Strait of Hormuz: కాల్పుల విరమణలో కీలక పరిణామం.. హోర్ముజ్‌ జలసంధిపై అంతరాలు తొలగినట్టేనా?

Strait of Hormuz: అమెరికా–ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్‌ 22తో ముగియనున్న కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత పరిస్థితి ఎలా మారుతుందన్నది కీలకంగా మారింది.

Balachander
Published on: 17 April 2026 9:50 AM IST
US-Iran Ceasefire Tensions Will Strait of Hormuz Crisis Ease After April 22?
X

US Iran Ceasefire Strait of Hormuz

Strait of Hormuz: అమెరికా–ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్‌ 22తో ముగియనున్న కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత పరిస్థితి ఎలా మారుతుందన్నది కీలకంగా మారింది. విరమణను పొడిగిస్తారా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. రెండో విడత చర్చలపై అమెరికా, ఇరాన్‌ మధ్య విభిన్న అభిప్రాయాలు ఉండటం గమనార్హం.

ఎక్కడున్నా అడ్డుకుంటాం

ఇరాన్‌ తమ ప్రధాన డిమాండ్లైన హోర్ముజ్‌ జలసంధి నియంత్రణ, నష్టపరిహారం, ఆస్తుల విడుదల, అణు కార్యక్రమాల విషయంలో సడలింపులు కోరుతోంది. ఈ షరతులకు అంగీకరిస్తేనే చర్చలకు సిద్ధమని తెలిపింది. మరోవైపు అమెరికా మాత్రం కఠిన వైఖరి అవలంబిస్తూ, తమ షరతులకు ఇరాన్‌ తలొగ్గకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది.

ఇప్పటికే అమెరికా సైన్యం ఇరాన్‌ పోర్టులపై దిగ్బంధనం కొనసాగిస్తోంది. ప్రపంచ సముద్ర జలాల్లో ఎక్కడ ఉన్నా ఇరాన్‌కు చెందిన నౌకలను అడ్డుకుంటామని ప్రకటించడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. ముఖ్యంగా పసిఫిక్‌ సముద్రంలో ఉన్న నౌకలను లక్ష్యంగా చేసుకోవడం కొత్త ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. ఆయుధాలు, ఎలక్ట్రానిక్ వస్తువులను తరలించే నౌకలను సీజ్ చేసేందుకు అమెరికా సైన్యం సిద్ధమైంది. దీనికి ప్రతిగా, తమ క్షిపణులతో అమెరికా యుద్ధ నౌకలను సముద్ర గర్భంలో కలిపేస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది.

భారత్‌ ఆందోళన

ఇదే సమయంలో భారత్‌ ఈ పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఐక్యరాజ్యసమితిలో భారత ప్రతినిధి హరీశ్‌ పర్వతనేని మాట్లాడుతూ, హోర్ముజ్‌ జలసంధి ద్వారా జరిగే వాణిజ్య రవాణా భారత్‌కు అత్యంత కీలకం అని స్పష్టం చేశారు. ఇంధన సరఫరాలో సుమారు 60% వరకు ఆధారపడే మార్గం ఇదే కావడంతో, నౌకాయాన భద్రతపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని పేర్కొన్నారు. అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తూ, వాణిజ్య నౌకాయానానికి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని భారత్‌ పిలుపునిచ్చింది. దౌత్యపరమైన చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం సాధ్యమని సూచించింది.

మొత్తంగా చూసుకుంటే... ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య 10 రోజుల విరామం కాస్త ఊరటనిచ్చినా, హోర్ముజ్ జలసంధి వ్యవహారం మాత్రం పీటముడిగానే ఉంది. కాల్పుల విరమణ తర్వాత ఉద్రిక్తతలు తగ్గుతాయా లేదా మరింత పెరుగుతాయా అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది. ప్రపంచ వాణిజ్యం, ఇంధన భద్రతపై దీని ప్రభావం కీలకంగా ఉండనుంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story