Viral Love Story: నలుగురు పిల్లల తల్లి కోసం.. 200 అడుగుల ఎత్తులో ప్రేమికుడి రచ్చ!

Viral Love Story: ఉత్తరప్రదేశ్‌లో వింత ఘటన వెలుగుచూసింది. తనకంటే 20 ఏళ్లు పెద్దదైన, నలుగురు పిల్లల తల్లిని పెళ్లి చేసుకుంటానంటూ ఓ యువకుడు ఏకంగా 200 అడుగుల మొబైల్ టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు.

Arun Chilukuri
Published on: 26 Jun 2026 10:49 AM IST
Viral Love Story
X

Viral Love Story: నలుగురు పిల్లల తల్లి కోసం.. 200 అడుగుల ఎత్తులో ప్రేమికుడి రచ్చ!

Viral Love Story: ప్రేమకు వయసుతో సంబంధం లేదంటారు పెద్దలు.. కానీ ఇక్కడొక ప్రేమికుడు ఆ ప్రేమ కోసం ఏకంగా ప్రాణాలనే పణంగా పెట్టాడు. తనకంటే 20 ఏళ్లు పెద్దదైన, నలుగురు పిల్లల తల్లి అయిన మహిళను పెళ్లాడతానంటూ ఓ యువకుడు ఏకంగా 200 అడుగుల మొబైల్ టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫర్రూఖాబాద్‌ జిల్లా కాయంగంజ్‌ పట్టణంలో బుధవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరాఖండ్‌లోని అల్మోడా జిల్లాకు చెందిన చందన్‌ శెఖావత్‌ (30) ముంబయిలోని ఒక హోటల్‌లో వంటవాడిగా పనిచేస్తున్నాడు. గతంలో ఇతడు యూపీలోని కాయంగంజ్‌లో కొంతకాలం ఉన్న సమయంలో.. అక్కడ నలుగురు పిల్లలు ఉన్న ఒక మహిళ (50)తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా సాన్నిహిత్యంగా మారింది. అయితే, ఇటీవలి కాలంలో ఆమె తన ఫోన్‌ను స్విచ్చాఫ్ చేయడంతో చందన్ తట్టుకోలేకపోయాడు. ఆమెను వెతుక్కుంటూ ముంబయి నుంచి నేరుగా కాయంగంజ్‌కు చేరుకున్నాడు.

పట్టణానికి చేరుకున్న చందన్ నేరుగా 200 అడుగుల ఎత్తున్న మొబైల్ టవర్ ఎక్కేశాడు. అంతటితో ఆగకుండా, తానే స్వయంగా 112 నంబరుకు డయల్‌ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. "నా ప్రియురాలిని ఇక్కడికి పిలిపిస్తేనే నేను కిందకు దిగుతా.. లేదంటే దూకేస్తా" అంటూ భీష్మించుకు కూర్చున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది, స్థానికులు అక్కడికి భారీగా చేరుకున్నారు. అతడిని చూసేందుకు జనం గుమిగూడటంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జాం ఏర్పడింది.

యువకుడిని కిందకు దించేందుకు పోలీసులు, ఫైర్ సిబ్బంది గంటల తరబడి తలలు పట్టుకున్నారు. ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో.. చివరికి "నీ ప్రియురాలిని పిలిపిస్తాం, మీ ఇద్దరికీ పెళ్లి చేస్తాం" అంటూ పోలీసులు గట్టి హామీ ఇచ్చారు. దీంతో శాంతించిన చందన్.. దాదాపు ఆరు గంటల హైడ్రామా తర్వాత నెమ్మదిగా కిందకు దిగివచ్చాడు. ప్రయాసపడి అతడిని కిందకు దించిన పోలీసులు.. ఊపిరి పీల్చుకుని, వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం ఈ లవ్ స్టోరీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story