంగా 286 ఓట్లు పడగా, అనుకూలంగా 270 ఓట్లు మాత్రమే వచ్చాయి. కేవలం స్వల్ప తేడాతో బిల్లు వీగిపోవడం గమనార్హం. గత సంవత్సర ఇదే రకమైన బిల్లుకు అనుకూలంగా ఫలితాలు రావడం విశేషం. అయితే పార్లమెంట్ ఎగువ సభ అయిన హౌస్ ఆఫ్ లండన్ లో ఆమోదం పొందకపోవడం వల్ల ఇది చట్టం రూపం దాల్చలేదు.

బిల్లులో ఉన్న కీలక నిబంధనలు ఏమిటి?

ఈ వివాదాస్పద బిల్లు ప్రకారం ఇంగ్లాండ్, వేల్స్ ప్రాంతాలకు చెందిన తీవ్ర అనారోగ్య బాధితులు, మరో ఆరు నెలల కంటే తక్కువ ఆయుష్షు మాత్రమే మిగిలి ఉన్నవారు స్వచ్ఛందంగా మరణాన్ని ఎంచుకోవడానికి అవకాశం కల్పించాలని ప్రతిపాదించారు. అయితే దీనికోసం ఇద్దరు ప్రత్యేక వైద్యులు, ఒక నిపుణుల కమిటీ సమగ్ర పరిశీలన జరిపి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో ఎలాంటి లోపాలు జరగకుండా కఠినమైన భద్రతా చర్యలు ఉంటాయని ప్రతిపాదకులు తెలిపారు.

సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు

ఈ బిల్లుపై చర్చ సందర్భంగా ఎంపీలు తీవ్రమైన నైతిక, సామాజిక సవాళ్లను లేవనెత్తారు. కొందరు ప్రజాప్రతినిధులు ప్రాణాంతక వ్యాధులతో బాధపడేవారి క్షోభను అంతం చేయడానికి చట్టపరమైన అవకాశం కల్పించాలని వాదించారు. మరోవైపు విపక్ష సభ్యులు, వైద్య నిపుణులు మాత్రం దీనివల్ల బలహీన వర్గాలపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుందని హెచ్చరించారు. వైద్య రంగంలో వ్యాధి తీవ్రతను, మరణ సమయాన్ని కచ్చితంగా అంచనా వేయడం సాధ్యం కాదని డాక్టర్లు అభిప్రాయపడ్డారు. మతపరమైన పెద్దలు సైతం ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించి మానసిక రుగ్మతలు ఉన్నవారి భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.

చరిత్ర సృష్టించే అవకాశాన్ని కోల్పోయామన్న మద్దతుదారులు

ఈ బిల్లు ఆమోదం పొంది ఉంటే 1967 నాటి అబార్షన్ చట్టం తర్వాత బ్రిటన్ సామాజిక విధానంలో ఇదే అతిపెద్ద చారిత్రాత్మక మార్పు అయి ఉండేదని మద్దతుదారులు ఆవేదన వ్యక్తం చేశారు. చివరి క్షణాలలో స్విట్జర్లాండ్ వంటి దేశాలకు వెళ్లే బాధ తప్పి ఉండేదని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఈ ప్రయత్నం విఫలమైనప్పటికీ రాబోయే కాలంలో ఈ అంశాన్ని మళ్లీ పార్లమెంట్ ముందుకు తీసుకువస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.