US Iran War : మళ్లీ మొదలైన యుద్ధం.. ఇరాన్‌పై అమెరికా క్షిపణుల వర్షం, భారీగా పెరిగిన చమురు ధరలు
US Iran War : ఇరాన్‌పై అమెరికా క్షిపణులతో విరుచుకుపడటంతో పర్షియన్ గల్ఫ్‌లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. హోర్ముజ్ జలసంధిని తమ 'రెడ్ లైన్'గా ప్రకటించిన ఇరాన్, అమెరికా మిత్రదేశాలపై డ్రోన్లతో దాడి చేసింది.
US Iran War
US Iran War : పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. గత నెలలో కుదిరిన తాత్కాలిక సంధి ముగియడంతో అమెరికా సైన్యం ఇరాన్‌పై దాడులను మరింత ఉధృతం చేసింది. గురువారం నాడు ఇరాన్‌లోని పలు వ్యూహాత్మక సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా క్షిపణుల వర్షం కురిపించింది. ఈ దాడులలో ఇరాన్‌కు చెందిన 35 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, మరో 300 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ అకస్మాత్తు దాడులతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా శరవేగంగా పెరిగిపోయాయి.
పర్షియన్ గల్ఫ్‌లో అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి తమ హద్దు అని, దీనిని దాటాలని చూస్తే సహించేది లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. ఇరాన్ సైనిక ప్రతినిధి కల్నల్ ఇబ్రహీం జోల్ఫగారి అమెరికాను హెచ్చరిస్తూ.. ఒక విదేశీ శక్తిని తమ జలాల్లోకి రానిచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఒకవేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లుగా తమ దేశంలోని పవర్ ప్లాంట్లు, వంతెనలపై దాడులు చేస్తే, పశ్చిమాసియా ప్రాంతంలో ఉన్న అమెరికా మిత్రదేశాల మౌలిక సదుపాయాలను నాశనం చేస్తామని హెచ్చరించారు. ఈ హెచ్చరికలతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ యుద్ధంలో మొదటిసారిగా అమెరికా దాడులు ఇరాన్ రాజధాని టెహ్రాన్ సరిహద్దుల వరకు చేరాయి. టెహ్రాన్, సెమ్నన్ ప్రాంత్నాల్లో ఉన్న ఇరాన్ అంతరిక్ష పరిశోధన కేంద్రాలు, బాలిస్టిక్ క్షిపణి తయారీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా సేనలు దాడులు చేశాయి. గ్రేటర్ టున్బ్ ద్వీపంలో ఉన్న ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను నాశనం చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అలాగే సిస్తాన్-బలూచిస్తాన్ ప్రాంతంలో ఉన్న ఇరాన్ ఆర్మీకి చెందిన 388వ ఇన్‌ఫాంట్రీ బ్రిగేడ్‌పై జరిగిన దాడిలో ఏడుగురు సైనికులు మరణించినట్లు సమాచారం.
అమెరికా దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ కూడా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. బహ్రెయిన్, జోర్డాన్, కువైట్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు ఇరాక్ ప్రధాని అలీ అల్-జైదీ తమ దేశంలోని కుర్దిష్ ప్రాంతంపై జరిగిన డ్రోన్ దాడులను తీవ్రంగా ఖండించారు. ఇరాక్ భూభాగంపై ఉన్న ఇరాన్ మద్దతు గల గ్రూపులను నిరాయుధులను చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.
హోర్ముజ్ జలసంధి గుండా జరిగే చమురు రవాణా తీవ్రంగా దెబ్బతింది. యుద్ధ భయంతో సరుకు రవాణా నౌకల రాకపోకలు దాదాపు పావు వంతు పడిపోయాయి. సముద్రపు దాడుల నుంచి తప్పించుకోవడానికి కొన్ని చమురు రవాణా సంస్థలు తమ నౌకలకు ఉన్న లొకేషన్ ట్రాకర్లను నిలిపివేసి ప్రయాణిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 85 డాలర్లు దాటింది. ఇది సాధారణ రోజుల కంటే 15 శాతం ఎక్కువ. యుద్ధం గనుక మరింత ముదిరితే చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపి, వారిని చర్చల మేజా వద్దకు తీసుకురావడానికి పాకిస్తాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆ దేశ విదేశాంగ శాఖ తెలిపింది. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో శాంతి చర్చలు జరపడం చాలా కష్టంగా మారిందని అంగీకరించింది. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్‌కు తమ చర్యలు నచ్చడం లేదని, వారు కూడా ఒక ఒప్పందానికి రావాలని కోరుకుంటున్నారని వెల్లడించారు. ఇరాన్ జైలులో నిర్బంధంలో ఉన్న అమెరికా పౌరురాలు డెనా కరారీని విడుదల చేయడం ద్వారా ఇరాన్ కూడా చర్చలకు సానుకూల సంకేతాలు పంపిందని ఆయన అభిప్రాయపడ్డారు.




