US Iran Ceasefire Extension: కాల్పుల విరమణ పొడిగింపు ఆలోచనలో అమెరికా... రెండో విడత చర్చలపై సందిగ్దత
US Iran Ceasefire Extension: ప్రపంచ దేశాలకు ఊరటనిచ్చే అంశం ఒకటి బయటకు వచ్చింది. అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల్లో ఒక కీలక మలుపు కనిపిస్తోంది.
US Iran Ceasefire Extension: కాల్పుల విరమణ పొడిగింపు ఆలోచనలో అమెరికా... రెండో విడత చర్చలపై సందిగ్దత
US Iran Ceasefire Extension: ప్రపంచ దేశాలకు ఊరటనిచ్చే అంశం ఒకటి బయటకు వచ్చింది. అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల్లో ఒక కీలక మలుపు కనిపిస్తోంది. యుద్ధ వాతావరణాన్ని తగ్గించేందుకు ఇటీవల కుదిరిన 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరింత పొడిగించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుత గడువు ఏప్రిల్ 22తో ముగియనుండగా, అంతకుముందే మరోసారి చర్చల ద్వారా పరిష్కారం కనుగొనే యత్నం జరుగుతోంది. ఈ ప్రయత్నాలు ఫలిస్తే పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం కొంతమేర తగ్గే అవకాశం ఉంటుంది.
యుద్ధం ముంగిట శాంతి ప్రయత్నాలు
గత వారం అమెరికా, ఇరాన్‌ల మధ్య కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం ఈ నెల ఏప్రిల్ 22న ముగియనుంది. ఈ గడువు ముగియక ముందే, శాంతిని పునరుద్ధరించేందుకు మధ్యవర్తులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా అణు కార్యక్రమం, హర్మూజ్ జలసంధి వివాదం, యుద్ధ నష్టపరిహారం వంటి 3 ప్రధాన అంశాలపై ప్రతిష్టంభన నెలకొన్నప్పటికీ, చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు ఇరు దేశాలు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. అయితే, తొలి ఒప్పంద చర్చలు ఆశాజనకంగా సాగకపోవడంతో కాల్పుల విరమణ ఒప్పందంపై అనిశ్చితి నెలకొన్న సంగతి తెలిసిందే. అమెరికా ఇరాన్ పోర్టులను దిగ్బంధనం చేసేందుకు ప్రయత్నంచడం, ఇరాన్ కూడా వెనక్కి తగ్గకపోవడంతో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం ప్రమాదంలో పడిపోయిందని విశ్లేషకులు భావించారు.
పాకిస్తాన్‌లో చర్చలు? ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
గురువారం రోజు అంటే ఏప్రిల్ 16న రెండో విడత చర్చలు జరగనున్నాయని ఇప్పటికే సూచనామాత్రంగా పేర్కొన్నారు. కానీ, ఎక్కడ జరగనున్నాయి అనే అంశంపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. అయితే, దీనిపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారాయి. వచ్చే రెండు రోజుల్లో ఇరాన్‌తో నేరుగా చర్చలు జరపనున్నట్లు పేర్కొన్నారు. ఈ చర్చలు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికయ్యే అవకాశం ఉందని సంకేతాలిచ్చారు. పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఈ విషయంలో చొరవ చూపించి అద్భుతంగా పనిచేస్తున్నారని, తాము పాకిస్తాన్‌కు వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నామని ఓ అంతర్జాతీయ మీడియాతో చెప్పారు. రెండో విడత చర్చలు యూరప్ దేశాల్లో చర్చలు జరిగే అవకాశం ఉన్నప్పటికీ పాకిస్తాన్ వైపే ట్రంప్ మొగ్గు చూపుతున్నారు. కానీ, ఈ శాంతి చర్చలను పాకిస్తాన్‌లో అంటే అమెరికా మిత్రపక్షం ఇజ్రాయిల్ సుముఖంగా లేదని ఇప్పటికే స్పష్టమైంది. ఉగ్రవాదానికి ఊతం ఇస్తున్న దేశంలో శాంతి చర్చలు సఫలమౌతాయని తాము భావించడం లేదని ఇప్పటికే స్పష్టం చేసింది.
అడ్డంకులు ఏంటి?
శాంతి చర్చలు జరుగుతున్నా అవి చాలా నెమ్మదిగా సాగుతున్నాయని ట్రంప్ చెప్పుకొచ్చారు. చర్చలు నెమ్మదిగా సాగడం వలన పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి మరింత తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయి. అమెరికా హెచ్చరికలు, ఇరాన్ తీవ్ర ప్రతిస్పందనలతో శాంతి చర్చలు ఎంతవరకు సఫలమవుతాయన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి. వీలైనంత త్వరగా వేగంగా శాంతి చర్చలు ముగించాలని, శాంతిని నెలకొల్పాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి.
ఒకవేళ ఏప్రిల్ 22 లోపు గడువు పొడిగింపు జరగకపోతే, పశ్చిమాసియాలో భారీ యుద్ధం తప్పదనే భయాలు ఉన్నాయి. ఈ చర్చల్లో మధ్యవర్తిగా పాకిస్తాన్ పోషిస్తున్న పాత్ర ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన అంశం. అందరికీ అర్ధమయ్యే భాషలో చెప్పాలంటే ఇది పేలడానికి సిద్ధంగా ఉన్న బాంబుకు తాత్కాలికంగా 'పిన్' పెట్టే ప్రయత్నం లాంటిది మాత్రమే.




