UK Heatwave: మండిపోతున్న ఐరోపా ఖండం.. రికార్డులను తిరగరాస్తున్న ఉష్ణోగ్రతలు
UK Heatwave: యూరప్ ఖండాన్ని తీవ్రమైన ఉష్ణగాలులు నరకం చూపిస్తున్నాయి. బ్రిటన్‌లో గురువారం నమోదైన 38.1 డిగ్రీల ఉష్ణోగ్రత ఈ ఏడాదిలోనే అత్యంత వేడి రోజుగా నిలిచింది.
UK Heatwave
UK Heatwave: బ్రిటన్ దేశాన్ని వేసవి తాపం కోలుకోలేని దెబ్బతీస్తోంది. జాతీయ వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గురువారం నాటి ఉష్ణోగ్రత ఏకంగా 38.1 డిగ్రీల సెల్సియస్‌కు చేరింది. ఈ ఏడాది జూన్ 28న నమోదైన 38 డిగ్రీల రికార్డును ఇది దాటేసింది. ఐతే 2003 ఆగస్టు నెలలో నమోదైన ఆల్‌టైమ్ రికార్డు 38.5 డిగ్రీల కంటే ఇది కాస్త తక్కువగా ఉండటం కొసమెరుపు. ఫ్రాన్స్ తరహాలోనే బ్రిటన్‌లో కూడా ఈ వేసవిలో ఐదోసారి తీవ్రమైన ఉష్ణగాలులు వీస్తుండటంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు.
మండిపోతున్న ఐరోపా ఖండం
కేవలం బ్రిటన్ మాత్రమే కాకుండా యూరప్‌లోని ఇతర దేశాలు కూడా వేడిగాలుల తీవ్రతకు భయపడిపోతున్నాయి. ఫ్రాన్స్‌లో వరుసగా 17 రోజుల పాటు భయంకరమైన వేడిగాలులు వీచాయి. ఇది ఆ దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన హీట్‌వేవ్‌గా నిలిచింది. ఫ్రాన్స్‌లోని కొన్ని నగరాల్లో 39 డిగ్రీలు, ప్యారిస్‌లో 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. స్పెయిన్‌లోని మిరాండా డి ఎబ్రో ప్రాంతంలో ఉష్ణోగ్రత ఏకంగా 42.4 డిగ్రీలకు చేరడంతో అడవుల్లో కార్చిచ్చు రగులుకునే ప్రమాదం పొంచి ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నీటి ఎద్దడి.. విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర విఘాతం
తీవ్రమైన ఎండల కారణంగా స్కాట్లాండ్ తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో అడవులకు నిప్పు అంటుకునే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. జులై నెల నుంచి వేధిస్తున్న తీవ్ర కరువుతో ఇంగ్లాండ్, వేల్స్ ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. డెన్యూబ్ నదిలో నీటి మట్టాలు ఆందోళనకరంగా పడిపోవడంతో థర్మల్ పవర్ ప్లాంట్లకు కూలింగ్ వాటర్ కొరత ఏర్పడింది. వేడిని తట్టుకోవడానికి విద్యుత్ వినియోగం పెరగడం, మరోవైపు పవర్ ప్లాంట్లు ఉత్పత్తి తగ్గించడంతో విద్యుత్ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది.
హెల్త్ అలర్ట్ జారీ చేసిన యంత్రాంగం
ఇంగ్లాండ్‌లోని లండన్, మిడ్‌లాండ్స్, యార్క్‌షైర్ ప్రాంతాల్లో తీవ్ర ప్రతికూల వాతావరణ హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రజల ఆరోగ్యంపై ఈ వేడి తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్న హెచ్చరికల మధ్య శుక్రవారం రాత్రి వరకు అత్యవసర ఆరోగ్య అలర్ట్‌ను పొడిగించారు. ఆసుపత్రుల్లో ప్రత్యేక వైద్య సేవలను అందుబాటులో ఉంచారు.




