Ukraine Truce Oleshky: ఉక్రెయిన్‌ యుద్ధం మిగిల్చిన ఆకలి కష్టాలు - కలుపు మొక్కలే ఆహారం

ఉక్రెయిన్‌లోని ఒలెష్కీ నగరంలో ఆహారం, నీరు లేక కలుపు మొక్కలు తింటూ బతుకుతున్న ప్రజల కోసం కాల్పుల విరమణ ప్రారంభమైంది. సహాయక చర్యలు, పౌరుల తరలింపు వివరాలు తెలుసుకుందాం.

Balachander
Published on: 27 Oct 2026 6:25 PM IST
Ukraine Truce Oleshky: ఉక్రెయిన్‌ యుద్ధం మిగిల్చిన ఆకలి కష్టాలు - కలుపు మొక్కలే ఆహారం
X

Ukraine Truce Oleshky: ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రజల జీవితాలను ఎంత దుర్భరంగా మార్చిందో చెప్పడానికి ఒలెష్కీ నగరమే నిదర్శనం. తినడానికి తిండి లేదు.. తాగడానికి నీళ్లు లేవు.. ఇళ్లలో విద్యుత్‌ సరఫరా లేదు. బయటకు వెళ్లాలన్నా మందుపాతరలు, డ్రోన్ల దాడుల భయం. ఇలాంటి పరిస్థితుల్లో బతకడం కోసం కొందరు తమ తోటల్లో పెరిగిన కలుపు మొక్కలనే వండుకుని తినాల్సి వస్తోంది. రష్యా ఆధీనంలోని ఈ ఉక్రెయిన్‌ నగరంలో చిక్కుకుపోయిన ప్రజలకు సహాయం అందించేందుకు తాజాగా పరిమిత కాల్పుల విరమణ ప్రారంభమైంది. అయితే, ఈ విరామం ఎంతవరకు కొనసాగుతుంది? ప్రజలు సురక్షితంగా బయటపడగలరా? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

ప్రజలను కాపాడేందుకు కాల్పుల విరమణ

ఖెర్సన్‌ ప్రాంతంలో, డ్నిప్రో నదికి సమీపంలో ఉన్న ఒలెష్కీ నగరం యుద్ధ పరిస్థితుల కారణంగా బయట ప్రపంచంతో సంబంధాలు కోల్పోయింది. ఒకవైపు నది, మరోవైపు రష్యా సైనిక బలగాలు ఉండటంతో అక్కడి నుంచి బయటపడటం కష్టంగా మారింది. ఆహారం, నీరు, మందులు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో మానవతా సహాయం అందించడంతో పాటు పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కాల్పుల విరమణకు ఏర్పాట్లు చేసినట్లు ఉక్రెయిన్‌ అధికారులు, రష్యా రక్షణ శాఖ వెల్లడించాయి. అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ మధ్యవర్తిత్వంతో ఈ ప్రయత్నం జరిగినట్లు వైట్‌హౌస్‌ తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం నవంబర్‌ 1 రాత్రి 11.59 గంటల వరకు ఈ విరామం అమల్లో ఉండాలని ఉక్రెయిన్‌ ఎంపీ డేవిడ్‌ అరాఖామియా పేర్కొన్నారు.

24 వేల మంది ఉన్న నగరం.. ఇప్పుడు ఎంతమంది?

యుద్ధానికి ముందు ఒలెష్కీ నగరంలో సుమారు 24,000 మంది నివసించేవారు. 2022 ఫిబ్రవరిలో రష్యా పూర్తిస్థాయి దండయాత్ర ప్రారంభించిన తొలి రోజుల్లోనే ఈ నగరం రష్యా ఆధీనంలోకి వెళ్లింది. ప్రస్తుతం నగరంలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో కలిపి సుమారు 6,000 మంది ఉన్నట్లు ఉక్రెయిన్‌ అంచనా వేస్తోంది. వారిలో దాదాపు 200 మంది పిల్లలు ఉన్నారు. నగరంలోనే సుమారు 1,700 మంది మిగిలి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆహార కొరత ఎంత తీవ్రంగా ఉందంటే, తినడానికి ఏమీ దొరకక తోటల్లో పెరిగే కలుపు మొక్కలను వండుకుని తింటున్నామని కొందరు స్థానికులు బీబీసీకి తెలిపారు. మరోవైపు, నగరం నుంచి బయటకు వెళ్లే మార్గాల్లో మందుపాతరలు ఉండటం, డ్రోన్ల దాడుల ముప్పు కారణంగా ప్రజల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంది.

ఆసుపత్రుల్లోనూ దయనీయ పరిస్థితులు

ఒలెష్కీలో వైద్య సేవలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. గత నెలలో స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, అక్కడ ఒక ఆసుపత్రి మాత్రమే పరిమితంగా పనిచేస్తోంది. అదీ వారంలో కొన్ని రోజులు మాత్రమే తెరుచుకుంటూ, అత్యవసర పరిస్థితుల్లో అవయవాల తొలగింపు వంటి శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఒక మహిళ మందుపాతరపై కాలు వేయడంతో తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో రెండు శస్త్రచికిత్సలు చేయించుకున్నట్లు బీబీసీకి తెలిపింది. తరలింపు ప్రక్రియలో తాను పాల్గొనగలనా లేదా అన్న ఆందోళనను ఆమె వ్యక్తం చేసింది. మరోవైపు, ప్రజలను తరలించే మార్గాల్లో కాల్పులు మళ్లీ మొదలవుతాయేమోనని కుటుంబ సభ్యులు భయపడుతున్నారు.

బయటపడినా భద్రతపై ఆందోళన

కాల్పుల విరమణతో సహాయక సామగ్రిని నగరంలోకి పంపడం, బయటకు వెళ్లే మార్గాల్లో మందుపాతరలను తొలగించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోదిమిర్‌ జెలెన్‌స్కీ కార్యాలయ అధిపతి కిరిలో బుడనోవ్‌ ఈ తరలింపు సురక్షితంగా జరగడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. అయితే, ప్రజలను రష్యా వైపు తరలించే ప్రమాదం ఉందని జెలెన్‌స్కీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇళ్లను వదిలి వెళ్లే వారిని తిరిగి ఉక్రెయిన్‌ నియంత్రణలోని ప్రాంతాలకు అనుమతిస్తారా? వారి ఫోన్లలోని సమాచారాన్ని పరిశీలిస్తారా? అనే భయాలు కూడా స్థానికుల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల తరలింపు ప్రణాళికకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా స్పష్టంగా లేవు. ఇదిలా ఉండగా, ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై సోమవారం రాత్రి జరిగిన దాడుల్లో ఒకరు మరణించగా, మరో 14 మంది గాయపడ్డారు. రష్యాలోని బ్రయాన్స్క్‌పై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడిలో ఒకరు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. ఒలెష్కీలో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటికీ, ఇతర ప్రాంతాల్లో దాడులు కొనసాగుతుండటం యుద్ధం ముగియడానికి ఇంకా ఎంత సమయం పడుతుందో తెలియని పరిస్థితిని సూచిస్తోంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.