Ukraine Russia War : రష్యాపై ఉక్రెయిన్ మరోసారి భారీ డ్రోన్ దాడులు.. 9 మంది మృతి, 80 మందికి గాయాలు

Ukraine Russia War : మాస్కో పరిసరాల్లోని ఆన్‌లైన్ షాపింగ్ వేర్‌హౌస్‌లు, ఆయిల్ డిపోలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడుల్లో 9 మంది మరణించగా, 80 మందికి పైగా గాయపడ్డారు.

CR Reddy
Published on: 19 July 2026 8:28 AM IST
Ukraine Russia War
X

Ukraine Russia War

Ukraine Russia War : ఉక్రెయిన్ మరోసారి రష్యా భూభాగంపై అత్యంత భారీ స్థాయిలో డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. ఈ సారి రష్యాకు చెందిన ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం వైల్డ్‌బెర్రీస్‎కు చెందిన రెండు భారీ వేర్‌హౌస్‌లు, ఒక ప్రధాన ఆయిల్ డిపోతో పాటు పలు సైనిక లాజిస్టిక్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ ఈ దాడులకు తెగబడింది. రష్యన్ అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. ఈ ఆకస్మిక దాడుల కారణంగా వేర్వేరు ప్రాంతాల్లో 9 మంది ప్రాణాలు కోల్పోగా, 80 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడులు రష్యా భద్రతా వ్యవస్థలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి.

ఆన్‌లైన్ షాపింగ్ వేర్‌హౌస్‌లపై విరుచుకుపడిన డ్రోన్లు

ఈ దాడుల్లో మొదటిది ఉక్రెయిన్ సరిహద్దుకు దాదాపు 360 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాంబోవ్ ప్రాంతంలోని కొతోవ్స్క్ నగరంలో ఉన్న వైల్డ్‌బెర్రీస్ వేర్‌హౌస్‌పై జరిగింది. ఇక్కడ రాత్రి షిఫ్ట్‌లో కార్మికులు పని చేస్తున్న సమయంలో డ్రోన్లు వచ్చి పడ్డాయి. ఈ ఘోర ప్రమాదంలో అక్కడికక్కడే ఏడుగురు ఉద్యోగులు మరణించగా, 25 మంది గాయపడినట్లు తాంబోవ్ గవర్నర్ యెవ్గెని పెర్విషోవ్ తెలిపారు. ఇక రెండో దాడి మాస్కోకు తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలెక్ట్రోస్టాల్‌లోని మరో వేర్‌హౌస్‌పై జరిగింది. ఇక్కడ 61 మంది గాయపడగా, వారిలో 40 మందిని ఆసుపత్రికి తరలించారు, చికిత్స పొందుతూ ఆ తర్వాత ఒకరు మరణించినట్లు మాస్కో ప్రాంత గవర్నర్ ఆండ్రీ వోరోబ్యోవ్ వెల్లడించారు.

ఆయిల్ డిపో టార్గెట్‌గా పేలుళ్లు

వేర్‌హౌస్‌లపై దాడులు జరుగుతున్న సమయంలోనే ఉక్రెయిన్ డ్రోన్లు నోగిన్స్క్‌లోని ఒక ప్రధాన ఆయిల్ డిపోను కూడా ఢీకొట్టాయి. ఈ దాడి కారణంగా ఆయిల్ డిపోలో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాద తీవ్రత దృష్ట్యా, అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలో ఉన్న ఒక ప్రసూతి ఆసుపత్రితో పాటు నివాస సముదాయాలను అధికారులు ఖాళీ చేయించారు. కొన్ని డ్రోన్ల శిథిలాలు స్థానిక చిన్న పిల్లల పాఠశాల పై పడటంతో అక్కడ కూడా మంటలు చెలరేగాయి. అయితే అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. మరోవైపు శనివారం మధ్యాహ్నం బెల్గోరోడ్ ప్రాంతంలో జరిగిన దాడిలో మరొకరు మరణించారు.

రష్యా సైనిక సరఫరా గొలుసును టార్గెట్ చేశాం

ఈ విధ్వంసకర దాడుల అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీ అధికారికంగా స్పందించారు. మాస్కో, తాంబోవ్ ప్రాంతాలలో తాము దాడులు చేసిన లాజిస్టిక్ కేంద్రాలు సాధారణ వ్యాపార సంస్థలు కావని, రష్యా సైన్యం డ్రోన్లు, నావిగేషన్ పరికరాల తయారీ కోసం విదేశాల నుంచి అక్రమంగా తెప్పించే నిషేధిత విడిభాగాలను సరఫరా చేయడానికి వీటిని వాడుకుంటోందని ఆయన ఆరోపించారు. రష్యా సైన్యం సప్లై చైన్‌ను పూర్తిగా దెబ్బతీసేందుకే ఉక్రెయిన్ ప్రత్యేక సైనిక దళాలు అజోవ్ సముద్రం, రష్యా ఆధీనంలో ఉన్న మిగిలిన ప్రాంతాల్లోని సైనిక స్థావరాలపై ఈ దాడులు నిర్వహించినట్లు జెలెన్స్కీ స్పష్టం చేశారు.

నల్లసముద్రంలో రష్యా యుద్ధనౌకలపై దాడి

ఉక్రెయిన్ సైన్యం తాజా ప్రకటన ప్రకారం.. నోగిన్స్క్ ఆయిల్ డిపో రష్యా సైన్యానికి అవసరమైన ఇంధనాన్ని నిరంతరం సరఫరా చేస్తోంది, అందుకే దానిని ప్రధానంగా టార్గెట్ చేశామని వెల్లడించింది. దీనితో పాటు బ్లాక్ సీ, అజోవ్ సముద్రంలో ఉన్న రష్యాకు చెందిన రెండు ఆయిల్ ట్యాంకర్లు, రెండు ఫ్లోటింగ్ క్రేన్లు, ఒక టగ్ బోట్‌ను తాము విజయవంతంగా ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. అలాగే కెర్చ్ ప్రాంతంలో రష్యా గస్తీ నౌక అయిన ప్రాజెక్ట్ 10410 స్వెత్ల్యాక్ క్లాస్ షిప్‌పై దాడి చేయడంతో పాటు, లుహాన్స్క్ ప్రాంతంలోని సాబివ్కా వద్ద రష్యా సైనిక సామాగ్రి, ఆయుధాల రవాణాకు ఉపయోగించే ఒక కీలక రైల్వే వంతెనను కూడా పేల్చివేసినట్లు ఉక్రెయిన్ మిలిటరీ స్పష్టం చేసింది.

379 డ్రోన్లను కూల్చేశామన్న రష్యా రక్షణ శాఖ

ఉక్రెయిన్ దాడులపై రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. తమ వైమానిక రక్షణ వ్యవస్థలు రాత్రి వేళల్లో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి రష్యాలోని 19 విభిన్న ప్రాంతాలతో పాటు క్రిమియా, అజోవ్, నల్లసముద్రం మీదుగా దూసుకొచ్చిన సుమారు 379 ఉక్రేనియన్ డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా క్లెయిమ్ చేసింది. అయినప్పటికీ రష్యా రక్షణ వలయాన్ని ఛేదించుకుని కొన్ని డ్రోన్లు తమ లక్ష్యాలను చేరుకోవడంతో వేర్‌హౌస్‌లు, ఆయిల్ డిపోలు, రవాణా మౌలిక సదుపాయాలకు భారీ ఎత్తున నష్టం వాటిల్లిందని రష్యా అధికారులు అంగీకరించారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story