US Iran War: అన్నంత పని చేసిన ట్రంప్.. తగ్గేదేలే అంటోన్న ఇరాన్. మళ్లీ మొదటికొచ్చిన యుద్ధం

US Iran War: కొన్ని రోజుల పాటు అమెరికా, ఇరాన్‌ల మ‌ధ్య శాంతించిన‌ట్లు క‌నిపించిన ప‌రిస్థితులు మ‌ళ్లీ ఒక్క‌సారిగా ఉద్రిక్తంగా మారింది.

Mokshith
Published on: 9 July 2026 12:46 PM IST
US Iran War
X

US Iran War: అన్నంత పని చేసిన ట్రంప్.. తగ్గేదేలే అంటోన్న ఇరాన్. మళ్లీ మొదటికొచ్చిన యుద్ధం

US Iran War: కొన్ని రోజుల పాటు అమెరికా, ఇరాన్‌ల మ‌ధ్య శాంతించిన‌ట్లు క‌నిపించిన ప‌రిస్థితులు మ‌ళ్లీ ఒక్క‌సారిగా ఉద్రిక్తంగా మారింది. ఇరాన్‌పై దాడులు త‌ప్ప‌వ‌ని ప్ర‌క‌టించిన ట్రంప్‌.. అనంత ప‌ని చేశారు. దీంతో ప‌శ్చిమాసియాలో మ‌రోసారి ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. హర్ముజ్ జలసంధిలో జరిగిన పరిణామాల తర్వాత ఇరు దేశాలు పరస్పరం దాడులకు దిగడంతో పరిస్థితి మరింత దిగ‌జారింది. అమెరికా వైమానిక దాడులు చేయ‌గా.. ధీటుగా స్పందించిన ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యం చేసుకుంది. దీంతో మ‌రోసారి అంతర్జాతీయంగా ఆందోళనలు పెరిగాయి. ఈ పరిణామాలు ప్రపంచ చమురు సరఫరాపై మ‌రోసారి ప్ర‌భావం చూపే అవ‌కాశాలు ఉన్నాయి.

ఉద్రిక్తతలు మ‌ళ్లీ ఎలా మొద‌ల‌య్యాయి.?

కొన్ని రోజుల పాటు ప్ర‌శాంతంగా ఉన్న ప‌రిస్థితులు మ‌ళ్లీ ఉద్రిక్తంగా మార‌డానికి హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులు కార‌ణంగా చెబుతున్నారు. ఇరాన్ ప‌లు నౌక‌ల‌పై దాడి చేయ‌డంతో ఇలాంటి చ‌ర్య‌లు.. సహించబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇకపై ఇలాంటి దాడులు కొనసాగితే మరింత కఠినమైన సైనిక చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. అన్న‌ట్లుగానే ఇరాన్‌పై దాడుల‌కు దిగారు.

ఇరాన్‌పై అమెరికా భారీ వైమానిక దాడులు

ట్రంప్ హెచ్చ‌రించిన కొన్ని గంట‌ల్లోనే అమెరికా సైన్యం ఇరాన్‌లోని పలు వ్యూహాత్మక ప్రాంతాలపై భారీ స్థాయిలో వైమానిక దాడులు చేసింది. బందర్ అబ్బాస్, చాబహార్, కొనారక్, సిరిక్, జస్క్ వంటి కీలక ప్రాంతాలతో పాటు దక్షిణ ఇరాన్‌లోని సైనిక, నౌకాదళ మౌలిక వసతులు లక్ష్యంగా చేసుకొని దాడులు చేశారు. అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఆపరేషన్‌లో 90 ప్ర‌దేశాల‌ను ధ్వంసం చేసిన‌ట్లు స‌మాచారం. చాబహార్ పోర్టు పరిసరాల్లోని సముద్ర రవాణా నియంత్రణ టవర్, ఇతర కీలక నిర్మాణాలకు నష్టం వాటిల్లినట్లు ఇరాన్ మీడియా ప్ర‌క‌టించింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దాడుల అనంతరం సహాయక బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి.

అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతీకార దాడులు

అమెరికా దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు ప్రారంభించింది. బహ్రెయిన్‌లోని అమెరికా ఫిఫ్త్ ఫ్లీట్ ప్రధాన కార్యాలయం, కువైట్‌లోని కొన్ని సైనిక స్థావరాలు లక్ష్యంగా మారినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. అయితే తమ వైపు దూసుకొచ్చిన క్షిపణులు, డ్రోన్లను గగనతలంలోనే అడ్డుకున్నామని కువైట్ ప్రకటించింది. ఖతార్ ప్రాంతంలో కూడా భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేశారు. మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా స్థావరాలపై మరిన్ని దాడులకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్‌కు అనుబంధంగా ఉన్న కొన్ని వర్గాలు హెచ్చరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

చాబహార్ పోర్టుపై ప్రభావం

అమెరికా దాడి చేసిన చాబహార్ పోర్టు భారత్‌కు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైంది. భారత పెట్టుబడులతో అభివృద్ధి చెందుతున్న ఈ డీప్ వాటర్ పోర్టు ద్వారా అఫ్గానిస్థాన్, మధ్య ఆసియా దేశాలతో వాణిజ్యాన్ని విస్తరించాలన్న ప్రణాళిక కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో జరిగిన దాడుల నేపథ్యంలో భవిష్యత్ ప్రాజెక్టులపై ప్రభావం పడే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ అంశంపై భారత్ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

ప్రపంచ చమురు మార్కెట్లలో కలకలం..

హర్ముజ్ జలసంధి గుండా ప్రపంచ చమురు సరఫరాలో పెద్ద ఎత్తున రవాణా అవుతుంది. ఈ మార్గంలో ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయ చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఒక దశలో బ్రెంట్ క్రూడ్ ధరలు సుమారు 7 శాతం వరకు పెరిగి, అనంతరం బ్యారెల్‌కు సుమారు 79 డాలర్ల వద్ద స్థిరపడ్డాయి. ఇదిలా ఉంటే.. గతంలో ప్రారంభమైన శాంతి చర్చలకు తాజా పరిణామాలు పెద్ద ఎదురుదెబ్బగా మారాయి. ఇరాన్ అణు విధానంలో మార్పులు, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (NPT) నుంచి వైదొలగడం వంటి అంశాలను పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అదే సమయంలో అమెరికా కూడా హర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితులు మరింత విషమిస్తే పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితులు మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఇంధన సరఫరా వ్యవస్థపై కూడా దీర్ఘకాల ప్రభావం పడే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story