Donald Trump : భారత్ సహా మరో 17 దేశాల పై ట్రంప్ టారీఫ్ బాంబ్.. కొత్త రూల్‌తో వ్యాపారులకు చుక్కలే
Donald Trump : అమెరికా భారత్‌తో పాటు 16 దేశాలపై 10% దిగుమతి సుంకాలు విధించింది. ఫోర్స్డ్ లేబర్ నిరోధించడంలో విఫలమయ్యారనే కారణంతో డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Donald Trump
Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని యంత్రాంగం అంతర్జాతీయ వాణిజ్యంలో సంచలన నిర్ణయం తీసుకుంది. ఫోర్స్డ్ లేబర్ (వెట్టి చాకిరీ/బలవంతపు శ్రమ) ద్వారా ఉత్పత్తి చేసిన వస్తువుల దిగుమతులను నిరోధించడంలో విఫలమయ్యాయనే నెపంతో భారత దేశంతో పాటు మరో 16 దేశాలపై 10 శాతం మేర అదనపు టారిఫ్‌లు విధిస్తున్నట్లు యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ జెమిసన్ గ్రీర్ అధికారికంగా ప్రకటించారు. 1974 ట్రేడ్ యాక్ట్‌లోని సెక్షన్ 301 కింద దాదాపు 60 ఆర్థిక వ్యవస్థలపై పన్ను చర్యలు తీసుకున్నట్లు యూఎస్‌టీఆర్ తెలిపింది.
12.5% నుంచి 10 శాతానికి తగ్గిన టారిఫ్ రేటు
గతంలో ప్రతిపాదించిన సుంకాలతో పోలిస్తే భారత్‌కు కొంత ఊరట లభించిందనే చెప్పాలి. మొదట భారత ఉత్పత్తులపై ఏకంగా 12.5 శాతం టారిఫ్ విధించే కేటగిరీలో ఉంచినప్పటికీ, దానిని ఇప్పుడు 10 శాతానికి తగ్గించారు. జూన్ 14న భారత్ తన విదేశీ వాణిజ్య విధానంలో కీలక మార్పులు చేస్తూ, బలవంతపు శ్రమ ద్వారా తయారయ్యే వస్తువుల దిగుమతులపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సానుకూల చర్యలను పరిగణనలోకి తీసుకుని అమెరికా సుంకాన్ని 10 శాతానికి సవరించింది. ఈ పన్నుల పరిధిలో భారత్‌తో పాటు కెనడా, బ్రిటన్, బాంగ్లాదే, పాకిస్తాన్ సహా మొత్తం 17 దేశాలు ఉన్నాయి.
లీగల్ వివాదాలు, ట్రంప్ నిర్ణయం
గతంలో ఆమోదించిన అత్యవసర అధికారాలను ఉపయోగించి ట్రంప్ ప్రభుత్వం విధించిన పరస్పర టారిఫ్‌లను అమెరికా సుప్రీంకోర్టు చట్టవిరుద్ధమని కొట్టివేసింది. ఆ తీర్పు అనంతరం తాత్కాలికంగా అన్ని దేశాలపై 10 శాతం గ్లోబల్ టారిఫ్‌ను విధించారు. ఆ గడువు ముగియడానికి సరిగ్గా ఒక్కరోజు ముందు యూఎస్‌టీఆర్ ఈ కొత్త విధానాన్ని ముందుకు తెచ్చింది. శ్రామికుల సంక్షేమాన్ని కాపాడటానికే మానవ హక్కుల ఉల్లంఘనలను అడ్డుకునే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నామని అమెరికా వాదిస్తోంది.
భారత్ అభ్యంతరం, ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు
అమెరికా చేపట్టిన ఈ ఏకపక్ష విచారణలు మరియు సుంకాల విధింపుపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రెండు దేశాల మధ్య ప్రస్తుతం జరుగుతున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద చర్చల్లో ఇరుపక్షాలు మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చని భారత్ స్పష్టం చేసింది. అమెరికా అనేది భారత్‌కు రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి, ఎగుమతులకు అత్యంత ప్రధానమైన మార్కెట్. 2025 వాణిజ్య శాఖ గణాంకాల ప్రకారం.. ఇరుదేశాల మధ్య వార్షిక ద్వైపాక్షిక సరుకుల వాణిజ్యం 141 బిలియన్ డాలర్లు కాగా, అందులో భారత్ నుంచి అమెరికాకు జరిగిన ఎగుమతులే ఏకంగా 87.3 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.




