US-Iran Deal: ఇరాన్‌కు 300 బిలియన్‌ డాలర్లు... రూపాయి ఇవ్వకుండానే యూఎస్‌ డీల్‌

ఇరాన్‌కు అమెరికా తన జేబులోనుంచి ఒక్క రూపాయి ఇవ్వకుండానే 300 బిలియన్‌ డాలర్ల నిధిని ఏర్పాటు చేసింది. ఎలానో విశ్లేషిద్దాం.

Balachander
Updated on: 17 Jun 2026 1:03 PM IST
US-Iran Deal: ఇరాన్‌కు 300 బిలియన్‌ డాలర్లు... రూపాయి ఇవ్వకుండానే యూఎస్‌ డీల్‌
X

US-Iran Deal: అంతర్జాతీయ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా ఒక వార్త తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందంలో భాగంగా, ఇరాన్ పునర్నిర్మాణం కోసం అమెరికా ప్రభుత్వం ఏకంగా 300 బిలియన్ డాలర్లు అంటే సుమారు 25 లక్షల కోట్లు నిధులు ఇస్తోందనేదే ఆ వార్త సారాంశం. అయితే, ఈ ప్రచారంలో అస్సలు నిజం లేదని అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వెన్స్ క్లారిటీ ఇచ్చారు. అమెరికా పన్ను చెల్లింపుదారుల సొమ్మును లేదా ప్రభుత్వ గ్రాంట్లను ఇరాన్‌కు ఉచితంగా ఇవ్వడం లేదని ఆయన స్పష్టం చేశారు. మరి ఆ 300 బిలియన్ల కథేంటి? దాని వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? తెలుసుకుందాం.

సహాయ నిధి కాదు.. ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్!

ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ 'రాయిటర్స్' నివేదిక ప్రకారం, ఇరాన్ ఒక 'పునర్నిర్మాణ నిధి' ద్వారా ఈ భారీ మొత్తాన్ని పొందనుందనే మాట నిజమే. కానీ, ఆ డబ్బు అమెరికా ప్రభుత్వం ఇచ్చేది కాదు. అమెరికా ఈ నిధిని ఇరాన్‌కి ఇచ్చే విషయంలో కొన్ని నిబంధనలు విధించింది. ఇరాన్‌ గనుక అమెరికా విధించిన శాంతి నిబంధనలకు కట్టబడి, దూకుడును తగ్గించుకొని, ప్రవర్తనను మార్చుకుంటే... ఇరాన్‌పై ఉన్న కొన్ని కఠినమైన ఆంక్షలను తొలగిస్తుంది. అంతేకాదు, ఈ ఆంక్షలు తొలగిన తర్వాత, ప్రపంచంలోని ఇతర ధనిక దేశాలు ఉదాహరణకు యూఏఈ వంటి గల్ఫ్ దేశాలు, ఆసియా, ఆఫ్రికా దేశాలు ఇరాన్‌లో పెట్టుబడులు పెట్టడానికి అమెరికా అనుమతిస్తుంది. ఉదాహరణకు, యూఏఈ వెళ్లి ఇరాన్‌లో ఒక అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మించాలనుకుంటే, ఇప్పటివరకు ఉన్న ఆంక్షల వల్ల అది సాధ్యం కాలేదు. ఇప్పుడు ఆంక్షలు సడలిస్తే.. ప్రైవేట్ కంపెనీలు అక్కడ పెట్టుబడులు పెడతాయి. అలా సమకూరే పెట్టుబడుల మొత్తమే ఈ 300 బిలియన్ డాలర్లు. ఇప్పటికే ఇందులో సగానికి పైగా నిధుల ఒప్పందాలు ఖరారైనట్లు సమాచారం.

యుద్ధ నష్టపరిహారానికి అమెరికా నో!

నిజానికి, ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌పై జరిపిన దాడుల వల్ల ఇరాన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తీవ్రంగా దెబ్బతింది. ఈ యుద్ధ నష్టానికి పరిహారంగా తమకు అమెరికా నుండి 400 బిలియన్ డాలర్లు కావాలని ఇరాన్ గట్టిగా పట్టుబట్టింది. కానీ, వాషింగ్టన్ దీనిని ముఖం మీదే తిరస్కరించింది. తాము పైసా కూడా ఇవ్వలేమని, కావాలంటే ఇతర దేశాలు పెట్టుబడులు పెట్టుకునేలా గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్‌లో మార్పులు చేస్తామని ఆఫర్ ఇచ్చింది. ఈ వ్యూహమే ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ముగించడానికి, 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' చమురు రవాణా మార్గాన్ని తిరిగి తెరవడానికి కారణమైంది. ఏదైనా సరే ఫండింగ్‌ రూపంలో దేశాభివృద్ధికి, దేశాన్ని పునర్నిర్మించుకునేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా, ఇప్పటి వరకు బలహీనపడిన ఇరాన్‌ కరెన్సీ కూడా బలపడే అవకాశం ఉంటుంది.

60 రోజుల గడువు ... ఇరాన్‌కు అద్భుత అవకాశం

ప్రపంచంలోనే రెండొవ అతిపెద్ద సహజ వాయువు నిల్వలు, నాలుగొవ అతిపెద్ద చమురు నిల్వలు ఉన్న దేశం ఇరాన్. అంతేకాదు, ఆ దేశంలో 9.2 కోట్ల యువ జనాభా ఉంది. గత 40 ఏళ్లుగా అమెరికా ఆంక్షల వల్ల ఇరాన్ ఆర్థికంగా కుంగిపోయింది. ప్రాథమిక ఒప్పందం ప్రకారం, రాబోయే 60 రోజుల్లో తుది ఒప్పందంపై సంతకాలు జరగాలి. ఈ ఒప్పందంపై సంతకాలు జరిగే వరకు ఈ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ అధికారికంగా ప్రారంభం కాదు. ఇరాన్ తన పద్ధతి మార్చుకుంటేనే ఈ 300 బిలియన్ల ప్రైవేట్ పెట్టుబడులు ఆ దేశానికి వస్తాయి, లేదంటే ఆంక్షలు యథాతథంగా కొనసాగుతాయని జేడీ వెన్స్ గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఏదేమైనా, అమెరికా తన జేబు నుండి రూపాయి తీయకుండానే, ఇరాన్‌ను దారికి తెచ్చుకోవడానికి ఇదొక స్మార్ట్ జియోపొలిటికల్ గేమ్ అని చెప్పవచ్చు. కానీ, ఇరాన్‌ మరలా బలపడితే దాని వలన అమెరికాకు ఎప్పటికైనా సరే సమస్యే వస్తుంది. చమురు, గ్యాస్‌ నిల్వలలను విక్రయించి, తద్వారా వచ్చిన డబ్బుతో దేశాన్ని ఆర్థికంగా నిర్మించుకునే అవకాశం లేకపోలేదు. ఆంక్షల ఎత్తివేత, దేశాన్ని పునర్నిర్మించుకోవడమే ఇరాన్‌ ముందున్న లక్ష్యం. దీనికోసం ఆ దేశం ఓ మెట్టుదిగిరావడానికి కూడా సిద్దంగా ఉంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story