US Iran War : మళ్లీ భగ్గుమన్న అమెరికా-ఇరాన్ యుద్ధం.. హోర్ముజ్ జలసంధిపై ట్రంప్ సంచలన ప్రకటన
US Iran War : అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధ ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిపై తమదే నియంత్రణ అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
US Iran War
US Iran War : అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కొనసాగుతున్న పోరు ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రపంచ ముడి చమురు, సహజ వాయువు రవాణాకు అత్యంత కీలకమైన పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని హోర్ముజ్ జలసంధి పై తమకే పూర్తి నియంత్రణ ఉందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోమవారం నాడు సంచలన ప్రకటన చేశారు. ఈ సముద్ర మార్గం గుండా ప్రయాణించే వాణిజ్య నౌకల రక్షణ కోసం అమెరికా సరికొత్త విధానాన్ని అమలు చేయబోతోందని, సురక్షిత ప్రయాణాన్ని కల్పిస్తున్నందుకు గాను ప్రతి నౌక నుంచి 20 శాతం చొప్పున టోల్ టాక్స్ వసూలు చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ఇరాన్ నౌకలకు నో ఎంట్రీ
ఇరాన్‌కు ఆర్థికంగా, వ్యూహాత్మకంగా గట్టి దెబ్బ కొట్టేందుకు అమెరికా సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. హోర్ముజ్ జలసంధి గుండా ఇరాన్ దేశానికి చెందిన ఏ ఒక్క నౌక కూడా ప్రయాణించడానికి వీల్లేకుండా నౌకాబంధీని పునరుద్ధరిస్తున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. ఈ ఆంక్షలు కేవలం ఇరాన్ నౌకలకు, వారి ఖాతాదారులకు మాత్రమే వర్తిస్తాయని, మిగిలిన ప్రపంచ దేశాలన్నీ ఈ సముద్ర మార్గాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా వాడుకోవచ్చని అమెరికా వెల్లడించింది. అయితే, ఓ వైపు యుద్ధాన్ని ముగించేందుకు అంతర్జాతీయంగా దౌత్యపరమైన చర్చలు జరుగుతున్న తరుణంలోనే ట్రంప్ ఈ కఠిన నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం.
కాల్పుల విరమణ ఒప్పందం భగ్నం
నిజానికి అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధానికి శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు గాను 60 రోజుల పాటు తాత్కాలిక ఒప్పందం కుదిరింది. ఈ గడువు సగానికి చేరిన తరుణంలో, శాంతి చర్చలు ఫలించకపోగా ఇరుపక్షాల మధ్య దాడులు మరింత తీవ్రమయ్యాయి. ఆదివారం ఇరాన్ దేశం ఒమన్ తీరానికి సమీపంలో ఒక కంటైనర్ నౌకను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడంతో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. దీనిపై ట్రంప్ స్పందిస్తూ ఇరు దేశాల ప్రతినిధుల మధ్య జరిగిన 11 గంటల సుదీర్ఘ చర్చల్లో అన్ని అంశాలపై దాదాపు ఒక అవగాహన కుదిరిందని, అయితే చివరి నిమిషంలో ఇరాన్ చర్చల ప్రతినిధులు కొద్దిపాటి మార్పులను ప్రతిపాదించడంతో ఒప్పందం కుదరలేదని వివరించారు.
ఇరాన్‌లోని 140 మిలిటరీ స్థావరాలపై అమెరికా దాడులు
ఇరాన్ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు అమెరికా సైన్యం పెద్ద ఎత్తున విరుచుకుపడింది. అమెరికా మిలిటరీ సెంట్రల్ కమాండ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇరాన్ పరిధిలోని దాదాపు 140 సైనిక లక్ష్యాలపై అమెరికా వైమానిక దాడులు చేసింది. ఇందులో ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు (ఎయిర్ డిఫెన్స్), రాడార్ కేంద్రాలు, మిస్సైల్, డ్రోన్ ప్రయోగ వేదికలు, వారి చిన్న నౌకా దళాలను లక్ష్యంగా చేసుకుని బాంబుల వర్షం కురిపించారు. ఈ దాడిలో ఇరాన్‌లోని హోర్ముజ్‌గాన్, ఖుజెస్తాన్, మరకజీ ప్రాంతాలలో తీవ్ర నష్టం వాటిల్లిందని, ఇద్దరు వ్యక్తులు మరణించారని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఇర్నా ధృవీకరించింది.
మిత్రదేశాలపై క్షిపణుల వర్షం
అమెరికా చేసిన దాడులకు ప్రతిగా ఇరాన్ సైన్యం కూడా భీకర ప్రతిదాడికి దిగింది. అమెరికా సైనిక స్థావరాలు ఉన్న బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమన్ వంటి దేశాల వైపు ఇరాన్ వరుసగా క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. బహ్రెయిన్‌లో అమెరికా నౌకాదళానికి చెందిన 5వ విమాన నిరోధక ప్రధాన కార్యాలయం ఉండటంతో అక్కడ మూడుసార్లు సైరన్లు మోగాయి. జోర్డాన్ తన వైపు దూసుకొచ్చిన నాలుగు ఇరాన్ క్షిపణులను గాల్లోనే కూల్చివేసింది. కువైట్ ఎయిర్ డిఫెన్స్ కూడా శత్రు క్షిపణులను తిప్పికొట్టింది. హోర్ముజ్ జలసంధిని తాము పూర్తిగా మూసివేసామని ఇరాన్ ప్రతినిధి మహ్మద్ బాఘేర్ గలీబాఫ్ ప్రకటించగా, జలసంధి ఇంకా తెరిచే ఉందని దానిపై ఇరాన్‌కు ఎలాంటి నియంత్రణ లేదని అమెరికా సైన్యం కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం పాకిస్తాన్, ఈజిప్ట్, ఖతార్ దేశాలు రంగంలోకి దిగి ఇరుపక్షాలు శాంతించేలా చర్చలు జరుపుతున్నాయి.




