US Air Show Jet Crash: ఆకాశంలో ఢీకొన్న రెండు యుద్ధ విమానాలు.. ఎయిర్ షోలో భయానక దృశ్యాలు!
US Air Show Jet Crash: అమెరికా ఐడహోలో నిర్వహించిన గన్‌ఫైటర్ స్కైస్ ఎయిర్ షోలో ఘోర ప్రమాదం జరిగింది. ఆకాశంలో రెండు ఈఏ-18జీ ఫైటర్‌జెట్‌లు ఒకదానికొకటి ఢీకొని కుప్పకూలాయి.
US Air Show Jet Crash: ఆకాశంలో ఢీకొన్న రెండు యుద్ధ విమానాలు.. ఎయిర్ షోలో భయానక దృశ్యాలు!
US Air Show Jet Crash: అమెరికాలో నిర్వహించిన ఓ ఎయిర్ షోలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. యుద్ధ విన్యాసాలు చేస్తుండగా రెండు ఫైటర్‌జెట్‌లు ఆకాశంలోనే ఒకదానికొకటి అత్యంత వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాద తీవ్రతకు రెండు విమానాలు క్షణాల్లో కుప్పకూలిపోయాయి. దీంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడటమే కాకుండా, దట్టమైన పొగ అలుముకుంది. ఐడహో రాష్ట్రంలో జరిగిన 'గన్‌ఫైటర్ స్కైస్ ఎయిర్ షో' (Gunfighter Skies Air Show) లో ఈ షాకింగ్ ఘటన జరిగింది.
ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ ఎయిర్‌బేస్‌ను పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ చేశారు. రెస్కూ టీమ్స్, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎయిర్ బేస్‌కు కేవలం రెండు మైళ్ల దూరంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ధృవీకరించారు.
ఈ పెను ప్రమాదం నుంచి నలుగురు పైలట్‌లు అద్భుత రీతిలో ప్రాణాలతో బయటపడ్డారు. విమానాలు ఢీకొన్న మరుక్షణమే పైలట్లు సమయస్ఫూర్తితో వ్యవహరించి, పారాచూట్ సాయంతో సురక్షితంగా ఎజెక్ట్ అయ్యారు. ప్రస్తుతం వారికి ప్రాణాపాయం తప్పిందని అధికారులు వెల్లడించారు. కుప్పకూలిన యుద్ధవిమానాలను అత్యంత అధునాతన 'ఈఏ-18జీ' (EA-18G) రకానికి చెందినవిగా గుర్తించారు.
దాదాపు ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇక్కడ తొలిసారిగా ఎయిర్‌షో నిర్వహించడంతో, దీనిని వీక్షించేందుకు వేలాదిమంది ప్రజలు తరలివచ్చారు. కళ్లముందే యుద్ధ విమానాలు ఢీకొనడంతో ప్రేక్షకులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. ఈ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలపై ఉన్నతాధికారులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు.




