US sanctions relief Russian oil: రష్యాపై ఉదాసీనత...చమురుపై ఆంక్షలు సడలింపు

US sanctions relief Russian oil: ప్రపంచ ఇంధన మార్కెట్‌లో కీలక మార్పులకు దారితీసే నిర్ణయం తీసుకుంది అమెరికా. రష్యా చమురు కొనుగోళ్లపై విధించిన ఆంక్షలకు తాత్కాలిక సడలింపును మరోసారి పొడిగించింది.

Balachander
Updated on: 18 April 2026 10:30 AM IST
US sanctions relief Russian oil
X

US sanctions relief Russian oil

US sanctions relief Russian oil: ప్రపంచ ఇంధన మార్కెట్‌లో కీలక మార్పులకు దారితీసే నిర్ణయం తీసుకుంది అమెరికా. రష్యా చమురు కొనుగోళ్లపై విధించిన ఆంక్షలకు తాత్కాలిక సడలింపును మరోసారి పొడిగించింది. ఈ నిర్ణయం వల్ల గ్లోబల్ మార్కెట్‌లో సరఫరా కొంతవరకు స్థిరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అగ్రరాజ్యం వెనకడుగు.. అసలు కారణం ఇదే!

రష్యా ఉక్రెయిన్‌ యుద్ధం మొదలయ్యి ఇప్పటికే నాలుగు ఏళ్లుదాటింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి మాస్కో ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని అమెరికా తీవ్రంగా ప్రయత్నించింది. ఇందులో భాగంగానే చమురుపై ఆంక్షలు విధించింది. రెండు మూడు రోజుల క్రితం వరకు చమురు ఆంక్షలపై సడలింపు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. కానీ, ఇప్పుడు సడెన్‌గా యూటర్న్‌ తీసుకొని తన నిర్ణయాన్ని మార్చుకున్నది. హోర్ముజ్‌ జలసంధి పూర్తిగా వాణిజ్యానికి అనుకూలంగా ఓపెన్‌ చేసినప్పటికీ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కారణంగా రష్యా చమురుపై ఆంక్షల సడలింపును పొడిగించి ఉంటారని నిపుణులు చెబుతున్నారు.

కీలక ఉత్తర్వుల్లో ఏముంది?

అమెరికా ఆర్థిక శాఖ విడుదల చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం కొన్ని నిబంధనలు ఇలా ఉన్నాయి. ఈ ఆంక్షల సడలింపు మే 16 వరకు అమలులో ఉంటుంది. అయితే, సడలింపు ఉన్నప్పటికీ... ఇప్పటికిప్పుడు నౌకల్లో చమురును లోడ్‌ చేసేందుకు అవకాశం ఉండదు. ఏప్రిల్‌ 17 లేదా అంతకంటే ముందే నౌకల్లో లోడ్‌ చేసిన చమురును మాత్రమే కొనుగోలు చేసేందుకు అనుమతి ఇస్తున్నట్టు అమెరికా ఆర్థికశాఖ పేర్కొంది. అయితే, ఈ సడలింపు కేవలం రష్యా చమురు సంస్థలకు మాత్రమే ఉండటం విశేషం. ఇరాన్‌, ఉత్తరకొరియా, క్యూబా దేశాలకు చెందిన వ్యక్తులు లేదా సంస్థలతో ఎటువంటి లావాదేవీలు జరపడానికి వీల్లేదని స్పష్టం చేసింది.

మార్కెట్‌పై ప్రభావం

ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వల్ల చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. ఇలాంటి సమయంలో దాదాపు 140 మిలియన్ బ్యారెళ్ల రష్యా చమురు మార్కెట్లోకి రావడం వల్ల ధరలు కొంత మేర అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉన్న సమయంలో చమురు ధరలు పెరగకుండా చూడటం అమెరికాకు అనివార్యంగా మారింది. ప్రపంచంలో చమురు సంక్షోభం ఏర్పడితే దానికి కారణం అమెరికానే అనే భావన ప్రపంచదేశాల్లో పెరుగుతుంది. తద్వారా అమెరికా ఆధిపత్యానికి, డాలర్‌కు గండం ఏర్పడుతుంది. అందుకే శత్రు దేశమైన రష్యా విషయంలో కొంత 'ఉదాసీనత' ప్రదర్శిస్తూ ఈ వెసులుబాటు కల్పించింది. ఈ నిర్ణయం వల్ల భారత్ వంటి దేశాలకు కూడా రష్యా నుంచి తక్కువ ధరకు చమురు పొందే మార్గం సుగమం కానుంది. క్లుప్తంగా చెప్పాలంటే... అంతర్జాతీయ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు.. కేవలం ప్రయోజనాలు మాత్రమే ఉంటాయని ఈ చమురు రాజకీయం మరోసారి నిరూపించింది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story