Iran Alert: ఇరాన్‌లోని అమెరికన్లకు హెచ్చరిక.. వెంటనే దేశం విడిచి వెళ్లాలని సూచన
ఇరాన్‌లో ఉన్న అమెరికా పౌరులు వెంటనే దేశం విడిచి వెళ్లాలని అమెరికా ప్రభుత్వం హెచ్చరించింది. ఇరాన్‌కు ప్రయాణించవద్దని సూచించింది.
Iran News
Iran Alert: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి పెరుగుతున్నాయి. ఇరాన్‌లో ఉన్న అమెరికా పౌరులు వెంటనే ఆ దేశాన్ని విడిచి వెళ్లాలని అమెరికా ప్రభుత్వం హెచ్చరించింది. ఇరాన్‌కు ఎవరూ ప్రయాణించవద్దని స్పష్టం చేసింది. ఇరాన్, యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులు, వారితో కలిసి పనిచేసే ఇతర గ్రూపుల నుంచి అమెరికా పౌరులు, సంస్థలకు ముప్పు ఉండొచ్చని తెలిపింది. ఈ పరిణామాలతో ప్రాంతంలో ఎప్పుడైనా పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది.
అమెరికన్లను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందా?
నవంబర్ 24న అమెరికా వర్చువల్ ఎంబసీ విడుదల చేసిన భద్రతా హెచ్చరికలో ఈ విషయాలను ప్రస్తావించింది. ఇరాన్ ఇటీవల బహ్రెయిన్, కువైట్‌లోని అమెరికా ఆస్తులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు అమెరికా పేర్కొంది. మరోవైపు యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాలోనూ దాడులకు పాల్పడుతున్నారని తెలిపింది. నవంబర్ 25న రియాద్‌లోని ఆర్థిక ప్రాంతంలో ఓ భవనాన్ని లక్ష్యంగా చేసుకున్న హూతీ దాడిలో 11 మంది గాయపడినట్లు సౌదీ పౌర రక్షణ విభాగం వెల్లడించింది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అమెరికా అధికారులు, కార్యాలయాలు, వ్యాపార సంస్థలు కూడా లక్ష్యంగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది.
గగనతలం మూసివేసే ప్రమాదం
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగితే విమాన సర్వీసులకు అంతరాయం కలగవచ్చని అమెరికా హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేసే పరిస్థితి రావచ్చని తెలిపింది. అందువల్ల విమాన ప్రయాణం చేయాలనుకునే అమెరికన్లు ఎయిర్‌లైన్స్, విమానాశ్రయాల నుంచి ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలుసుకోవాలని సూచించింది. ప్రయాణ ప్రణాళికల్లో మార్పులకు సిద్ధంగా ఉండాలని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కోరింది. ఇరాన్ భూ సరిహద్దుల ద్వారా ఇతర దేశాలకు వెళ్లే నిబంధనలు కూడా ఎప్పుడైనా మారవచ్చని హెచ్చరించింది.
అమెరికా పౌరులకు కీలక సూచనలు
అమెరికా పౌరులు ఆందోళనలు, నిరసనలు జరిగే ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించింది. ఎక్కువ మంది గుమిగూడే ప్రదేశాలు, భారీగా పోలీసు బలగాలు మోహరించిన ప్రాంతాలకు దూరంగా ఉండాలని తెలిపింది. అమెరికాకు సంబంధించిన కార్యాలయాలు, సంస్థల దగ్గర అప్రమత్తంగా ఉండాలని కోరింది. గగనతల దాడులు జరిగితే తలుపులు, కిటికీలకు దూరంగా ఉండాలని, కూలిన వస్తువులు లేదా శిథిలాల దగ్గరకు వెళ్లవద్దని సూచించింది. ఫోన్ ఛార్జింగ్‌లో ఉంచుకోవాలని, స్థానిక అధికారుల ఆదేశాలను పాటించాలని తెలిపింది. అమెరికా విదేశాంగ శాఖ అందించే భద్రతా సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందేందుకు Smart Traveler Enrollment Program (STEP)లో నమోదు చేసుకోవాలని కూడా సూచించింది.
1980 నుంచి దౌత్య సంబంధాలు లేవు
అమెరికా, ఇరాన్ మధ్య 1980 నుంచి అధికారిక దౌత్య సంబంధాలు లేవు. అందుకే ఇరాన్‌లో అమెరికా రాయబార కార్యాలయం లేదు. అమెరికా ప్రయోజనాలకు స్విట్జర్లాండ్ ప్రభుత్వం ప్రాతినిధ్యం వహిస్తోంది. టెహ్రాన్‌లోని స్విస్ రాయబార కార్యాలయంలో ఉన్న అమెరికా ప్రయోజనాల విభాగం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో సంప్రదింపులు జరపాలని అమెరికా సూచించింది. అయితే అక్కడి నుంచి అందించే సహాయం కూడా పరిమితంగానే ఉంటుందని అమెరికా విదేశాంగ శాఖ హెచ్చరిస్తోంది. మరోవైపు ఇరాన్‌కు ప్రయాణించవద్దంటూ అమెరికా ఇప్పటికే లెవల్-4 హెచ్చరికను జారీ చేసింది. అంటే ఆ దేశానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణించవద్దన్నది అమెరికా సూచన. తాజా పరిణామాలతో మధ్యప్రాచ్యంలో భద్రతా పరిస్థితులపై ఆందోళన మరింత పెరిగింది.




