Donald Trump : అమెరికా-ఇరాన్ మధ్య 60 రోజుల ఒప్పందం....ట్రంప్ నిర్ణయం పైనే ప్రపంచ దేశాల ఉత్కంఠ!
Donald Trump : అమెరికా, ఇరాన్ దేశాల మధ్య 60 రోజుల తాత్కాలిక సీజ్‌ఫైర్ ఒప్పందం కుదిరింది.
Donald Trump
Donald Trump : యుద్ధ మేఘాలతో నిత్యం అట్టుడుకుతున్న మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో శాంతి పునరుద్ధరణ కోసం ఒక అతిపెద్ద దౌత్యపరమైన అడుగు పడింది. తీవ్ర శత్రుదేశాలైన అమెరికా, ఇరాన్‌ల మధ్య 60 రోజుల పాటు తాత్కాలిక సీజ్‌ఫైర్ పొడిగింపునకు, ఇరాన్ వివాదాస్పద అణు కార్యక్రమంపై తిరిగి చర్చలు ప్రారంభించడానికి ప్రాథమిక అంగీకారం కుదిరింది. ఈ మేరకు ఇరు దేశాల మధ్య ప్రతిపాదించిన అవగాహనా ఒప్పందం ప్రస్తుతం అంతర్జాతీయంగా పెను సంచలనంగా మారింది.
అయితే ఈ చారిత్రాత్మక ఒప్పందం కార్యరూపం దాల్చాలంటే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీల నుండి తుది ఆమోదం లభించాల్సి ఉంది. ఈ చర్చలు సఫలమైతే గత కొన్నేళ్లుగా సాగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతలకు బ్రేక్ పడే అవకాశం ఉందని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఒకవైపు దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం సీజ్‌ఫైర్ అమలో లేనట్లే కనపడుతోంది. ఇరాన్ తమ దేశ సరిహద్దుల్లో కాల్పుల విరమణ నిబంధనలను ఉల్లంఘించిందని అమెరికా మిలిటరీ గురువారం నాడు సంచలన ఆరోపణలు చేసింది.
మరోవైపు బుధవారం అర్ధరాత్రి ఇరాన్ ప్రయోగించిన ప్రమాదకరమైన మిసైళ్లను కువైట్ విజయవంతంగా అడ్డుకుందని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అమెరికాకు అత్యంత కీలక భాగస్వామిగా ఉన్న దేశంపై జరిగిన ఈ దాడిని భారీ సీజ్‌ఫైర్ ఉల్లంఘనగా అమెరికా సైనిక అధికారులు అభివర్ణించారు. ఇటువంటి ఉద్రిక్త వాతావరణంలోనే ఈ 60 రోజుల నయా ఒప్పందం తెరపైకి రావడం విశేషం.
ప్రతిపాదిత 60 రోజుల ఒప్పందంలో భాగంగా ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హోర్ముజ్ స్ట్రెయిట్ గుండా అంతర్జాతీయ నౌకల రాకపోకలు ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగాలని నిర్ణయించారు. ఈ మార్గంలో ప్రయాణించే షిప్‌లపై ఎలాంటి అదనపు టోల్ టాక్స్‌లు వేయకూడదని, నౌకలను వేధించకూడదని ఒప్పందంలో స్పష్టం చేశారు.
దీనికి ప్రతిగా ఇరాన్ తమ ఆధీనంలో ఉన్న హోర్ముజ్ స్ట్రెయిట్ సముద్ర మార్గం నుంచి రాబోయే 30 రోజుల్లోగా అన్ని రకాల మైన్స్‌ను పూర్తిగా తొలగించాల్సి ఉంటుంది. కమర్షియల్ షిప్పింగ్ సజావుగా సాగడాన్ని బట్టి అమెరికా సైతం సముద్ర మార్గంలో విధించిన నావికా దళ ఆంక్షలను ఎత్తివేయడానికి సుముఖత వ్యక్తం చేసింది.
ఈ తాత్కాలిక సీజ్‌ఫైర్ ఒప్పందం కుదరాలంటే ఇరాన్ ఎట్టిపరిస్థితుల్లోనూ అణు ఆయుధాలను తయారు చేయబోనని గట్టిగా ప్రామిస్ చేయాల్సి ఉంటుంది. ఈ 60 రోజుల వ్యవధిలో జరిగే శాంతి చర్చల్లో.. ఇరాన్ వద్ద ఇప్పటికే అత్యధికంగా నిల్వ ఉన్న ఎన్‌రిచ్డ్ యురేనియంను ఎలా డిస్పోజ్ చేయాలనే దానిపైనే ప్రధానంగా చర్చించనున్నారు.
ఇరాన్ గనుక ఈ అణు నిబంధనలకు కట్టుబడి ఉంటే.. దానికి బదులుగా అమెరికా తమపై ఉన్న ఆర్థిక ఆంక్షలను కొంతవరకు సడలించడంతో పాటు, గతంలో నిలిపివేసిన ఇరాన్ నిధులను తిరిగి విడుదల చేయడానికి అంగీకరించింది. దీనివల్ల ఇరాన్ దేశానికి అవసరమైన నిత్యావసర వస్తువులు మరియు మానవతా సాయం సులభంగా అందుతాయి.
ఈ సరికొత్త ఒప్పందంలో కేవలం అమెరికా-ఇరాన్ సంబంధాలే కాకుండా మిడిల్ ఈస్ట్‌లోని ఇతర యుద్ధ దేశాల ప్రస్తావన కూడా ఉంది. ముఖ్యంగా లెబనాన్‌లో ఇజ్రాయెల్, హిజ్బుల్లా బలగాల మధ్య సాగుతున్న ఘోర యుద్ధానికి కూడా స్వస్తి పలకాలని ఈ MoUలో పేర్కొన్నారు. ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు మధ్య గతంలో తీవ్రమైన చర్చలు జరిగాయి.
అమెరికా అధికారులు స్పష్టం చేసిన దాని ప్రకారం.. ఈ ఒప్పందంలో ఇరాన్‌కు నిధులు ఇవ్వడం వెనుక ఎలాంటి సీక్రెట్ క్లాజ్‌లు లేదా సైడ్ డీల్స్ లేవు. "ఇరాన్ ఎంతగా సహకరిస్తే.. అంత ఎక్కువ రాయితీలు పొందుతుంది" అని ఒక అధికారి కుండబద్దలు కొట్టారు.
ప్రస్తుతానికి ఈ డీల్ నిబంధనలపై ఇరు దేశాల దౌత్యవేత్తల మధ్య అంగీకారం కుదిరినప్పటికీ, ట్రంప్ మాత్రం దీనిపై త్వరపడి సంతకం చేయలేదు. "ఈ ఒప్పందం గురించి ఆలోచించడానికి నాకు మరికొన్ని రోజుల సమయం కావాలి" అని ట్రంప్ మధ్యవర్తులకు తెలిపినట్లు సమాచారం.
ఒకవేళ చర్చల సమయంలో ఇరాన్ అణు విషయంలో మాట తప్పితే.. ట్రంప్ వద్ద సైనిక దాడి లేదా మరింత కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించేలా అన్ని రకాల ఆప్షన్లు సిద్ధంగా ఉన్నాయని అధికారులు హెచ్చరించారు. ఈ ప్రాంతంలో మొహరించిన అమెరికా సైన్యం వెనక్కి వెళ్లడం అనేది ఇరాన్ ప్రవర్తన, తుది శాంతి ఒప్పందం పైనే ఆధారపడి ఉంటుంది.




