US Deportation : అక్రమ వలసదారులపై ట్రంప్ ఉక్కుపాదం.. వేల సంఖ్యలో తిరిగొస్తున్న భారతీయులు
US Deportation : అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను యుఎస్ ప్రభుత్వం వేగంగా డిపోర్ట్ చేస్తోంది. 2025 నుండి ఇప్పటి వరకు మొత్తం 4,840 మంది భారతీయులను వెనక్కి పంపినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.
US Deportation
US Deportation : అమెరికాలో ఎలాంటి పత్రాలు లేకుండా అక్రమంగా నివసిస్తున్న భారతీయ పౌరులను యుఎస్ ప్రభుత్వం వరుసగా స్వదేశానికి పంపిస్తోంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2025 నుంచి ఇప్పటి వరకు మొత్తం 4,840 మంది భారతీయ పౌరులను అమెరికా ప్రభుత్వం డిపోర్ట్ చేసింది. ఇందులో భాగంగా 2025 సంవత్సరంలో మొత్తం 3,567 మంది భారతీయులు వెనక్కి రాగా, 2026 జనవరి 1 నుంచి జూలై వరకు కేవలం ఏడు నెలల వ్యవధిలోనే ఏకంగా 1,273 మందిని అమెరికా భారత్‌కు పంపించేసింది. రణధీర్ జైస్వాల్ విలేకరుల సమావేశంలో మాట్లాడేటప్పుడు ఈ కీలక గణాంకాలను అధికారికంగా ధృవీకరించారు.
విదేశాల నుంచి తమ దేశ పౌరులను వెనక్కి పంపించే క్రమంలో విదేశాంగ శాఖ ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఇతర దేశాల ప్రభుత్వాలతో కలిసి భారతదేశం నిరంతరం పనిచేస్తోందని రణధీర్ జైస్వాల్ వివరించారు. ఎవరైనా వ్యక్తి అక్రమంగా నివసిస్తూ పట్టుబడినప్పుడు, ఆ వ్యక్తి నిజంగా భారతీయ పౌరుడో కాదో ముందుగా స్వయంగా దర్యాప్తు చేసి నిర్ధారించుకుంటామని ఆయన తెలిపారు. సంబంధిత వ్యక్తి భారత పౌరుడేనని సంపూర్ణంగా సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే అతన్ని తిరిగి భారతదేశానికి తీసుకురావడానికి కావలసిన ప్రయాణ పత్రాలు, ఇతర ఏర్పాట్లను కేంద్ర ప్రభుత్వం చేపడుతోంది. ప్రస్తుతం ట్రంప్ పరిపాలనలో అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటుండటంతో ఈ ప్రక్రియ మరింత వేగవంతమైంది.
అమెరికా నుంచి వెనక్కి పంపబడుతున్న భారతీయుల పట్ల అమెరికా అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గతంలో డిపోర్టేషన్ ఫ్లైట్లలో మహిళలు, పిల్లలకు కూడా సంకెళ్లు వేయడం, జంజిర్లతో బంధించడం వంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. 2025లో 73 సంవత్సరాల హర్జీత్ కౌర్ అనే వృద్ధురాలి పట్ల దారుణంగా ప్రవర్తించడం, విమానంలో మహిళలను బంధించడంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. దీనిపై విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. అమెరికా అధికారులతో మాట్లాడామని, వెనక్కి పంపే పౌరులతో గౌరవప్రదంగా ప్రవర్తించాలని, ముఖ్యంగా మహిళలు, పిల్లలకు సంకెళ్లు వేయకూడదని ఖచ్చితమైన విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.




