
US vs Iran
US vs Iran : టెహ్రాన్‌లోని ఐఆర్‌జీసీ అండర్ గ్రౌండ్ హెడ్ క్వార్టర్స్‌పై అమెరికా బి-2 బాంబర్లతో విరుచుకుపడింది. బంకర్-బస్టర్ బాంబుల దాడిలో పలువురు ఇరాన్ కమాండర్లు మరణించినట్లు సమాచారం.
US vs Iran : అగ్రరాజ్యం అమెరికా తన మాటను చేతల్లో చూపించింది. ఇరాన్‌ను ఒక్క రాత్రిలో నామరూపాలు లేకుండా చేస్తామన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు చేసిన కొన్ని గంటల్లోనే అమెరికా వైమానిక దళం భీకర దాడులకు తెగబడింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఐఆర్‌జీసీ (IRGC) అండర్ గ్రౌండ్ హెడ్ క్వార్టర్స్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికా బి-2 బాంబర్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో అత్యంత శక్తివంతమైన బంకర్-బస్టర్ బాంబులను ఉపయోగించినట్లు తెలుస్తోంది.
అమెరికా భీకర వ్యూహం
అమెరికా సెంట్రల్ కమాండ్ చీఫ్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ ఆదేశాల మేరకు ఈ ఆపరేషన్ జరిగింది. అమెరికాలోని వైట్ మ్యాన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి బయలుదేరిన బి-2 బాంబర్ విమానాలు సుమారు 36 గంటల పాటు నిరంతరాయంగా ప్రయాణించి ఇరాన్ సరిహద్దుల్లోకి ప్రవేశించాయి. ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేయడానికి వాడే అత్యంత భారీ బంకర్-బస్టర్ బాంబులను నేరుగా ఐఆర్‌జీసీ సీనియర్ కమాండర్లు సమావేశమైన రహస్య అండర్ గ్రౌండ్ బంకర్లపై జారవిడిచారు. ఈ దాడిలో ఆ స్థావరం పూర్తిగా నేలమట్టమైందని అమెరికా అధికారులు ధృవీకరించారు.
కాపాడటానికి వచ్చిన వారిపై కూడా దాడి
అమెరికా ఈసారి డబుల్ స్ట్రైక్ వ్యూహాన్ని అమలు చేసింది. మొదట బాంబు దాడులు జరిగిన తర్వాత, శిథిలాల కింద ఉన్నవారిని కాపాడటానికి మెడికల్ టీమ్స్, రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. సరిగ్గా అదే సమయంలో అమెరికా రెండోసారి వైమానిక దాడులు చేసింది. దీనివల్ల ఐఆర్‌జీసీ కమాండర్లతో పాటు సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బంది కూడా పెద్ద సంఖ్యలో మరణించి ఉంటారని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ తరహా దాడులు యుద్ధ నీతికి విరుద్ధమని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ట్రంప్ హెచ్చరిక.. గంటల్లోనే విధ్వంసం
వైట్ హౌస్ వేదికగా డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు గడువు విధించిన కొద్దిసేపటికే ఈ దాడులు జరగడం గమనార్హం. బుధవారం లోగా హోర్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్ విద్యుత్, నీరు, గ్యాస్ వంటి పౌర సదుపాయాలను కూడా టార్గెట్ చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. అటు అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్‌సెత్ మాట్లాడుతూ.. ఇరాన్‌పై దాడులు కొనసాగుతున్నాయని, రేపటి నాటికి ఇవి మరింత భయంకరంగా మారతాయని స్పష్టం చేశారు. దీంతో పశ్చిమ ఆసియాలో యుద్ధం మరో స్థాయికి చేరుకుంది.
మానవ హారాలతో ప్రతిఘటనకు ఇరాన్ పిలుపు
అమెరికా దాడుల నుంచి తమ దేశ మౌలిక సదుపాయాలను కాపాడుకోవడానికి ఇరాన్ ప్రభుత్వం వినూత్న నిరసనకు పిలుపునిచ్చింది. ఇరాన్ యువజన క్రీడల శాఖ ఉప మంత్రి అలీరెజా రహీమీ మాట్లాడుతూ.. దేశంలోని పవర్ ప్లాంట్లు, ఇతర ముఖ్యమైన కట్టడాల చుట్టూ ప్రజలు, కళాకారులు, క్రీడాకారులు చేతులు పట్టుకుని మానవ హారాలుగా ఏర్పడాలని కోరారు. పౌర సదుపాయాలపై దాడులు చేయడం యుద్ధ నేరమని, తాము ప్రాణాలకు తెగించి తమ దేశాన్ని రక్షించుకుంటామని ఆయన ఉద్వేగభరితంగా ప్రసంగించారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire


