UN Report: ముక్కంటేనేగాని ముద్ద దిగడం లేదు...60 ఏళ్లలో ఆరురెట్లు పెరిగిన వినియోగం
1961తో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా ఒక్కో వ్యక్తి చికెన్ వినియోగం ఆరు రెట్లు పెరిగిందని యూఎన్ నివేదిక వెల్లడించింది. మాంసాహార వినియోగం, పర్యావరణ ప్రభావాలు, భవిష్యత్ సవాళ్లపై ఆసక్తికర విశ్లేషణ ఇది.
UN Report: ఆహార అలవాట్లు ఎంత వేగంగా మారిపోతున్నాయో చెప్పడానికి ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన నివేదికే ఒక పెద్ద ఉదాహరణ. గత 60 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా చికెన్ వినియోగం ఏకంగా ఆరు రెట్లు పెరిగింది. 1961వ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఒక సగటు మనిషి ఏడాదికి కేవలం మూడు కిలోల చికెన్ మాత్రమే తినేవాడు. కానీ, 2022 నాటికి అది ఏకంగా 17 కిలోలకు చేరుకుందని యూఎన్ పరిధిలోని ‘ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్’ స్పష్టం చేసింది. ఈ మాంసాహార విప్లవం కేవలం మన ప్లేట్లను మాత్రమే కాదు, మనం నివసిస్తున్న భూగోళాన్ని కూడా తీవ్రంగా వేడెక్కిస్తోందని ఈ నివేదిక హెచ్చరిస్తోంది.
ఆరు రెట్లు పెరిగిన చికెన్.. రెట్టింపైన పోర్క్
యూఎన్ నివేదిక ప్రకారం.. గత ఆరు దశాబ్దాలలో ప్రపంచవ్యాప్తంగా మాంసం సరఫరా నాలుగు రెట్లు పెరిగింది. 1961లో ఒక వ్యక్తి సగటున 25 కిలోల మాంసాహారాన్ని వినియోగిస్తే, 2022 నాటికి ఆ సంఖ్య 47 కిలోలకు చేరింది. 1961లో మూడు కిలోల చికెన్ వినియోగించగా 2022 నాటికి ఆరురెట్లు పెరిగి 17 కిలోలకు చేరుకుంది. ఇక ఫోర్క్ రెండు రెట్లు పెరిగి 15 కిలోలకు చేరింది. అయితే పర్యావరణాన్ని అత్యధికంగా కాలుష్యానికి గురిచేసే బీఫ్ వినియోగం 60 ఏళ్లుగా ఎలాంటి పెరుగుదల లేకుండా 9 కిలోల వద్దనే స్థిరంగా కొనసాగుతోంది. మాంసం ఉత్పత్తులు దాదాపుగా 14 శాతం వరకు వృధా అవుతున్నట్టు నివేదికలో తేలింది.
భూమిని వేడెక్కిస్తున్న 'ఫుడ్' పాలిటిక్స్
ప్రపంచవ్యాప్త కాలుష్యంలో పారిశ్రామిక రంగాలు మొదటి స్థానంలో ఉంటే, వ్యవసాయం, పశుపోషణ రంగాలు రెండో స్థానంలో ఉన్నాయి. రాబోయే పదేళ్లలో పశువుల ద్వారా వెలువడే గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాలు మరో 7.6% పెరిగే అవకాశం ఉంది. వాతావరణ మార్పులపై పనిచేసే అంతర్జాతీయ కమిటీ సైతం.. భూతాపాన్ని తగ్గించాలంటే మాంసాహారాన్ని తగ్గించి, శాఖాహారం వైపు మొగ్గు చూపాలని నెత్తీనోరూ బాదుకుంటోంది. అయితే, ఈ హెచ్చరికలను ధనిక దేశాలు పట్టించుకోవడం లేదు. వైద్యులు, శాస్త్రవేత్తలు మాంసం తగ్గించాలని చెబుతున్నా... పట్టించుకోవడం లేదు. మితిమీరిన వినియోగం సాగుతున్నట్టుగా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అదే సమయంలో పేద దేశాల్లో పోషకాహార లోపం ఉన్నప్పటికీ మాంసాహారం తీసుకోవాలంటే ఎక్కువ మొత్తంలో ఖర్చుచేయాల్సి వస్తుండటంతో పేదలు ఈ ఆహారానికి దూరంగా ఉంటున్నారు.




