US Iran Deal: చివరి దశకు అమెరికా - ఇరాన్ డీల్...మంచిరోజులు రాబోతున్నాయి
సుదీర్ఘ కాలంగా ప్రపంచ దేశాలను, అంతర్జాతీయ మార్కెట్లను వణికించిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలకు ఎట్టకేలకు తెరపడబోతోందనే సంకేతాలు వెలువడుతున్నాయి.
US Iran Deal: సుదీర్ఘ కాలంగా ప్రపంచ దేశాలను, అంతర్జాతీయ మార్కెట్లను వణికించిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలకు ఎట్టకేలకు తెరపడబోతోందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం ముగింపు దశకు చేరుకుందన్న వార్తలతో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఒక్కసారిగా భారీగా పతనమయ్యాయి. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా, ఇరాన్‌లు ఒక అంగీకారానికి వచ్చాయని, మరికొద్ది గంటల్లోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ వార్తా సంస్థ 'అల్-అరేబియా' వెల్లడించింది. ఈ పరిణామం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎంతో ఊరటనిచ్చే విషయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు ఎలాంటి విఘాతం కలగదనే నమ్మకం కుదరడంతో మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి.
ఒక్కసారిగా రివర్స్ అయిన అంతర్జాతీయ చమురు ధరలు
ఆ ఒప్పంద వార్త బయటకు రాకముందు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు సుమారు 3.5% పైగా పెరిగాయి. అయితే, చర్చలు సఫలమయ్యాయనే నివేదికలు రాగానే మార్కెట్ ఒక్కసారిగా యూ-టర్న్ తీసుకుంది. అంతర్జాతీయ ప్రామాణికమైన బ్రెండ్ క్రూడ్ ధర 2.6 శాతం పడిపోయింది. ప్రస్తుతం 102.30 డాలర్ల వద్ద ఉన్నది. ఇక అమెరికాకు చెందిన వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ధర కూడా 2.5 శాతం తగ్గి బ్యారెల్ ధర 96 డాలర్ల వద్ద ఉంది.
ఒప్పందంలోని ముఖ్యమైన ముఖ్యాంశాలు
ఇరు పక్షాలు తక్షణమే దాడులను నిలిపివేయడంతో పాటు, ప్రాంతీయంగా ఉన్న రక్షణ, పారిశ్రామిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోకూడదని అంగీకరించాయి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన పర్షియన్ గల్ఫ్, హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలకు పూర్తి స్వేచ్ఛనివ్వడానికి, ఉమ్మడి పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఇరు దేశాలు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇరాన్ ఈ ఒప్పంద నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తే, అమెరికా ఆ దేశంపై విధించిన ఆర్థిక ఆంక్షలను విడతలవారీగా ఎత్తివేయనుంది.
అణు ఇంధన నిల్వలపై డోనాల్డ్ ట్రంప్ పట్టు
అంతకుముందు, ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తాము శుద్ధి చేసిన యురేనియం నిల్వలను విదేశాలకు పంపే ప్రసక్తే లేదని ప్రకటించడంతో చర్చల్లో కాస్త ప్రతిష్టంభన ఏర్పడింది. కానీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రం ఇరాన్ వద్ద బాంబు తయారీకి పనికొచ్చే యురేనియం నిల్వలు ఉండటానికి వీల్లేదని గట్టిగా స్పష్టం చేశారు. "మాకు అది వద్దు, ఇరాన్ దగ్గర కూడా అది ఉండనివ్వం" అని ట్రంప్ తేల్చి చెప్పారు. ఏదేమైనప్పటికీ, పాకిస్తాన్ రాయబారంతో ఇరు దేశాల మధ్య కుదిరిన ఈ తాత్కాలిక డ్రాఫ్ట్ ఒప్పందం సఫలమైతే, రాబోయే రోజుల్లో చమురు ధరలు మరింత తగ్గి సామాన్యుడికి మంచి రోజులు రావడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఇప్పటికే అత్యధిక ఒత్తిడిలో ఉన్న అమెరికా ఈ ఒప్పందాన్ని చేసుకోవడానికి మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. అన్ని వైపుల నుంచి అమెరికాకు ఒత్తిళ్లు ఏర్పడుతున్న తరుణంలో ఈ ఒప్పందం జరుగుతండటం విశేషం. ఇప్పటికైనా మద్యప్రాచ్యంలో శాంతి పవనాలు చల్లని గాలులను వీయాలని కోరుకుందాం.




