Killer Robots: కిల్లర్‌ రోబోలతో మానవాళికి పెనుముప్పు... ఐరాస కీలక హెచ్చరికలు

కిల్లర్‌ రోబోలను మనం సినిమాల్లో మాత్రమే చూశాం. కానీ, ఇకపై నిజ జీవితంలో కూడా చూడబోతున్నామని, వాటిని నియంత్రించకుంటే మనిషి మనుగడకు ముప్పు వాటిల్లుతుందని ఐరాస హెచ్చరించింది.

Balachander
Published on: 24 July 2026 9:47 AM IST
Killer Robots: కిల్లర్‌ రోబోలతో మానవాళికి పెనుముప్పు... ఐరాస కీలక హెచ్చరికలు
X

Killer Robots: మానవ నియంత్రణ లేని 'కిల్లర్ రోబోల' వల్ల మానవాళికి తీవ్రమైన ముప్పు పొంచి ఉందని, వీటిని తక్షణమే నిషేధించాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ హెచ్చరించారు. శాస్త్రసాంకేతిక రంగాల్లో వస్తున్న విప్లవాత్మక మార్పులు యుద్ధ మార్గాలను మార్చేస్తుండగా, కృత్రిమ మేధ సాయంతో పనిచేసే ఈ ఆటోమేటిక్ ఆయుధ వ్యవస్థలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. వీటి వలన తీవ్రమైన ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయని, వీటిని నియంత్రించకపోతే మనిషి మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు.

మారణాయుధాలుగా మారుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

గతంలో డ్రోన్లు లేదా క్షిపణులను ప్రయోగించాలంటే మనుషుల ప్రమేయం తప్పనిసరిగా ఉండేది. కానీ నేడు సైనిక సాంకేతికత 'ఇన్ ది లూప్' నుంచి 'ఆఫ్ ది లూప్' దిశగా వేగంగా మారుతోంది. అంతేకాదు, ఇంటర్నెట్ 100 కోట్ల మంది ప్రజలకు చేరడానికి 15 ఏళ్లు పడితే, ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ కేవలం రెండేళ్లలోనే ఆ స్థాయిని అందుకుంది. 2003 ఇరాక్ యుద్ధంలో అసలు రోబోలు లేవు, కానీ కేవలం ఆరేళ్లలోనే అంటే 2009 నాటికి అమెరికా దాదాపు 12,000 గ్రౌండ్ రోబోలు, 7,000 డ్రోన్లను రంగంలోకి దించింది. అంతేకాదు, ఇజ్రాయెల్ 'లావెండర్' అనే ఏఐ వ్యవస్థ ద్వారా దాదాపు 37,000 మంది లక్ష్యాలను కేవలం కొన్ని రోజుల్లోనే గుర్తించింది. ఫలితంగా గాజాలో 70,000 మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు.

భద్రతా రంగానికి, ఏఐ దిగ్గజాలకు మధ్య వివాదం

యుద్ధ అవసరాల కోసం రూపొందించే ఏఐ మోడళ్లపై అమెరికా రక్షణ శాఖ, ప్రముఖ ఏఐ సంస్థ 'ఆంత్రోపిక్' మధ్య వివాదం చెలరేగింది. గతేడాది 200 మిలియన్ డాలర్ల ప్రాజెక్టుల ఒప్పందం పొందినప్పటికీ, మానవులను చంపే స్వయంప్రతిపత్తి ఆయుధాల తయారీకి తమ సాంకేతికతను వాడకూడదని ఆంత్రోపిక్ నిరాకరించింది. ఐరాస ప్రవేశపెట్టిన నిరోధక తీర్మానానికి 156 దేశాలు మద్దతు తెలపగా, అమెరికా, రష్యా, ఉత్తర కొరియా, బెలారస్, ఇజ్రాయెల్ దేశాలు వ్యతిరేకించాయి. ప్రయోగాత్మక స్థాయి దాటి తేనెటీగల గుంపుల మాదిరిగా స్వయంచాలిత డ్రోన్ల సమూహాలు దాడులు చేసే స్థితికి సాంకేతికత చేరుకోవడం ప్రపంచ భద్రతకే ముప్పుగా మారే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు డ్రోన్‌ అంటే గద్దలా పెద్దగా ఉండేవి..కానీ, ఇప్పుడు ఈగలు మాదిరిగా అత్యంత చిన్నగా ఉంటూ మనుషుల ప్రాణాలను తీసే స్థాయికి చేరుకున్నాయి. మానవ అవసరాలను తీర్చేందుకు కనిపెట్టిన డ్రోన్‌, రోబోలు...మనిషి ప్రాణాలు తీసే స్థాయికి చేరడంతో ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story