US On-Orbit Weapon : అమెరికా మరో సంచలనం... అంతరిక్షంలోనూ యుద్దానికి సై... ఆన్‌ ఆర్బిట్‌ వెపన్‌ రెడీ

అంతరిక్షంలో తొలిసారిగా ఆన్‌-ఆర్బిట్‌ ఆయుధాలను మోహరించినట్లు అమెరికా ప్రకటించింది. రష్యా, చైనాల నుంచి పెరుగుతున్న అంతరిక్ష ముప్పుల నేపథ్యంలో ఈ ప్రకటన కీలకంగా మారింది.

Balachander
Published on: 15 Sept 2026 12:17 PM IST
US On-Orbit Weapon : అమెరికా మరో సంచలనం... అంతరిక్షంలోనూ యుద్దానికి సై... ఆన్‌ ఆర్బిట్‌ వెపన్‌ రెడీ
X

US On-Orbit Weapon : అంతరిక్షం అంటే ఇప్పటివరకు ఉపగ్రహాలు, పరిశోధనలు, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు, అంతరిక్ష కేంద్రాలే గుర్తుకొచ్చేవి. కానీ ఇప్పుడు అదే స్పేస్‌ డొమైన్‌ ప్రపంచ సైనిక వ్యూహాల్లో కీలక రంగంగా మారుతోంది. అమెరికా తొలిసారిగా అంతరిక్ష కక్ష్యలో ‘ఆన్‌-ఆర్బిట్‌ స్పేస్‌ కంట్రోల్‌ వెపన్స్‌’ మోహరించినట్లు అధికారికంగా వెల్లడించింది. ఈ ప్రకటనతో రష్యా, చైనాతో అమెరికా మధ్య అంతరిక్ష ఆధిపత్య పోటీ మరో స్థాయికి చేరినట్లు స్పష్టమవుతోంది. అమెరికా స్పేస్‌ ఫోర్స్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, అమెరికా వద్ద కక్ష్యలోనే పనిచేసే స్పేస్‌ కంట్రోల్‌ ఆయుధ సామర్థ్యాలు ఉన్నాయి. శత్రు దేశాల నుంచి వచ్చే చర్యలను ఎదుర్కొంటూ అమెరికా సైనిక బలగాలను రక్షించడానికి ఈ సామర్థ్యాలు అవసరమని అమెరికా ఎయిర్‌ఫోర్స్‌ కార్యదర్శి ట్రాయ్‌ మీంక్‌ తెలిపారు. అయితే ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం ఉంది. అమెరికా అంతరిక్షంలో ఏ రకమైన ఆయుధాన్ని మోహరించిందో మాత్రం వెల్లడించలేదు. ఆయుధం పేరు, సంఖ్య, దాని ఖచ్చితమైన సామర్థ్యాలు వంటి వివరాలను అధికారులు బయటపెట్టలేదు. ‘స్పేస్‌ కంట్రోల్‌’ కోసం ఈ సామర్థ్యాలను ఉపయోగించవచ్చని మాత్రమే స్పష్టం చేశారు.

‘స్పేస్‌ కంట్రోల్‌’ అంటే ఏమిటి?

సాధారణంగా చెప్పాలంటే, అంతరిక్షంలో తమ ప్రయోజనాలను కాపాడుకోవడం, ప్రత్యర్థి దేశాల అంతరిక్ష సామర్థ్యాలను అడ్డుకోవడం లేదా వాటి ప్రభావాన్ని తగ్గించడం వంటి చర్యలను ‘స్పేస్‌ కంట్రోల్‌’ పరిధిలోకి తీసుకువస్తారు. అమెరికా స్పేస్‌ ఫోర్స్‌ ప్రకారం, ఇందుకోసం కైనెటిక్‌, నాన్‌-కైనెటిక్‌ మార్గాలను ఉపయోగించే సామర్థ్యాలు అభివృద్ధి చేస్తున్నారు. అంటే ప్రతి చర్యకు నేరుగా పేలుడు లేదా భౌతిక దాడి అవసరం ఉండకపోవచ్చు. ప్రత్యర్థి ఉపగ్రహాలు లేదా అంతరిక్ష వ్యవస్థల పనితీరును ప్రభావితం చేసే ఇతర మార్గాలు కూడా ఇందులో ఉండొచ్చు. ఈ సామర్థ్యాలను అవసరాన్ని బట్టి రక్షణాత్మకంగానే కాకుండా దాడి చర్యల్లోనూ ఉపయోగించే అవకాశం ఉందని అమెరికా ప్రకటన స్పష్టం చేసింది.

ట్రంప్‌ ‘గోల్డెన్‌ డోమ్‌’కు లింక్‌ ఉందా?

ఈ ప్రకటన వెలువడిన సమయం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం ‘గోల్డెన్‌ డోమ్‌’ పేరుతో భారీ క్షిపణి రక్షణ వ్యవస్థను నిర్మించే దిశగా చర్యలు వేగవంతం చేస్తోంది. అమెరికాను క్షిపణులు, ఇతర గగనతల ముప్పుల నుంచి రక్షించడమే ఈ వ్యవస్థ లక్ష్యం. ఈ నేపథ్యంలో అంతరిక్ష ఆధారిత సామర్థ్యాలను పెంచుకోవడం అమెరికా రక్షణ వ్యూహంలో కీలక భాగంగా కనిపిస్తోంది. భవిష్యత్తులో యుద్ధం భూమి, సముద్రం, గగనతలంతో మాత్రమే పరిమితం కాకుండా అంతరిక్షంలోనూ ప్రభావం చూపించే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఈ పరిణామం సూచిస్తోంది.

అంతరిక్ష ఆయుధాల కథ ఇప్పటిది కాదు

అంతరిక్ష సైనికీకరణ కొత్త విషయం కాదు. 1957లో సోవియట్‌ యూనియన్‌ ‘స్పుట్నిక్‌’ను కక్ష్యలోకి ప్రవేశపెట్టినప్పటి నుంచే అమెరికా, సోవియట్‌ యూనియన్‌ మధ్య అంతరిక్ష ఆధిపత్య పోటీ మొదలైంది. ఉపగ్రహాలను రక్షించడం మాత్రమే కాకుండా, అవసరమైతే ప్రత్యర్థి ఉపగ్రహాలను ఎలా నిర్వీర్యం చేయాలనే అంశంపైనా రెండు దేశాలు దృష్టి పెట్టాయి. దీంతో అంతరిక్షంలో అణ్వాయుధాల మోహరింపు ప్రపంచానికి పెద్ద ఆందోళనగా మారింది. ఈ నేపథ్యంలో 1967లో ‘ఔటర్‌ స్పేస్‌ ట్రీటీ’ అమల్లోకి వచ్చింది. కక్ష్యలో సామూహిక విధ్వంసక ఆయుధాలను మోహరించడాన్ని ఈ ఒప్పందం నిషేధించింది. అయితే ఉపగ్రహాలను లక్ష్యంగా చేసుకునే సైనిక సామర్థ్యాల విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. అమెరికా, రష్యా, చైనా, భారత్‌ వంటి దేశాలు ఉపగ్రహ కమ్యూనికేషన్లు, నిఘా, నావిగేషన్‌ వంటి కీలక వ్యవస్థలను రక్షించడంతో పాటు ప్రత్యర్థి సామర్థ్యాలను ఎదుర్కొనే మార్గాలపై కూడా పనిచేస్తున్నాయి.

అమెరికా చూపు రష్యా, చైనాపైనే

అమెరికా ప్రకటనలో రష్యా, చైనా పేర్లు ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినా, అంతరిక్ష భద్రతలో ఈ రెండు దేశాల సామర్థ్యాలను ప్రధాన ముప్పుగా చూస్తోంది. చైనా తన సైనిక ఆధునీకరణలో భాగంగా అంతరిక్ష, ‘కౌంటర్‌-స్పేస్‌’ సామర్థ్యాలను అభివృద్ధి చేస్తోందని అమెరికా చెబుతోంది. అదే సమయంలో రష్యా కూడా అంతరిక్షాన్ని భవిష్యత్తు యుద్ధాల్లో కీలక రంగంగా చూస్తోందని అమెరికా స్పేస్‌ ఫోర్స్‌ పేర్కొంది. భవిష్యత్తు ఘర్షణల్లో అంతరిక్ష ఆధిపత్యం నిర్ణయాత్మక పాత్ర పోషించవచ్చన్న అంచనాలు ఈ పోటీకి మరింత ప్రాధాన్యం తెస్తున్నాయి.

మొత్తంగా చూస్తే, అమెరికా ‘ఆన్‌-ఆర్బిట్‌ వెపన్‌’పై చేసిన ప్రకటన ఒక ఆయుధం మోహరింపు వార్తకే పరిమితం కాదు. అంతరిక్షం కూడా భవిష్యత్తు భద్రతా పోరాటంలో కీలక యుద్ధరంగంగా మారుతోందన్న సంకేతం. అయితే అమెరికా వద్ద ఉన్న ఆయుధం అసలు ఏమిటి, దాని సామర్థ్యం ఎంత, ఎక్కడ మోహరించారు అనే కీలక వివరాలు ఇంకా రహస్యంగానే ఉన్నాయి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.