Ukraine Attacks: రష్యా టార్గెట్‌గా ఉక్రెయిన్ 70 డ్రోన్ల దాడి.. భారత చమురు దిగుమతులకు ముప్పు!
Ukraine Attacks: రష్యాలోని కీలక చమురు క్షేత్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఉక్రెయిన్ సోమవారం తెల్లవారుజామున భారీ డ్రోన్ దాడులు చేసింది.
Ukraine Attacks: రష్యా టార్గెట్‌గా ఉక్రెయిన్ 70 డ్రోన్ల దాడి.. భారత చమురు దిగుమతులకు ముప్పు!
Ukraine Attacks: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరోసారి అంతర్జాతీయంగా ఇంధన రంగాన్ని కుదిపేస్తోంది. రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే వ్యూహంలో భాగంగా.. సోమవారం తెల్లవారుజామున రష్యాలోని చమురు క్షేత్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడులకు తెగబడింది. ఈ దాడుల్లో భారత్‌కు చమురు ఎగుమతి చేసే అత్యంత కీలకమైన బాల్టిక్ సముద్రంలోని ఓడరేవులు తీవ్రంగా దెబ్బతిన్నట్లు రష్యా రక్షణ రంగానికి చెందిన ఉన్నతాధికారులు వెల్లడించారు.
ఉక్రెయిన్ ఏకకాలంలో డజన్ల కొద్దీ డ్రోన్లతో రష్యా ఇంధన కేంద్రాలపై దాడికి దిగింది. రష్యా వైమానిక రక్షణ వ్యవస్థలు గగనతలంలోనే 70కి పైగా ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసినట్లు మాస్కో ప్రకటించింది. అయినప్పటికీ కొన్ని డ్రోన్లు చమురు శుద్ధి కర్మాగారాలను (Oil Refineries) తాకడంతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. ఈ దాడుల కారణంగా చమురు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని, ఇంధనం నింపే కేంద్రాల వద్ద కిలోమీటర్ల మేర ఆయిల్ ట్యాంకర్లు నిలిచిపోయాయని రష్యా అధికారులు పేర్కొన్నారు.
రష్యాలోని అతిపెద్ద మరియు వ్యూహాత్మక ఓడరేవుల్లో ఒకటైన ఉస్ట్-లుగా (Ust-Luga) తో పాటు వైసోట్స్క్ పోర్టులను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ ఈ దాడులు నిర్వహించింది. మాస్కోను ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి చేసేందుకు గతంలోనూ ఉక్రెయిన్ ఈ ఓడరేవులను టార్గెట్ చేసింది. రష్యా నుంచి భారతదేశానికి ఎగుమతి అవుతున్న మొత్తం ముడి చమురులో దాదాపు 60 నుండి 70 శాతం వాటా కేవలం బాల్టిక్ సముద్ర మార్గంలోని ఉస్ట్-లుగా, ప్రిమోర్స్క్ ఓడరేవుల ద్వారానే జరుగుతోంది.
ఉస్ట్-లుగా పోర్ట్ నుండి బయలుదేరే చమురు నౌకలు (Tankers) ఉత్తర సముద్రం, సూయజ్ కాలువ, ఎర్ర సముద్రం మీదుగా సుదీర్ఘ ప్రయాణం చేసి భారత తీరాలకు చేరుకుంటాయి. ప్రస్తుత దాడుల నేపథ్యంలో ఈ రష్యన్ ఓడరేవులు ధ్వంసం కావడం అంతర్జాతీయ మార్కెట్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. రష్యా నుంచి వచ్చే రవాణా మార్గంలో అంతరాయం ఏర్పడితే, ఆ ప్రభావం నేరుగా భారతదేశ చమురు దిగుమతులపై మరియు దేశీయ ఇంధన ధరలపై పడే అవకాశం ఉందని చమురు రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.




