US-Iran War: ముదిరిన ఉద్రిక్తతలు.. అమెరికా భీకర వైమానిక దాడులు

US-Iran War: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దశాబ్దాలుగా నడుస్తున్న ప్రచ్ఛన్న యుద్ధం ఇప్పుడు బహిరంగ ఘర్షణకు దారితీసింది. హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) పై

G Krishna
Published on: 10 Jun 2026 10:47 AM IST
US Iran war
X

US Iran war

US-Iran War: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దశాబ్దాలుగా నడుస్తున్న ప్రచ్ఛన్న యుద్ధం ఇప్పుడు బహిరంగ ఘర్షణకు దారితీసింది. హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) పై ప్రయాణిస్తున్న అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్‌ను ఇరాన్ కూల్చివేసిందనే ఆరోపణల నేపథ్యంలో, ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా భీకర వైమానిక దాడులతో విరుచుకుపడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు జరిగిన ఈ దాడులు గల్ఫ్ రీజియన్‌లో తీవ్ర కలకలం రేపాయి. ఇరు దేశాల మధ్య ఘర్షణలు మరింత తీవ్రరూపం దాల్చడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై దీని ప్రభావం పడుతుందేమోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

అపాచీ హెలికాప్టర్ కూల్చివేతే కారణం

అమెరికా సైనిక వర్గాల సమాచారం ప్రకారం, హోర్ముజ్ జలసంధిపై పెట్రోలింగ్ నిర్వహిస్తున్న అమెరికా 'అపాచీ హెలికాప్టర్'ను ఇరాన్‌కు చెందిన ఒక వన్-వే అటాక్ డ్రోన్ (ఆత్మాహుతి డ్రోన్) ఢీకొట్టి కూల్చివేసింది. ఈ ప్రమాదం నుండి హెలికాప్టర్‌లోని ఇద్దరు అమెరికన్ పైలట్లు ప్రాణాలతో బయటపడ్డారని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించారు. అయితే, ఇరాన్ చేసిన ఈ దుశ్చర్యను అమెరికా ఊరికే వదిలిపెట్టబోదని, దీనికి తగిన సమాధానం ఇస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఈ క్రమంలోనే ఇరాన్ దురాక్రమణకు ప్రతీకారంగానే తాము ఈ "ఆత్మరక్షణ" దాడులు చేపట్టినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకటించింది.

దక్షిణ ఇరాన్‌పై బాంబుల వర్షం

అమెరికా సైన్యం పక్కా ప్రణాళికతో హోర్ముజ్ జలసంధి పరిసరాల్లో ఉన్న ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు (Air Defense Systems), రాడార్ కేంద్రాలు, గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్లను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించింది. బుధవారం తెల్లవారుజామున దక్షిణ ఇరాన్‌లోని పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఇరాన్‌కు చెందిన ఫార్స్, మెహర్ వార్తా సంస్థల కథనం ప్రకారం హోర్మోజ్‌గాన్ ప్రాంతం, వ్యూహాత్మక ఓడరేవు నగరమైన బందర్ అబ్బాస్, సిరిక్ పట్టణం , కేష్మ్ (Qeshm) దీవులపై అమెరికా క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడుల వల్ల సిరిక్ పట్టణంలోని ఒక టెలికమ్యూనికేషన్ టవర్, రెండు వాటర్ ట్యాంకులు ధ్వంసమయ్యాయని ఇరాన్ మీడియా పేర్కొంది. కాగా, తమ లక్ష్యాలను విజయవంతంగా ధ్వంసం చేశాక దాడులను ముగించినట్లు యూఎస్ మిలిటరీ వెల్లడించింది.

మా ప్రాంతం విడిచి వెళ్ళిపోండి: ఇరాన్ హెచ్చరిక

అమెరికా దాడులపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ తీవ్రంగా స్పందించారు. అమెరికా దాడులను తప్పుబడుతూ, గతంలో పర్షియన్ గల్ఫ్ చరిత్రలో చొరబాటుదారులకు పట్టిన గతినే అమెరికా కూడా ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. "విదేశీ సైనిక బలగాలు మా సరిహద్దుల్లో ఉంటే ఇలాంటి ప్రమాదాలు, తప్పుడు అంచనాలు తప్పవు. వారు క్షేమంగా ఉండాలంటే మా ప్రాంతాన్ని విడిచి వెంటనే వెళ్ళిపోవడమే ఏకైక మార్గం" అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. అలాగే గత 24 గంటల్లో హోర్ముజ్ జలసంధిలో తామెలాంటి దాడులు చేయలేదని ఇరాన్ సైనిక వర్గాలు సమర్థించుకున్నాయి.

అమెరికా 5వ నౌకాదళంపై ఇరాన్ ఎదురుదాడి

అమెరికా వైమానిక దాడులకు ఇరాన్ అంతే వేగంగా స్పందించింది. బహ్రెయిన్‌లో ఉన్న అమెరికాకు చెందిన శతాబ్దపు సుప్రసిద్ధ ‘ఫిఫ్త్ ఫ్లీట్’ (5th Fleet - ఐదో నౌకాదళ స్థావరం)పై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) డ్రోన్లతో ఎదురుదాడికి దిగారు. అమెరికా దురాక్రమణ ఇలాగే కొనసాగితే మరిన్ని తీవ్రమైన పరిణామాలు ఉంటాయని, అమెరికా చేసే ఏ దాడిని కూడా తాము వదిలిపెట్టబోమని ఇరాన్ సైన్యం హెచ్చరించింది.

ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఘర్షణలు ఇంకా కొనసాగుతుండటంతో అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతోంది. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి వద్ద యుద్ధ వాతావరణం నెలకొనడం గ్లోబల్ ఎనర్జీ మార్కెట్‌ను భయపెడుతోంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story