US - Iran War: హమ్మయ్య యుద్ధం ముగిసింది..ఇరాన్‌దే పైచేయి

US - Iran War: అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరింది.

Naresh.k
Published on: 15 Jun 2026 7:12 AM IST
US - Iran War
X

US - Iran War: హమ్మయ్య యుద్ధం ముగిసింది..ఇరాన్‌దే పైచేయి

US-Iran Historic Peace Deal: ప్రపంచాన్ని ఇన్నాళ్లూ వణికించిన గల్ఫ్ ఉద్రిక్తతలకు తెరపడింది. ఎప్పుడేం జరుగుతుందోనన్న యుద్ధ భయాల మధ్య.. అమెరికా, ఇరాన్ దేశాలు ఊహించని విధంగా శాంతి చేతులు చాచాయి. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరినట్లు అధికారిక ప్రకటనలు వెలువడటంతో అంతర్జాతీయ సమాజం ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. అమెరికాతో యుద్ధాన్ని ముగించేందుకు అధికారికంగా ఒప్పందం కుదిరిందని ఇరాన్ డిప్యూటీ విదేశీ మంత్రి ఘరీబాబాది సంచలన ప్రకటన చేశారు. ఈ చారిత్రాత్మక ఒప్పందంపై ఈ నెల 19వ తేదీన స్విట్జర్లాండ్ వేదికగా ఇరు దేశాలు సంతకాలు చేయనున్నాయి.

తుది ఒప్పందానికి పూర్తి రూపం ఇచ్చేందుకు మరో 60 రోజుల పాటు ఇరు దేశాల ప్రతినిధుల మధ్య చర్చలు కొనసాగుతాయని ఆయన వెల్లడించారు. ఈ ఒప్పందం తక్షణమే అమలులోకి వస్తుందని, లెబనాన్ సహా ఇతర ప్రాంతాలలో సాగుతున్న మిలిటరీ ఆపరేషన్లను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఒప్పందం కుదిరినంత మాత్రాన శత్రువును గుడ్డిగా నమ్మేసినట్లు కాదని ఘరీబాబాది అమెరికాకు గట్టి హెచ్చరికనే పంపారు. ఒప్పందం అయితే చేసుకున్నాం కానీ, అమెరికా తన హామీలకు ఎంతవరకు కట్టుబడి ఉంటుందో అనేది మేము నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉంటామని ఇరాన్ డిప్యూటీ విదేశీ మంత్రి ఘరీబాబాది తెలిపారు.

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో ఈ ఒప్పందంపై స్పందించారు. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి ఇకపై ఎలాంటి టోల్ టాక్స్ లు, ఆంక్షలు లేకుండా పూర్తిగా ఓపెన్ అవుతుందని ఆయన ప్రకటించారు. ఇన్నాళ్లూ ఇరాన్‌పై విధించిన యూఎస్ నావికా దిగ్బంధనాన్ని పూర్తిగా తొలగిస్తున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. ప్రపంచ దేశాల వాణిజ్య నౌకలను ఉద్దేశించి.. ఇక ఆలస్యం ఎందుకు? మీ షిప్‌ల ఇంజిన్లు స్టార్ట్ చేయండి.. ఆయిల్ తరలింపులు మొదలుపెట్టండి అంటూ ట్రంప్ ఇచ్చిన పిలుపు ఇప్పుడు గ్లోబల్ మార్కెట్‌లో జోష్ నింపింది. ఈ శాంతి ఒప్పందంతో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు అదుపులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు ఆర్థిక నిపుణులు. యుద్ధం ముగిసి, వాణిజ్య మార్గాలు తెరుచుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు మళ్లీ పుంజుకోనున్నాయి.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story