Helicopter Crash: మంటలను ఆర్పుతుండగా కూలిన హెలికాప్టర్.. ఇద్దరు పైలట్లు మృతి
Helicopter Crash: అమెరికాలోని ప్రసిద్ధ యోసెమినే నేషనల్ పార్క్ ప్రాంతంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
wildfire
Helicopter Crash: అమెరికాలోని ప్రసిద్ధ యోసెమినే నేషనల్ పార్క్ ప్రాంతంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అడవుల్లో చెలరేగిన భారీ కార్చిచ్చును అదుపు చేయడానికి, హెలికాప్టర్ ద్వారా నీటిని కురిపిస్తున్న సమయంలో ఒక ఫైర్‌ఫైటింగ్ హెలికాప్టర్ అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లో ఉన్న ఇద్దరు పైలట్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రెసిషన్ అనే కాంట్రాక్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ కంపెనీకి చెందిన ఈ హెలికాప్టర్, వావోనా ప్రాంతంలో విస్తరిస్తున్న డోమ్ ఫైర్ మంటలను ఆర్పుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది.
మృతులలో ఒకరిగా గ్రెగ్ కింగ్ గుర్తింపు
ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు పైలట్లలో ఒకరిని గ్రెగ్ కింగ్ గా గుర్తించినట్లు నేషనల్ ఇంటర్‌ఏజెన్సీ ఫైర్ సెంటర్ అధికారులు వెల్లడించారు. ప్రెసిషన్ కంపెనీలో చేరడానికి ముందు గ్రెగ్ కింగ్.. అలాస్కా ఫారెస్ట్రీ అండ్ ఫైర్ ప్రొటెక్షన్ డివిజన్‌లో పనిచేశారు. ఆ రాష్ట్రంలో అనేక అడవి మంటలను విజయవంతంగా ఆర్పి గొప్ప పేరు సంపాదించారు. కింగ్ కుటుంబ సభ్యులు కూడా అదే ఏజెన్సీలో పనిచేస్తుండటం గమనార్హం. మరో పైలట్ ఎవరనే దానిపై ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు సంయుక్తంగా దర్యాప్తు జరుపుతున్నారు.
భారీగా పెరుగుతున్న అడవి మంటలు
ఈ ఏడాది అమెరికాలో అడవి మంటలను ఆర్పుతున్న సమయంలో ప్రాణాలు కోల్పోతున్న ఫైర్‌ఫైటర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రభుత్వ నివేదికల ప్రకారం, ఈ ఒక్క సంవత్సరంలోనే మంటలను ఆర్పే ప్రయత్నంలో దాదాపు 14 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. గతంలో 2022లో 25 మంది మృతి చెందగా, ఈ ఏడాది కూడా పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ముఖ్యంగా ఆగస్టు నెలలో యూటా, కొలరాడో రాష్ట్రాల్లోనూ ఇలాంటి ప్రమాదాలే జరగడం అడవి మంటలను ఆర్పుతున్న సిబ్బందికి పెద్ద సవాలుగా మారుతోంది. ఈ ప్రమాదాలపై అలాస్కా ఫారెస్ట్ ఏజెన్సీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు ప్రగాష్ట సానుభూతి తెలిపింది.
580 మంది సిబ్బందితో కొనసాగుతున్న డోమ్ ఫైర్ పోరాటం
సెప్టెంబర్ 15న కాలిఫోర్నియాలోని వావోనా సమీపంలో ప్రారంభమైన డోమ్ ఫైర్ ప్రస్తుతం సుమారు 4.7 చదరపు మైళ్ల విస్తీర్ణంలో వ్యాపించింది. ఈ భీకర మంటలను అదుపు చేయడానికి ప్రస్తుతం సుమారు 580 మందికి పైగా ఫైర్‌ఫైటింగ్ సిబ్బంది శ్రమిస్తున్నారు. ఇప్పటివరకు కేవలం 15 శాతం మంటలను మాత్రమే అదుపులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆస్ట్రాండర్ సరస్సు సమీపంలో జరిగిన ఈ హెలికాప్టర్ క్రాష్ సంఘటనతో అడవి మంటలను ఆర్పుతున్న కమ్యూనిటీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. సాహసోపేతంగా ప్రజల ప్రాణాలను, అడవులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న ఇలాంటి రియల్ హీరోల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివి.




