US Green Card: గ్రీన్ కార్డ్‌కు కొత్త టెన్షన్.. సెప్టెంబర్ 18 నుంచి రూల్స్ కఠినం.!

US Green Card: US Green Card : అమెరికా పౌరసత్వ , వలసల సేవల సంస్థ (USCIS) గ్రీన్‌ కార్డ్‌ దరఖాస్తుదారులకు సంబంధించి అత్యంత కీలకమైన పబ్లిక్‌ ఛార్జ్‌ (Public Charge) మార్గదర్శకాలపై కీలక ప్రకటన విడుదల చేసింది.

G Krishna
Published on: 17 Sept 2026 4:24 PM IST
US Green Card
X

US Green Card: గ్రీన్ కార్డ్‌కు కొత్త టెన్షన్.. సెప్టెంబర్ 18 నుంచి రూల్స్ కఠినం.!

US Green Card: అమెరికా పౌరసత్వ , వలసల సేవల సంస్థ (USCIS) గ్రీన్‌ కార్డ్‌ దరఖాస్తుదారులకు సంబంధించి అత్యంత కీలకమైన పబ్లిక్‌ ఛార్జ్‌ (Public Charge) మార్గదర్శకాలపై కీలక ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్‌ 18 నుంచి అమల్లోకి రానున్న ఈ నూతన విధానం ద్వారా గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే వారి ఆర్థిక పరిస్థితిని అధికారులు మరింత నిశితంగా పరిశీలించనున్నారు. భవిష్యత్తులో దరఖాస్తుదారులు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం లేదా సంక్షేమ పథకాలపై ఆధారపడే అవకాశం ఉందా లేదా అనే అంశాన్ని ప్రధానంగా అంచనా వేస్తారు. సెప్టెంబర్‌ 18 లేదా ఆ తర్వాత సమర్పించే అన్ని హోదా మార్పు దరఖాస్తులకు (Form I-485) ఈ కొత్త రూల్స్ వర్తిస్తాయి. పాత వెర్షన్ దరఖాస్తు ఫారమ్‌లను అధికారులు ఇకపై అంగీకరించరు.

ఏమి మారబోతోంది?: 2022 నియమాలకు స్వస్తి

ఇప్పటివరకు అమల్లో ఉన్న 2022 నిబంధనల ప్రకారం, కేవలం ప్రభుత్వం నుంచి నగదు రూపంలో పొందే సహాయం , ప్రభుత్వ ఖర్చుతో సుదీర్ఘకాలం సంరక్షణ కేంద్రాల్లో ఉండటాన్ని మాత్రమే ప్రతికూల అంశాలుగా పరిగణించేవారు. అయితే కొత్త మార్గదర్శకాల్లో పరిధిని చాలా విస్తరించారు. ఇకపై ఫుడ్ స్టాంప్స్ (SNAP), మెడికల్ సదుపాయాలు (Medicaid), ఉచిత గృహ వసతి కూపన్లు (Housing Vouchers) వంటి వివిధ రకాల ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఉపయోగించుకోవడం కూడా దరఖాస్తుదారులకు ప్రతికూలంగా మారనుంది.

ఈ నిబంధనలు దరఖాస్తు చేసుకున్న తేదీ ప్రాతిపదికన వర్తిస్తాయి. సెప్టెంబర్‌ 18 లేదా ఆ తర్వాత దరఖాస్తు చేసిన వారికి నూతన విస్తృత నిబంధనలు వర్తిస్తుండగా, డిసెంబర్ 23, 2022 నుండి సెప్టెంబర్ 17 వరకు దాఖలైన దరఖాస్తులకు పాత 2022 నిబంధనలే వర్తిస్తాయి. దరఖాస్తుదారుని వయస్సు, ఆరోగ్య పరిస్థితి, కుటుంబ హోదా, ఆస్తులు , ఆర్థిక వనరులు, విద్య , నైపుణ్యాలు అనే ఐదు ప్రధాన అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే అధికారులు నిర్ణయం తీసుకుంటారు.

ఎవరికి వర్తిస్తుంది.. ఎవరికి మినహాయింపు?

ఈ నూతన నిబంధనలు కుటుంబ-ఆధారిత, ఉద్యోగ-ఆధారిత , డైవర్సిటీ వీసా (లాటరీ) కేటగిరీల ద్వారా గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే వారందరికీ వర్తిస్తాయి. అలాగే మతపరమైన ఉద్యోగులు, 180 రోజుల కంటే ఎక్కువ కాలం విదేశాల్లో గడిపి తిరిగి అమెరికాలోకి ప్రవేశించే శాశ్వత నివాసితులు (LPRs) కూడా ఈ కఠిన పరిశీలనకు గురవుతారు. టెంపరరీ ప్రొటెక్టెడ్ స్టేటస్ (TPS) కలిగి ఉన్నవారు పాయింట్ల ఆధారంగా ఆ హోదా పొందేటప్పుడు మినహాయింపు ఉన్నప్పటికీ, తదుపరి సమయంలో ఫ్యామిలీ పిటిషన్ ద్వారా గ్రీన్ కార్డ్ దరఖాస్తు చేస్తే మాత్రం ఈ నిబంధనలను ఎదుర్కోవాల్సిందే.

మరోవైపు, శరణార్థులు (Refugees and Asylees), మానవ అక్రమ రవాణా , నేరాల బాధితులు (T and U వీసాదారులు), గృహహింస బాధితులు (VAWA), , అమెరికా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఈ నిబంధనల నుంచి పూర్తి మినహాయింపు ఉంది. పిల్లలు తమ సొంత పేరు మీద కాకుండా పొందే ప్రయోజనాలు తల్లిదండ్రుల దరఖాస్తుపై నేరుగా ప్రభావం చూపవు. కేవలం పబ్లిక్ ఛార్జ్ కారణం చేత మాత్రమే దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశమున్న వారికి, భవిష్యత్తులో ప్రభుత్వ సహాయంపై ఆధారపడబోమని ఆర్థికంగా గ్యారెంటీ ఇస్తూ 'పబ్లిక్ ఛార్జ్ బాండ్' సమర్పించే వెసులుబాటును కూడా కల్పించారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.