US Iran tensions: పశ్చిమాసియాలో వింత వాదన...డీల్‌ కుదిరితేనే దారిస్తాం

US Iran tensions: పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై తన పట్టును మరింత బిగించారు.

Balachander
Published on: 21 April 2026 9:53 AM IST
US Iran tensions
X

US Iran tensions

US Iran tensions: పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై తన పట్టును మరింత బిగించారు. "మా షరతులకు ఒగ్గి డీల్ కుదుర్చుకుంటేనే దారి ఇస్తాం.. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి" అంటూ ఆయన పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం ఇరాన్ ఆర్థికంగా, సైనికంగా బలహీనపడిందని, అమెరికా వ్యూహాత్మక ఆధిక్యంలో ఉందన్నది ట్రంప్ ప్రధాన వాదిస్తున్నారు. మరి ఈ వాదనల్లో ఏది కరెక్ట్‌ తెలుసుకుందాం.

యుద్ధ క్షేత్రంలో అమెరికా ధీమా

ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా అంతర్జాతీయ మీడియా సంస్థలపై విమర్శలు గుప్పిస్తూనే, ఇరాన్ ప్రస్తుత స్థితిగతులను వివరించారు. అమెరికా విధిస్తున్న ఆంక్షలు, సముద్ర నిర్బంధం వల్ల ఇరాన్ ప్రతిరోజూ సుమారు 500 మిలియన్ డాలర్ల భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూస్తోందని ట్రంప్‌ పేర్కొన్నారు. ఇరాన్ నౌకాదళం, వైమానిక రక్షణ వ్యవస్థలు ఇప్పటికే కుప్పకూలాయని, ఇక మిగిలింది చర్చల ద్వారా లొంగిపోవడమేనని ట్రంప్ భావిస్తున్నారు. చర్చల ద్వారా లొంగిపోకుంటే ఆ దేశం నామరూపాలు లేకుండా పోతుందని, చరిత్రలో ఇరాన్‌ ఒకటి ఉండేదని చెప్పుకోవలసి వస్తుందని అన్నారు.

ఇస్లామాబాద్ వేదికగా కీలక చర్చలు

ఈ సంక్షోభానికి తెరదించేందుకు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌ వేదికగా రెండో విడత చర్చలు జరగనున్నాయి. ఈ బృందంలో అమెరికా తరపున కీలక నేతలైన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, ట్రంప్‌ అల్లుడు, మధ్య ప్రాచ్య వ్యవహారాల నిపుణుడు జెర్డ్‌ కుష్నెర్‌, ప్రత్యేక ప్రతినిధి స్టీవ్‌ విట్కోఫ్‌ తదితరులు పాల్గొననున్నారు. ఈ బృందం ఇరాన్‌ ప్రతినిధులతో భేటీ కానున్నది. ఇరాన్‌ చేపడుతున్న అణ్వాయుధ కార్యక్రమాన్ని పూర్తిగా పక్కన పెట్టాలన్నదే అమెరికా పెట్టిన ప్రధాన షరతు. ఈ చర్చలు విఫలమైతే, బుధవారం ముగియనున్న కాల్పుల విరమణ తర్వాత ఇరాన్ మౌలిక సదుపాయాలపై పూర్తిస్థాయి యుద్ధం మొదలయ్యే ప్రమాదం ఉంది.

ఇరాన్ ఎదురుదాడి

అయితే ఇరాన్‌ వాదనలను ఇరాన్‌ తోసిపుచ్చుతోంది. బెదిరింపుల నీడలో చర్చలు జరపడం సాధ్యం కాదని ఇరాన్ స్పీకర్ ఘాలిబఫ్ స్పష్టం చేశారు. ఒకవేళ యుద్ధం మళ్ళీ మొదలైతే తమ దగ్గర కొత్త వ్యూహాలు ఉన్నాయని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధిపై ఉన్న పట్టును ఇరాన్ ఆయుధంగా వాడుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో హోర్ముజ్‌ జలసంధిపై పట్టుకోసం రెండు దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

గతంలో జరిగిన మొదటి విడత చర్చలు 21 గంటల పాటు సాగినా ఎటువంటి ఫలితం రాలేదు. ఇప్పుడు జరుగుతున్న రెండో దఫా చర్చలే చివరి అవకాశం అని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ తన మొండి వైఖరితో ఇరాన్‌ను దారికి తెచ్చుకుంటారా? లేక పశ్చిమాసియా మరో భారీ యుద్ధానికి సాక్ష్యంగా నిలుస్తుందా? అనేది ఈ ఇస్లామాబాద్ చర్చల ఫలితమే తేల్చనుంది. ఒకవేళ యుద్ధం అనివార్యమైతే చమురు ధరలు ఆకాశాన్ని తాకే అవకాశం ఉంది. కాబట్టి సామాన్యులు భారాన్ని మోయడానికి సిద్దంకాక తప్పదు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story